నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా జిల్లాలోని జిల్లా నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల వార్డు స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ రిజర్వేషన్ లు ఖరారు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్సు హాల్ లో అదనపు కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియాలతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు.
జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్ లకు, బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని 38 వార్డులు, ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డులు, భీంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డు స్థానాల కోసం ఎస్.సి, ఎస్సీ(మహిళా), ఎస్.టి, ఎస్టీ(మహిళా), బి.సి, బీసీ(మహిళా), అన్ రిజర్వుడు, అన్ రిజర్వుడు (మహిళా) కేటగిరీల రిజర్వేషన్లను వీడియో రికార్డింగ్ మధ్యన, నిబంధనలను అనుసరిస్తూ ఖరారు చేశారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో ఎస్టీ జనరల్ కేటగిరీకి 1 డివిజన్ కేటాయించబడగా, ఎస్సీ జనరల్ కేటగిరీకి 3 డివిజన్లు, ఎస్సీ మహిళా కేటగిరీకి 2 డివిజన్లు ఖరారయ్యాయని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా బీ.సీ జనరల్ కు 12 డివిజన్లు, బీ.సీ మహిళా కేటగిరీకి 12 డివిజన్లు రిజర్వ్ అయ్యాయని, అన్ రిజర్వుడు కేటగిరీకి 14, అన్ రిజర్వుడు (మహిళా) కేటగిరీకి 16 డివిజన్లు రిజర్వ్ అయ్యాయని వివరించారు.
బోధన్ మున్సిపాలిటీలో ఎస్టీ జనరల్ కేటగిరీకి ఒక వార్డు ఖరారు కాగా, ఎస్సీ జనరల్ కేటగిరీకి 2 వార్డులు, ఎస్సీ మహిళా కేటగిరీకి ఒక వార్డు కేటాయించబడిందని కలెక్టర్ వెల్లడించారు. బీ.సీ జనరల్ కు 8 వార్డులు, బీ.సీ మహిళా కేటగిరీకి 7 వార్డులు రిజర్వ్ అయ్యాయని, అన్ రిజర్వుడు కేటగిరీకి 8, అన్ రిజర్వుడు (మహిళా) కేటగిరీకి 11 వార్డులు రిజర్వ్ అయ్యాయని తెలిపారు.
ఆర్మూర్ మున్సిపాలిటీలో ఎస్టీ జనరల్ కేటగిరీకి ఒక వార్డు ఖరారు కాగా, ఎస్సీ జనరల్ కేటగిరీకి 2 వార్డులు, ఎస్సీ మహిళా కేటగిరీకి ఒక వార్డు కేటాయించబడిందని కలెక్టర్ వెల్లడించారు. బీ.సీ జనరల్ కు 7 వార్డులు, బీ.సీ మహిళా కేటగిరీకి 7 వార్డులు రిజర్వ్ అయ్యాయని, అన్ రిజర్వుడు కేటగిరీకి 8, అన్ రిజర్వుడు (మహిళా) కేటగిరీకి 10 వార్డులు రిజర్వ్ అయ్యాయని తెలిపారు.
భీంగల్ మున్సిపాలిటీలో ఎస్టీ జనరల్ కేటగిరీకి ఒక వార్డు ఖరారు కాగా, ఎస్సీ జనరల్ కేటగిరీకి ఒక వార్డు, ఎస్సీ మహిళా కేటగిరీకి ఒక వార్డు కేటాయించబడిందని కలెక్టర్ తెలిపారు. బీ.సీ జనరల్ కు 2 వార్డులు, బీ.సీ మహిళా కేటగిరీకి ఒక వార్డు రిజర్వ్ అయ్యాయని, అన్ రిజర్వుడు కేటగిరీకి 2, అన్ రిజర్వుడు (మహిళా) కేటగిరీకి 4 వార్డులు రిజర్వ్ అయ్యాయని తెలిపారు.
2011 జనాభా ప్రాతిపదికన, బీ.సీ డెడికేషన్ కమిషన్ నివేదికను అనుసరిస్తూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా రిజర్వేషన్ కేటాయింపులు చేశామని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. ఖరారైన రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు నివేదించడం జరుగుతుందని తెలిపారు. రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ కమిషనర్లు జాదవ్ కృష్ణ, పూజారి శ్రావణి, గంగాధర్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.



