సంఘీభావం తెలిపిన
మాజీ మంత్రి జోగు రామన్న
ఉపాధి చట్టం పరిరక్షణకు 15న బంద్
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
సమస్యలు పరిష్కరించాలని, ఈజీఎస్ పేరు మార్చొద్దని డిమాండ్ చేస్తూ ఉపాధి కూలీలు సోమవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి జోగు రామన్న కూలీలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం పేరును మార్చి, కొత్త పేరుతో తీసుకురావడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తోందన్నారు. క్రమంగా నిధుల కేటాయింపులు తగ్గిస్తూ చట్టాన్ని నిర్వీర్యం చేసే యత్నం చేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమాన్ని విస్మరించి, అదాని, అంబానీ వంటి కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ఆరోపించారు. ఉపాధి హామీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం కోసం సీపీఐ(ఎం) చేపడుతున్న పోరాటాలకు బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ నెల 15న నిర్వహించనున్న బంద్‌కు తమ పార్టీ మద్దతు తెలుపుతుందని జోగు రామన్న ప్రకటించారు.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లంక రాఘవులు మాట్లాడుతూ.. కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాత చట్ట ప్రకారం కూలీలకు 125 రోజుల పని కల్పిస్తూ రోజు కూలి రూ.307 ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఏ పథకం ఇవ్వని ఆర్థిక భరోసాను ఉపాధి హామీ చట్టం కూలీలకు అందించిందన్నారు. దీనికి మోడీ ప్రభుత్వం సవరణలు చేసి నూతన పథకాన్ని తీసుకురావడం సరికాదన్నారు. కూలీలకు అలవెన్స్, మెడికల్ కిట్స్ ఇతర సౌకర్యాలను తొలగించడం సమంజసం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వమే 100 శాతం నిధులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో మంచినీల్లు, టెంట్లను ఏర్పాటు చేయాలని, 15 రోజుల్లోపు కూలి డబ్బులను ఇవ్వాలని, వారం పే స్లిప్పులను ఇవ్వాలని, వేసవి అలవెన్సులు ఇవ్వాలని కోరారు. ఈ నెల 15న చేపట్టే కూలీల బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్య క్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మంజుల, సురేందర్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు స్వామి, ఎన్‌పీఆర్డీ నాయకులు ఆశన్న, బీఆర్‌ఎస్ నాయకులు మెట్టు ప్రహ్లాద్, కొండ గణేష్, దమ్మాపాల్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఉపాధి కూలీల ధర్నా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



