నవతెలంగాణ – హైదరాబాద్: ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో శనివారం వెయ్యి కోట్లకు పైగా పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తట్టా బుట్ట పట్టుకుని ఇతర రాష్ర్టాలకు వలసలు వెళ్లిన పాలమూరును తెలంగాణలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి తెలంగాణ పర్యటనకు వచ్చే వారు తప్పనిసరిగా పాలమూరు జిల్లాను సందర్శించేలా అభివృద్ధి చేయాలన్నది తన కల అని చెప్పారు.
త్వరలోనే నా కలను నెరవేర్చుకుంటా అని అన్నారు. ఒకప్పుడు రాష్ట్ర పర్యటనకు వచ్చిన వారు గ్రాంట్ల కోసం పాలమూరులోని పేదరికాన్ని చూపించిన సందర్భాలు అత్యంత బాధాకరమని, పదేండ్లు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించి ముందుకు సాగుతున్నామని అన్నారు. పాలమూరు అభివృద్ధి కోసం అందరం కలిసిమెలిసి పనిచేద్దామని, పాలమూరును అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.



