Sunday, January 18, 2026
E-PAPER
Homeహెల్త్వృద్ధాప్యంలో మానసికారోగ్యం

వృద్ధాప్యంలో మానసికారోగ్యం

- Advertisement -

గతంలో వృద్ధాప్యంలో శారీరక సమస్యల గురించి కొంతవరకు తెలుసుకొనే ప్రయత్నం చేసాం కదా! ఈసారి శారీరక సమస్యలకన్నా ఎక్కువగా, దీర్ఘకాలంగా వేధించే మానసిక ఇబ్బందులపై దృష్టి పెడదాం.

వద్ధ్యాప్య దశ వృద్ధి చెందుతున్న కొద్దీ, ఎన్నో అనుభవాలతో ఎంతో పరిపక్వత చెంది ఉన్నప్పటికీ, నిరాశా నిస్పృహలు, ఆందోళన, ఒంటరితనం, భావోద్వేగాలు, జ్ఞాపకశక్తి క్షీణించడం వంటివి శారీరక బలహీనతకు తోడై, రోజువారీ జీవనాన్ని కష్టభరితం చేయవచ్చు. ఈ సమస్యల తీవ్రతకు, వ్యక్తుల, వారి సంబంధీకుల ఆర్థిక-సాంఘిక స్థాయి, కుటుంబ విలువలకు ప్రగాఢ సంబంధముంటుందన్నది గమనార్హం. సామాన్యంగా ఇటువంటి సమస్యలు, ఆర్థికంగా ఒకవ్యక్తిపై ఎవరూ ఆధారపడి లేనప్పుడు/ వారసత్వం/ ఆర్ధిక ఆధిపత్యత కొరవడినప్పుడు తలెత్తుతాయి. కుటుంబ విలువలు స్థిరంగా ఉన్నప్పుడు ఇటువంటివి సమస్యలు తక్కువ. తలెత్తినా తాత్కాలికం. తీవ్రస్థాయిలో ఉండవు. సహజంగానే ఆర్థికంగా, ఇతరత్రా ఎన్ని సమస్యలున్నా, తమ పెద్దవారిని, చివరి వరకు వెన్నంటి ఉండి, వారిని జాగ్రత్తగా చూసుకుంటూ, ఆఖరు క్షణాల్లో బాధాతప్త హృదయాలతో వీడ్కోలు పలికేటటువంటి కుటుంబాలు లేకపోలేదు. అటువంటి వారి మధ్య ఉండగలగడం ఆ పెద్దల సుకృతం! ఈ వ్యాసం వారికి వర్తించదు!

వృద్ధ వయసులో ఎందుకీ సమస్యలు చుట్టుముడతాయి?
జీవన భాగస్వామిని కోల్పోయి ఉండవచ్చు, ఒంటరివారై, ఆదరణ, స్నేహభరిత వాతావరణ రాహిత్యం, ఆప్యాయ సంభాషణలు కొరవడడం, చేయవసిన దైనందిన పనులు చేయలేకపోవడం, కనీసావసరాలకు కూడా ఆర్థికంగా, శారీరకంగా ఇతరులపై ఆధారపడ వలసి రావడం వారిని మానసికంగా కల్లోల పరుస్తాయి. స్వాభిమానం ఎక్కువగా ఉన్నవారిలో ఆదరణ కొరవడినచోట ఆహరం రుచించదు. నిద్రాపట్టదు. ఐనవారనుకున్న వారినుండి నిరాశజనకమైన, అగౌరవ వ్యాఖ్యానాలు వారిని కలతకు గురిచేసి, అనారోగ్యానికి దారితీస్తాయి. కలతనిద్ర, ఆకలి ఇవన్నీ శరీరాన్ని బలహీనం చేసి, కళ్ళు తిరిగి పడిపోవడం, ఎముకల గట్టితనం తగ్గి వుండటం వలన ఫ్రాక్చర్లు అవ్వడం వంటివి సమస్యలను జటిల పరుస్తాయి.

