పోరెడ్డి మృదుల రచించిన కవితా సంపుటి అవిభాజ్యం భార్యాభర్తల అనుబంధాన్ని ఉన్నతీకరించిన కవితా కుసుమ గుచ్చం. ఇది కవయిత్రి హృదయ సంస్కారాన్ని, సృజనాత్మకతను, నైసర్గిక అభివ్యక్తిని ఆవిష్కరిస్తుంది. ఈ గ్రంథాన్ని తాను ప్రేమగా రామయ్యా! కృష్ణయ్యా ! అని పిలుచుకునే తన ఆత్మసఖునికి అంకితమివ్వడం అద్భుతంగా తోచింది. విలియం వర్డ్స్ వర్త్ కవిత్వాన్ని ‘Emotion recollected in tranquility’ అని నిర్వచించాడు. భావోద్వేగాన్ని ప్రశాంతంగా చెప్పడమే కవిత్వమని దాని అర్థం. మదుల కవిత్వంలో భావోద్వేగాలు ఉన్నాయి. అవి తన పరిధిని దాటవు సరి కదా ప్రశాంతంగా ప్రవహిస్తాయి .
భార్యాభర్తలు విడదీయరానటువంటి వారు అని కవయిత్రి మన పురాణేతిహాసాలలోని పాత్రల ద్వారా నిరూపించారు. ‘ఆనందలహరి’ అనే కవితలో కోకిల గొంతులో మాధుర్యం పలికినప్పుడు అది రామమహిమే అని సీత ఆనందిస్తుందని, నెమలి నృత్యం చేసినప్పుడు, హరివిల్లును చూసినప్పుడు అది శివుని మహిమే అని గౌరి భావించడం, రాధ లాలిత్యం హిమవసంతమై పూచినప్పుడు అది కృష్ణమహిమే అని తరించడం వంటివి ఉదాత్తమైన భావాలు. అలాగే అర్ధనారీశ్వర తత్వాన్ని ‘మిధునం’ కవితలో చక్కగా ఆవిష్కరించింది. నాట్యం, లాస్యం, ప్రకృతి, పురుషుడు కలిసి మిధునమయ్యే అన్న భావాలతో సుమనోహరంగా వర్ణించింది.
‘రాముని సాక్షిగా’…. కవితలో సీతమ్మ పడిన కష్టాలను భరించడానికి రామయ్య స్మృతియే ఉత్తమమైనదేమో అని పాఠకునికి చేరే విధంగా ఉన్నతీకరించడం, అలాగే ‘రాధ’లో కృష్ణుడు లేక తాను లేను అని చెప్పడం, నీ గాలి నను తాకక వేణువు లాంటి మేను ఒంటరిదయ్యే వంటి కుసుమపేషలమైన భావాలతో వ్యక్తీకరించడం ఈ రచనకు ఇంకా వన్నె తెచ్చేటటువంటివి. కవితలు వేరైనా వాటిల్లో అంతరంతరంగా ప్రవహించే భావన ఒకటే …..అదే అవిభాజ్యం.
భీష్మ పితామహుడు ధర్మరాజుతో భార్యాభర్తల బంధాన్ని గురించి ఇలా చెబుతాడు. భార్యతో సమానమైన బంధువు, సఖి, సుఖం ఎవరి తరమూ కాదని, అలాగే భర్తతో సమానుడైన చెలికాడు, వేదాంతి, మార్గదర్శి ఎవరూ లేరని హితవు పలుకుతాడు. రాను రాను పవిత్ర వివాహ వ్యవస్థ బీటలు బారి, పెళ్లిళ్లు అనతి కాలంలోనే పెటాకులవుతున్న ఈ కాలంలో ఈ కవయిత్రి కవితలు ‘Eye Opener’ లాంటివి. ఆదర్శ దాంపత్య ధర్మమే భారతీయ సనాతన ధర్మం అని ఈ కవితలు చాటుతున్నాయి. బోనామి డొబ్రీ అన్న మానసిక శాస్త్రవేత్త ”Marraiges can be
successful only when the otherness of the mate is identified, loved and respected”. ఈ మాటలకు రూపంలో వస్తే ఈ రచనలోని కవితల్లా ఉంటాయి.
- పాణ్యం దత్త శర్మ, 9550214912



