-వార్డు రిజర్వేషన్ల ఖరారుతో పార్టీల వ్యూహాలు
-టికెట్ల కోసం ఆశావహుల పోటీ తీవ్రం
నవతెలంగాణ – రాయికల్
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులకు నిన్న మొన్నటివరకు ఏ వార్డుకు ఏ రిజర్వేషన్ వస్తుందో అన్న ఉత్కంఠకు తెరపడింది. శనివారం వార్డుల వారీగా రిజర్వేషన్లు ప్రకటించడంతో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు తమకు అనుకూలమైన వార్డును కేటాయించాలంటూ ప్రముఖ నాయకులను కలుస్తూ ప్రయత్నాలు ప్రారంభించారు.
ప్రధాన పార్టీలైన కాంగ్రెస్,బీఆర్ఎస్, బీజేపీలు గెలుపు గుర్రాల కోసం వేట మొదలుపెట్టాయి.వార్డుల వారీగా సామాజిక వర్గాల రిజర్వేషన్లను బట్టి పలుకుబడి, ఆర్థిక బలం ఉన్న అభ్యర్థులను బరిలో దించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో పోటీ చేసిన కొందరు అభ్యర్థులకు ఈసారి రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో వారి సతులను,తల్లులను పోటీలో నిలపాలని కొందరు నిర్ణయించుకోగా,మరికొందరు ఇతర వార్డుల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేయాలని, లేదంటే పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయా పార్టీల నేతలు విస్తృతంగా చర్చించుకుంటున్నట్లు సమాచారం.
-కేటాయించిన రిజర్వేషన్లు…ఓటర్ల సంఖ్య
పట్టణంలో మొత్తం 12 వార్డులు ఉండగా,1వ వార్డు బీసీ మహిళకు కేటాయించగా పురుషులు 554, మహిళలు 604 మంది ఓటర్లు ఉన్నారు. 2వ వార్డు బీసీ జనరల్‌కు కేటాయించగా పురుషులు 575, మహిళలు 604 మంది, 3వ వార్డు ఎస్టీ జనరల్‌కు కేటాయించగా పురుషులు 520, మహిళలు 575 మంది, 4వ వార్డు జనరల్ మహిళకు కేటాయించగా పురుషులు 535, మహిళలు 615 మంది,5వ వార్డు జనరల్ మహిళకు కేటాయించగా పురుషులు 439, మహిళలు 533 మంది, 6వ వార్డు బీసీ మహిళకు కేటాయించగా పురుషులు 488, మహిళలు 548 మంది, 7వ వార్డు బీసీ జనరల్‌కు కేటాయించగా పురుషులు 466, మహిళలు 537 మంది,8వ వార్డు జనరల్‌కు కేటాయించగా పురుషులు 539, మహిళలు 609 మంది,9వ వార్డు జనరల్ మహిళకు కేటాయించారు.
పురుషులు 516, మహిళలు 556 మంది,10వ వార్డు జనరల్ మహిళకు కేటాయించగా పురుషులు 547, మహిళలు 588 మంది, 11వ వార్డు ఎస్సీ జనరల్‌కు కేటాయించగా పురుషులు 502, మహిళలు 593 మంది,12వ వార్డు జనరల్ కేటగిరీకి కేటాయించగా పురుషులు 476,మహిళలు 565 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 13,084 ఓటర్లలో పురుషులు 6,157 మంది కాగా.. మహిళలు 6,927 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 770 మంది ఎక్కువగాఉన్నారు.
-ఆశావహుల ఆర్భాటాలు
టికెట్ల కోసం సాగుతున్న ప్రయత్నాలతో వార్డుల వారీగా తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మున్సిపాలిటీలో ఆధిపత్యం సాధించాలన్న లక్ష్యంతో గెలుపు గుర్రాల కోసం వెతుకుతుండగా, ఆశావహులు సైతం టికెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతూ తమ అవకాశాలను బలపరుచుకునే యత్నం చేస్తున్నారు.
గత ఎన్నికల్లో అత్యధిక వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా, ఈసారి కాంగ్రెస్, బీజేపీలు వార్డులతో పాటు చైర్మన్ సీటును కూడా దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నాయి. అనుకూల పరిస్థితులు ఉంటాయన్న అంచనాతో కొందరు ఇప్పటికే వార్డుల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. ఒకవేళ రిజర్వేషన్ అనుకూలించకపోతే, కుటుంబ సభ్యుల ద్వారా పోటీ చేయించి అయినా కౌన్సిలర్ పదవిని కైవసం చేసుకోవాలనే వ్యూహాలు రూపొందిస్తున్నారు.
-మున్సిపాలిటీ ఛైర్మన్ జనరల్
రాయికల్ పట్టణ మున్సిపల్ ఛైర్మన్ పదవి అన్‌రిజర్వ్‌కు కేటాయించడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆశలు చిగురించాయి. గతంలో బీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగినప్పటికీ, ఈసారి రాజకీయ సమీకరణాలు మారుతున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఛైర్మన్ పదవిని దక్కించుకోవాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి.
ఎక్కువ వార్డులు గెలుచుకున్న పార్టీ నుంచే ఛైర్మన్ ఎన్నిక ఖాయమవుతుండటంతో అభ్యర్థుల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ అధిష్ఠానాలు స్థానిక నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.జనరల్ కేటగిరీ కావడంతో అనుభవం,ప్రజాదరణ,ఆర్థిక బలం ఉన్న నాయకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.మొత్తంగా రాయికల్ మున్సిపాలిటీలో ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయని,వార్డు స్థాయి నుంచి ఛైర్మన్ పదవి వరకు రాజకీయ ఉత్కంఠ నెలకొన్నట్లు స్పష్టమవుతోంది.