జీవిత భాగస్వామి జీవించే ఉన్నా కొందరికి ఒంటరిగా ఉండవలసి రావడం తప్పడం లేదు. ముఖ్యంగా మగవారికి! ఈరోజుల్లో ఒకకొత్త ట్రెండ్‌ మొదలయ్యింది. పిల్లలు పెద్దవాళ్ళై, విదేశాల్లో పెద్ద ఉద్యోగాల్లో నిమగ్నులై, వారు కన్నపిల్లల ఆలనా-పాలనా చూసుకోవడానికి తరచుగా వారి తల్లుల్ని షిఫ్ట్‌ పద్ధతిలో ఆర్నెల్లకొకసారి తమవద్దకు రప్పించుకుంటున్నారు. అప్పుడప్పుడు పలుకారణాల వల్ల తండ్రి వెళ్లలేని స్థితిలో, వారు తమ పనులు చేసుకోలేక, కనీసావసరాలకు కూడా ఇతరులపై ఆధారపడవలసి వచ్చినప్పుడు మానసికంగా ఎంతగానో వ్యధ చెందుతారు. భర్తను ఇంట్లో బంధువులకో పనివాళ్ళకో అప్పచెప్పి మనవడినో మనవరాలినో చూసుకోవడానికి అంతదూరం ప్రయాణం చేసివెళ్లే ఆ తల్లి వయసు కూడా అరవై పైనే ఉంటే మాత్రం ఆ పరిస్థితి ఇంకా దారుణం. ఒక్కరే అంత చిన్నవారిని చూసుకోలేక, సరైన తిండి తినక, నిద్రపోవడానికి సమయం దొరకక, శారీరకంగా చేయలేక, చెప్పలేక, మానసికంగా వారుపడే వ్యధ వర్ణనాతీతం.

ఇంటిపని, వంటపని, చంటివారిని కంటికిరెప్పలాగా వాళ్ళ తల్లితండ్రులు ఇంటికి వచ్చేటంత వరకు కాపాడడం, అప్ప్పుడప్పుడు ఆ తరువాత కూడా చూసుకోవాల్సి రావడం, తమకంటూ కొన్ని నిముషాలు కూడా కేటాయించలేకపోవడం, చిక్కిశల్యమై తిరిగి రావడం, మళ్ళీ ఆరునెలలకు ప్రయాణం కట్టడం, ఇటువంటివి ఎన్నో కుటుంబాల్లో చూస్తున్నాం. సుదీర్ఘ జీవన ప్రయాణంలో అన్నిట్లో పాలుపంచుకున్న సహచరులు, జీవిత భాగస్వామిని పోగొట్టుకున్నవారు, ఎందరి మధ్యనఉన్నా, ఎవరి హదయాన్ని తాకలేని, ఎవరికీ చేరువ కాలేని పరిస్థితిలో, ఒంటరిగా, ఏకాకిగా, అనుభూతి చెందేవారికి, పొద్దున మెలుకువ వచ్చినప్పటి నుండి రాత్రి నిద్రపట్టే వరకు ప్రతిక్షణం కౌంటింగే! ఆపైన ఓల్డేజ్‌ హోములు, అప్పుడప్పుడు బంధుమిత్రుల రాక పోకలు, రానురాను రాకపోకలు తగ్గి, ఫోనుల్లో పలకరింపులు, అవి కూడా క్రమేణా ఆగిపోవడాలూనూ!!! ఆహారం ఎవరు ఇచ్చేది? కేర్‌ టేకర్లు, మెస్సులు, కుక్కులు, హోటళ్లు! భోజనం చేయడం వేరు; తిండితినడం వేరు! ఆకలికి పట్టెడన్నం దొరకొచ్చు. మనసారా భోజనం పెట్టేవారు కరువైపోతారు. పౌష్టికాహారం మాట దేవుడెరుగు!

