నవతెలంగాణ-హైదరాబాద్ : ‘ఆపరేషన్ కాగర్’లో భాగంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు బస్తర్ ఐజీ పి.సుందర్రాజ్ నేతృత్వంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ , స్పెషల్ టాస్క్ ఫోర్స్ , CoBRA దళాలు ఇవాళ తెల్లవారుజామున జాయింట్ కూబింగ్ ఆపరేషన్ను ప్రారంభించాయి.
ఈ క్రమంలోనే మావోయిస్టులు వారి కంటబడగా.. ఇరు వర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఇంద్రావతి నేషనల్ పార్క్ దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో కూబింగ్ ఆపరేషన్ నెమ్మదిగా సాగుతోందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఎన్కౌంటర్ జరిగిన స్పాట్లో ఆయుధాలు, రైఫిళ్లతో పాటు పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం లభించినట్లుగా డీఆర్జీ బృందాలు వెల్లడించాయి. ప్రస్తుతం కూబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని బస్తర్ ఐజీ పి. సుందర్రాజ్ పేర్కొన్నారు. మృతుల సంఖ్య, ఆయుధాల రికవరీకి సంబంధించి మరింత సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది.



