నిన్ను తొమ్మిది మాసాలు కడుపులో ప్రేమతో మోసిన
అమ్మకు ఇపుడు ఏం కావాలి..?
నీకు చిన్నప్పటి నుండి లాలపోసి, సాంబ్రాణి వేసి
బట్టలు తొడిగి, నిద్రపుచ్చిన అమ్మకు ఇపుడు ఏం కావాలి ?
నీ మలమూత్రాలను ఎత్తి నీవు పాడు చేసే బట్టలు ఉతికి,
నిన్ను పరిశుభ్రంగా అభ్యంగన స్నానం చేయించి మురిసిపోయిన
అమ్మకు ఇపుడు ఏం కావాలి?
నీవు ఆడుకోవడానికి మోకాళ్ళ మీద గుర్రంగా మారి,
నీకు తోడు పరిగెడుతూ చిన్నపిల్లలా నవ్వించిన
అమ్మకు ఇపుడు ఏం కావాలి?
నీవు ఏడిస్తే ఓదార్చింది! నవ్వితే సంతోషించింది!
నీకు అన్నం తినిపించడానికి
ఎన్ని గంటలు ఎత్తుకొని నిలబడిందో ఆ తల్లీ!
నడిపించడానికి ఎన్నిసార్లు వడివడిగా నడిచిందో!
వచ్చిరాని నీ మాటలకు దుబాసిలా మారి
ప్రపంచానికి పరిచయం చేసిన అమ్మకు ఇపుడు ఏం కావాలి?
నీకు ఆరోగ్యం బాగో లేకపోతే ఎంత అల్లాడిపోయింది తెలుసా?
నీకు గాయమైతే తాను ఏడ్చిన సంగతి గుర్తుందా?
నీవు నిద్ర పోకపోతే తాను ఎన్నిసార్లు మేలుకున్నదో తెలుసా?
చిన్నప్పుడు నీవు బయిటికి వెళ్లి ఆలస్యంగా వస్తే
ఇన్నిసార్లు అమ్మ కళ్ళు గడియారం వైపు చూశాయో తెలుసా?
అమ్మ మనసు ఎంత నిరీక్షిస్తుందో తెలుసా?
నీకు కన్నీళ్లు వస్తే కొంగుతో తుడిచేది!
తప్పు చేస్తే కొంగు చాటున దాచేది!
ఈ సష్టిలో తన ఆయుస్సు కూడ పోసుకొని
జీవించమని కోరేది ఎవరో తెలుసా?
మనల్ని కన్నతల్లి మాత్రమే!
మరి అమ్మకు మనం ఏమివ్వగలం!
మమతానురాగాలు-ప్రేమానురాగాలు పంచడం!
పాదాభివందనాలు చేయడం తప్ప..!!
ఇప్పుడామెకు ఏం కావాలో తెలుసా?
తను మనకు చిరాకు తెప్పించినా, పసి పిల్లలా చూసుకొనే ప్రేమ!
ఆప్యాయతపు పలుకరింపు!
తాను చెప్పే మాటలు వినే ఓపిక!
దగ్గర కూర్చోని నాలుగు మాటలు మాట్లాడే తీరిక! కావాలిపుడు!
అమ్మ ఇంతకంటే ఏం కోరుకుంటుంది!
తనకేం కావాలో ప్రేమతో అడుగు!
అవసరమైతే నవ్వించు! తన బాగోగులు గమనించు!
ఎంత పని వత్తిడున్నా చిరాకు పడకు!
అమ్మలవి లేతమనుసులు లోలోన కుమిలి పోతారు!
కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మను ఏడిపించకు!
డా|| నానపురం నర్సింహులు
అమ్మకు ఇపుడు ఏం కావాలి..?
- Advertisement -
- Advertisement -