వృద్ధాప్య దశకు చేరుకొన్న ప్రతివ్యక్తి అవసరాలు- క్లుప్తంగా కొన్ని:
బరువైన బాధ్యతల నుండి విరామం. వయసుకు, విజ్ఞతకు తగు గౌరవం. సామజిక-ఆర్థిక సుస్థిరత. ఆరోగ్య సంరక్షణ. క్రమశిక్షణ. దినచర్య ప్రణాళిక. వసతి సౌకర్యం. గహసహకార బలగం. అత్యవసర సేవల సౌలభ్యం. ఇవన్నీ అందరికీ లభించక పోవచ్చు; వాటికొరకు శక్తిసామర్థ్యాలు సంవృద్ధిగా ఉన్నప్పుడే ఎవరికి వారు సమకూర్చుకోవాలి. అందుకు వృద్ధాప్యానికి కడు దూరంలోనే ఆ దిశగా జీవన ప్రణాళికను రూపొందించాలి. ‘నలుగురితో బాగుండాలి’ అనే పెద్దలమాటలో అర్థముంది; అందరితో బాగుండాలి, అందులో మనవారిని గుర్తించి చేరదీయాలి, వారు బంధువులు కానక్కరలేదు. ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. కొంత వృద్ధాప్య జీవనభృతిగా వెనకేసుకోవాలి. తమకు మాలిన ధర్మాలు చేయరాదు. గౌరవప్రదమైన అలవాట్లు, ప్రవర్తన కలిగి ఉండాలి. ఏది మాట్లాడినా చెల్లుతుందన్న ధోరణిని విడనాడాలి.

‘సైలెన్స్‌ ఈజ్‌ గోల్డెన్‌’. అనవసర సలహాలు, సంభాషణలు ఆపివేయాలి. ఇతరులకు నష్టం, మనసుకు కష్టం కలిగేంచేటటువంటి పనులు అసలు చేయకూడదు. స్వంత ఖర్చులకు ఇతరులపై ఆధారపడకూడదు. ఆస్తులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మోహావేశాలకు లోనై, ఇతరులపరం చేయకూడదు. వీలునామా ముందస్తుగా రాసుకోవడం మంచి పనే కానీ తమ తదనంతరమే ఆస్తులు వారసులకు చెందేటట్టుగా రాసుకోవాలి. రిజిస్టర్‌ కూడా చేసుకోవాలి. ఇతరులంటే ఎవరు? జీవిత భాగస్వాములు అంటేభార్య, భర్త మినహాయించి తక్కిన వారందరూనూ. కన్నపిల్లలతో సహా! తాము నమ్మి పాటిస్తూ వచ్చిన ఆరోగ్యసూత్రాలు ఎట్టి పరిస్థితిలో వీడొద్దు. చెడు అలవాట్లేమైనా ఉంటె, వాటి నుండి ఈ వయసులో తప్పకుండా బయటపడాలి. లేకుంటే ఉన్న కాస్త గౌరవం కోల్పోతాం. మనవలు మనవరాళ్లు ఉంటే, వారు కూడా మాటవినరు.

వ్యక్తిగత పరిశుభ్రత మీ బాధ్యతే!
శరీరాన్ని దుర్గంధాల నుండి కాపాడుకోవాలి. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే అద్దంలో మనం అందంగా కనిపించినా కనిపించకపోయినా, వృద్ధాప్యంలో ఉండవలసిన పరిపక్వత, విజ్ఞతతో కూడిన దైవీకళ ప్రతిబింబించాలి. ఆ విధంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. క్లుప్తంగా చెప్పాలంటే, కనీస వసతులున్న ఒక చిన్న ఇల్లు, ఆరోగ్య బీమా, నమ్మకస్తులైన ఒకరిద్దరితో కూడిన గృహసహకార సిబ్బంది, క్రమశిక్షణ, ఒక పొందికైన, రిజిస్టర్‌ చేసిన వీలునామా, సమయాన్ని సానుకూలంగా గడపడానికి పుస్తక పఠనం, ఫోనులో మాట్లాడుకోవడానికి సమ వయస్కులు, సహమనస్కులైన ఒకరిద్దరు స్నేహితులు , తగు జాగ్రత్తతో చేయగలిగినంత వ్యాయామము, ఆస్తికులైతే నచ్చిన తీరులో దైవచింతన, నాస్తికులైతే నచ్చిన విషయాలలో తాత్వికాన్వేషణ- ఇవి వృద్ధాప్య అవసరాలు.
ఇవి సమకూర్చుకుంటే, వాటిలో నిమగ్నులైపోతే, వారి శేషజీవితంలో ప్రాపంచిక విషయాలు వారిని బాధపెట్టే ఆస్కారం తగ్గి, మానసికంగా ఆరోగ్య వంతులుగానే ఉండగలుగుతారు.

డాక్టర్‌ మీరా,
రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ అఫ్‌ మైక్రోబయాలజీ,
ఫీవర్‌ హాస్పిటల్‌ / ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌, హైదరాబాద్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -