Sunday, January 18, 2026
E-PAPER
Homeసోపతిరాజ్యం వీరభోజ్యం కాదెహె

రాజ్యం వీరభోజ్యం కాదెహె

- Advertisement -

జుట్టుపోలుగాడు : హాహాహా… ఈ భూమండలానికి నేనే రాజును. ఇంకా మాట్లాడితే రారాజును. అమెరికా అద్యక్షుడు ట్రంప్‌గాడ్ని. నాటో దేశాల బలగం, ఆయుధాల తయారీ అంతా నా గుప్పెట్లోనే వుంది. ఏ దేశంలోని చమురైనా నా దేశంలోకే రావాలి. నా పెట్రోడాలర్‌తోనే అమ్మాల, కొనాల. అండర్‌స్టాండ్‌! నన్ను కాదని దొంగచాటుగా రష్యా – ఇండియా రహస్య బేరాలు చేసుకుంటే చూస్తూ ఊరుకుంటానా? అందుకే భారత్‌పై అయిదొందలు శాతం సుంకం విధించా… హి… హి…హి… ఎవడ్నెట్టా లొంగదీసుకోవాలో నాకు తెలుసెహె. నన్ను సంతోషపెట్టడం ఆ దేశ పెధాని మోడీ ఖర్మ.
ఇప్పుడు అకస్మాత్తుగా వెనుజులా అద్యక్షుడు మదురోను, ఆయన పెళ్లాన్ని రాత్రికి రాత్రి బెడ్‌రూం లోనుంచి పట్టుకొచ్చా. ఒరే మదురో… నీవు ఊహించలేదు కదూ.. హె…హె…హె… నీ వేంటి? ఈ పెంపంచకంలోనే ఎవ్వడూ ఊహంచలా. ఇప్పుడు చెప్పు. నేను హిట్లర్‌ కంటే గొప్పోడ్నా కాదా? లేకపోతే నాకు నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వరా.. చూపిస్తారా, చూపిస్తా… నా అసలు తడాఖా ఏంటో చూపిస్తాహె…

కేతిగాడు : నాపేరు నికోలిస్‌ మదురో. నేను ఇప్పటికీ వెనుజులా దేశం అద్యక్షుడ్ని. నన్ను, నా భార్యను ఎప్పటికైనా నా దేశ ప్రజలు విడిపించుకుపోతారు. న్యాయం, చట్టం చూస్తూ ఊరుకోవు.
జుట్టుపోలుగాడు : అబ్బ… ఛ.. ‘న్యాయం – చట్టం’. అవి నేనెంత చెప్తే అంత. ఆ మాటకొస్తే నేనే మీ వెనుజులా తాత్కాలిక అద్యక్షుణ్ణి. నా ప్రకటనలు చూడ్లేదా. పోనీలే. నా డిమాండ్లు అంగీకరించకపోతే ఇప్పుడున్న మీ దేశ నాయకురాలు రోడ్రిగ్జ్‌పై సైనిక చర్యకు దిగుతా. అర్జంటుగా వంద బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టి చమురు తియ్యండి. మాకియ్యండి. లేకపోతే మీ అంతుచూస్తా. ఒక్క వెనుజులానే కాదు, ఇరాన్‌, గ్రీన్‌లాండ్‌, గాజా, క్యూబా, మెక్సికో, కొలంబియా… ఆ దేశలన్నీ నాకే కావాలి. నాకే కావాలి. అ దేశ ప్రజలు బతికినా… చచ్చినా నా కనవసరం. అక్కడి చమురు, ఖనిజాలు, అడవులు, అందాలు నాకే సొంతం. నాకే సొంతం.

కేతిగాడు : ‘పోగాలము దాపురించు వారికి హితవచనముల్‌ ఏల తలకెక్కున్‌!’ నీవు చరమాంకంలో వున్నావ్‌. ఇరాన్‌ ముస్లింనేత ఖొమైనీ ఎమన్నాడో విన్లేదా..?
జట్టుపోలుగాడు : ఏమన్నాడేంటి?
కేతిగాడు : ‘ఒరే ట్రంప్‌గా.. ముందు నీ దేశం సంగతి చూస్తో. నీ అమెరికా జనమే నీకు వ్యతిరేకంగా నీ దేశంలో రోడ్ల మీదకు వస్తున్నారు. గతంలో జనానికి జడిసి బంకర్లో దాక్కున్న నీ సంగతి అప్పుడే మర్చిపోతే ఎలా..?’ అన్నాడు.
జుట్టుపోలుగాడు : రేరు.. నన్ను రెచ్చగొట్టమాకు. నేను చేయాల్సింది చేయక మానను. నాక్కావాల్సిన దేశాల్లో నేతలను మట్టుపెట్టడానికి ఏ రకమైన బకాయింపులకైనా దిగుతాను. అల్లర్లు సృష్టిస్తాను. అదీ కాకపోతే కుట్ర గుట్టుగా సఫా చేస్తా.. హా.. హా…హా…

(బంగారక్క ప్రవేశం)
బంగారక్క : అవును. అమెరికా సామ్రాజ్యవాదం తంతే అంత. గతంలో ఇరాక్‌లో సద్దాం హుసేన్‌ను బలవంతంగా ఆ దేశాద్యక్ష పదవి నుండి తొలగించి తప్పుడు ఆరోపణలు మోపి ఆయన్ని ఉరితీశారు. అలాగే లిబియా నేత గడాఫిని క్రూరంగా చంపారు. ఇజ్రాయిల్‌ నరహంతక నేత నెతన్యూహాతో కలిసి ఇప్పుడు పాలస్తీనా జాతినే సమస్తంగా తుడిచి పెట్టాలని యుద్ధదాడులను ఆపకుండా చేస్తున్నారు. ఆ గాజా ప్రాంతాన్ని రియల్‌ ఎస్టేట్‌గా వ్యాపారం చేయాలని ఆ దేశ ప్రజలను సొంత భూముల నుండి తరిమేస్తున్నారు. అందరూ వినండహో…
వీరు మానవ ముసుగేసుకున్న భయంకర రాక్షసులు. పచ్చి నెత్తురుతాగే బందిపోట్లు. ఇలాంటోళ్లు అసలు భూమ్మీద బతక్కూడదు. చావాల్సిందే. చావాల్సిందే. చంపుతా.. చంపుతా.. (పూనకంతో ఊగిపోతుంది)
జుట్టుపోలెగాడు : అక్కా… అక్కా… అక్కా… (ముఖంపై నీళ్లు చల్లి) మమ్మలి వేషం కట్టమని నీవు ఇలా అయిపోతే ఎలా..?

కేతిగాడు : మనం జనాలకి ఈ విషయాలు చెప్పడానికి వేషం కట్టాం కానీ ముగింపు ఏంటో తెలియడం లేదమ్మీ.
బంగారక్క : మూడో ప్రపంచ యుద్ధం అంచున మానవాళి వున్నది. యుద్ధం ఎట్నుంచైనా, ఎప్పుడైనా, ఎలాగైనా రావచ్చు. తాజాగా ఇరాన్‌ ఏమంటుందో తెలుసా..?
ఇద్దరూ : ఏమంటుంది?
బంగారక్క : ఇక ముఖాముఖి యుద్ధాలుండవు. మామీద నీవు బాంబులేస్తే.. నీ మీదే కాదు, నీ మిత్ర దేశాలమీద కూడా బాంబులేస్తాం అని అంటుంది.
జుట్టుపోలిగాడు : అంటే మనం అమెరికాను మిత్రదేశం అంటే మనమీద కూడా బాంబులేస్తుందా?
బంగారక్క : వేయొచ్చు. ఆయా దేశాల ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాలను, సార్వభౌమత్వాన్ని గుర్తించని దుర్మార్గుల నుండి ప్రపంచానికి ఈ బెడద తప్పదు. అందుకే రాజ్యం వీర భోజ్యం అంటే ఇక చెల్లదు. ప్రజలు తిప్పికొడతారు.

  • కె.శాంతారావు, 9959745723
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -