విజయమే లక్ష్యంగా బరిలోకి..
భారత్, న్యూజిలాండ్ మూడో వన్డే నేడు
మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
భారత్‌లో టెస్టు సిరీస్ విజయాన్ని 2024లో రుచి చూసిన న్యూజిలాండ్ ఇప్పుడు అదే జోరులో చారిత్రక వన్డే సిరీస్ విజయంపై కన్నేసింది. వన్డే క్రికెట్ కోసం భారత్‌కు 16 సార్లు వచ్చిన న్యూజిలాండ్.. ఇప్పటి వరకు ఒక్క సిరీస్/టోర్నమెంట్లో విజయం అందుకోలేదు. టెస్టుల్లో అద్బుతం చేసిన స్పూర్తితో వన్డేల్లోనూ సిరీస్ విజయం అందుకోవాలనే తపన కివీస్ శిబిరంలో కనిపిస్తోంది.
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ రన్నరప్, చాంపియన్స్ ట్రోఫీ విజేత, ఆసియా కప్ చాంపియన్ భారత్ ఈ ఫార్మాట్లో అత్యంత బలమైన జట్టు. సొంతగడ్డపై తిరుగులేని విజయాలు సాధించిన టీమ్ ఇండియా ఇప్పుడు అనుభవం లేని కివీస్‌తో సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. డిసైడర్ను పరుగుల సునామీతో ముంచెత్తాలనే ఆలోచన భారత శిబిరంలో కనిపిస్తోంది. ఇండోర్‌లో భారత్, న్యూజిలాండ్ ఆఖరు వన్డే మ్యాచ్ నేడు.
నవతెలంగాణ-ఇండోర్
2024లో భారత్‌లో 3-0తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన న్యూజిలాండ్.. ఈ ఏడాది వన్డేల్లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేయాలనే ఆలోచనలో ఉంది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్, న్యూజిలాండ్ 1-1తో సమవుజ్జీలుగా నిలువగా.. నేడు సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ ఇండోర్‌లో జరుగనుంది. భారత జట్టులో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతో కూడిన మేటీ క్రికెటర్లు ఉండగా.. న్యూజిలాండ్ తరఫున ద్వితీయ శ్రేణి జట్టు బరిలోకి దిగింది. ఎనిమిది మంది ఆటగాళ్లు తొలిసారి భారత్‌లో ఆడుతుండగా.. ఇద్దరు క్రికెటర్లు తొలి రెండు మ్యాచ్‌ల్లో అరంగ్రేటం చేశారు. ఐదుగురు క్రికెటర్లకు పది మ్యాచ్‌లు ఆడిన అనుభవం సైతం లేదు. అయినా, బలమైన భారత్‌ను సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ ఆడేలా చేసిన న్యూజిలాండ్ ఆఖరు పంచ్ సైతం ఇవ్వాలనే పట్టుదల చూపిస్తోంది. రాజ్‌కోట్ వన్డే ఓటమికి ప్రతీకారంతో పాటు సిరీస్‌ను స్పష్టమైన వ్యత్యాసంతో దక్కించుకోవాలనే కసి గిల్సేనలో సుస్పష్టం. ఈ సమీకరణాల నేపథ్యంలో నేడు ఇండోర్‌లో సిరీస్ నిర్ణయాత్మక పోరు.
సెలక్షన్‌పై నజర్
స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడగా అతడి స్థానంలో ఆయుశ్ బదోనిని జట్టులోకి తీసుకున్నారు. బదోని స్పెషలిస్ట్ బ్యాటర్, పార్ట్‌టైమ్ ఆఫ్ స్పిన్నర్. రాజ్‌కోట్‌లో బదోని కాకుండా సుందర్ స్థానంలో పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆడాడు. నితీశ్ కుమార్ రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఇండోర్ స్టేడియం చిన్నది కావటంతో ఇక్కడ స్పిన్నర్ల ప్రాధాన్యత తక్కువే. బ్యాటింగ్ కోసం బదోనిని తీసుకుంటారా? లేదా నితీశ్‌ను కొనసాగిస్తారా?అనేది ఆసక్తికరం. ఇక రాజ్‌కోట్ వన్డేలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాయను కివీస్ బ్యాటర్ డార్లీ మిచెల్ ఛేదించాడు. కుల్దీప్ యాదవ్‌పై ఎదురుదాడి చేసిన మిచెల్… కుల్దీప్ ఫ్లాట్‌గా బౌలింగ్ వేసేలా చేయగలిగాడు. కుల్దీప్ తన ప్రణాళికలను అమలు చేయకపోవటం అరుదు.
నేడు ఇండోర్‌లో కుల్దీప్ బలంగా పుంజుకుంటాడా? కివీస్ బ్యాటర్లను తన మాయతో విలవిల్లాడిస్తాడా?అనేది చూడాలి. బ్యాటింగ్ విభాగంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మంచి ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ శతక దాహంతో ఎదురుచూస్తున్నారు. కెఎల్ రాహుల్ గత మ్యాచ్‌లో సెంచరీ సాధించినా.. ఆశించిన వేగంతో పరుగులు చేయలేదు. రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్‌గా ఏమాత్రం న్యాయం చేయలేదు. ఇటు బ్యాట్‌తో పరుగులు సాధించలేదు, అటు బంతితో వికెట్లు పడగొట్టలేదు. నేడు కీలక మ్యాచ్‌లో జడేజా నుంచి ఆల్‌రౌండర్ ప్రదర్శనను జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తోంది. మహ్మద్ సిరాజ్‌కు తోడు అర్ష్‌దీప్ సింగ్ కొత్త బంతిని పంచుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రానాలో ఒకరు బెంచ్‌కు పరిమితం కానున్నారు.
సీనియర్లే కీలకం
న్యూజిలాండ్‌కు సీనియర్ ఆటగాళ్లు కీలకం కానున్నారు. తొలి రెండు వన్డేల్లోనూ సీనియర్లే బాధ్యత తీసుకున్నారు. డార్లీ మిచెల్,డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్‌లు బ్యాటింగ్ భారం మోస్తున్నారు. విల్ యంగ్, హెన్రీ నికోల్స్, మిచెల్ హే సైతం ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్ మైకల్ బ్రాస్‌వెల్ తనదైన జోరు చూపించాలని ఎదురుచూస్తున్నాడు. కైల్ జెమీసన్ పదునైన పేస్‌తో భారత్‌కు సవాల్ విసరగలడు. కొత్త స్పిన్నర్లు జెడెన్ లెనాక్స్, ఆదిత్య అశోక్ సహా క్రిస్టియన్ క్లార్క్, జాక్ ఫౌల్క్స్లు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. సమిష్టిగా రాణిస్తే భారత్‌లో చారిత్రక వన్డే సిరీస్ విజయం సాధించటం కివీస్‌కు పెద్ద కష్టం కాబోదు!.
పిచ్, వాతావరణం
ఇండోర్ పిచ్ భారీ స్కోర్లకు చిరునామా. వీరెందర్ సెహ్వాగ్ 219 పరుగులు ఇక్కడే బాదగా.. భారత్ ఇక్కడే 418, 399, 385 స్కోర్లు చేసింది. చిన్న బౌండరీల గ్రౌండ్లో నేటి మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు నమోదు కావటం లాంఛనమే. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండనుంది. మంచు ప్రభావం పెద్దగా కనిపించే అవకాశం లేదు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే వీలుంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి/ఆయుశ్ బదోని, రవీంద్ర జడేజా, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ట/అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్ : డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డార్లీ మిచెల్, మిచెల్ హే (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైకల్ బ్రాస్‌వెల్ (కెప్టెన్), క్రిస్టియన్ క్లార్క్, కైల్ జెమీసన్, జాక్ ఫౌల్క్స్, ఆదిత్య అశోక్/జేడెన్ లెనాక్స్.



