తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పెరిగిన సినిమా టికెట్ ధరలు కేవలం సామాన్యుడి జేబుకు భారంగా మారడమే కాకుండా, ఒక తీవ్రమైన సామాజిక ఆర్థిక చర్చకు దారితీశాయి. అసలు సినిమా అనేది ఒక ప్రజా వినోద సాధనమా లేక లాభమే పరమావధిగా సాగే వ్యాపారమా? అనే ప్రాథమిక ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. సినిమా ఒక సృజనాత్మక కళగా పుట్టినప్పటికీ, కాలక్రమేణా భారీ పెట్టుబడులతో కూడిన హై-స్టేక్స్ పరిశ్రమగా రూపాంతరం చెందింది. ప్రేక్షకుడికి ఇది రెండున్నర గంటల కాలక్షేపమైతే, నిర్మాతకు వందల కోట్ల రూపాయల పెట్టుబడికి రెట్టింపు లాభం వెనక్కి తెచ్చే రేసు. ఈ రెండు దృక్పథాల మధ్య సమతుల్యత దెబ్బతిన్నప్పుడే ఈ ధరల వివాదం మొదలవుతోంది.
భారీ బడ్జెట్ చిత్రాల పేరుతో ధరలను పెంచడాన్ని విశ్లేషిస్తే, ఇక్కడ నాణేనికి రెండు పార్శ్వాలు కనిపిస్తాయి. అంతర్జాతీయ స్థాయి విజువల్స్, భారీ తారాగణాన్ని అందించడానికి వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని నిర్మాతలు వాదిస్తారు. ఫలితంగా, పంపిణీదారులు థియేటర్ యాజమాన్యాలు మొదటి పదిరోజుల్లోనే ఆ పెట్టుబడిని రాబట్టుకోవాలనే ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే, ఒక చేదు నిజం ఏమిటంటే బడ్జెట్‌లు పెరగడానికి ప్రధాన కారణం కేవలం తెరపై కనిపించే ”విజువల్ గ్రాండియర్” మాత్రమే కాదు, నటీనటులు, సాంకేతిక నిపుణుల భారీ రెమ్యూనరేషన్లు కూడా. నిర్మాత తీసుకునే ఈ రిస్క్ భారాన్ని నేరుగా ప్రేక్షకులపై మోపడం ఎంతవరకు న్యాయం? భారీ బడ్జెట్ అనేది ప్రతిష్ట కోసం తీసుకునే నిర్ణయం తప్ప, అది ప్రేక్షకుల అవసరం కాదు. అగ్రహీరోల ఇమేజ్ కోసం సామాన్యుడి జేబుకు చిల్లు పడటం నైతికంగా సమర్థనీయం కాదు. లాభాల్లో సింహభాగం కేవలం నిర్మాత, పంపిణీదారులు నటీనటులు, దర్శకుని చేతుల్లోకి వెళ్తున్నప్పుడు, ఆ ఖర్చును సామాన్య కార్మికుడి కష్టార్జితంతో భర్తీ చేయాలనుకోవడం సరికాదు.
దీనికి ఒక నిర్దిష్ట వ్యక్తిని బాధ్యుడిని చేయలేకపోయినా, ‘భారీ చిత్రాలు’ సంస్కృతి ద్వారా ఇది టాలీవుడ్‌లోకి ప్రవేశించింది. పాన్-ఇండియా సినిమాల వెల్లువతో బడ్జెట్ పరిమితులు దాటిపోవడంతో, ప్రభుత్వాల నుండి ప్రత్యేక అనుమతులు తెచ్చుకుని ధరలు పెంచడం ఒక ఆనవాయితీగా మారింది. గతంలో కేటగిరీల వారీగా స్థిరమైన ధరలు ఉండేవి. కానీ ఇప్పుడు అది లాబీయింగ్ ఆధారిత ధరల నమూనాగా మారింది. అగ్రహీరోలు, దర్శకుల సినిమాలతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు మధ్యస్థ బడ్జెట్ సినిమాలకు కూడా పాకుతోంది.ఒక సామాన్య ఉద్యోగి తన కుటుంబంతో కలిసి నెలకు రెండు సినిమాలు చూడలేని స్థితికి చేరుకున్నప్పుడు, ఆ పరిశ్రమ పతనం మొదలైనట్టే. నేడు భారీ బడ్జెట్ పేరుతో జరిగే ఖర్చులో ఎక్కువ భాగం కృత్రిమమైన ‘హైప్’ సృష్టించడానికే పోతోంది. దీన్ని రికవరీ చేయడానికి ధరలు పెంచడం అనేది ప్రేక్షకులపై మోపుతున్న ‘బలవంతపు పన్ను’ వంటిది.
అధిక ధరలు మధ్య తరగతి ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేసి ‘ఓటిటి’ వైపు మళ్లిస్తున్నాయి. పైగా మొదటి వారం పెంచే ఈ రేట్ల వల్ల పైరసీ కూడా పెరుగుతోంది. నేడు థియేటర్‌లో టికెట్ దగ్గర నుండి స్నాక్స్ వరకు ప్రతి రూపాయి భారమవుతోంది. ఇక్కడ ఒక విరుద్ధమైన అంశం ఉంది. నిర్మాతలు విడుదల ముందే డిజిటల్ రైట్స్ ద్వారా వందల కోట్లు పొందుతున్నారు. అలాంటప్పుడు టికెట్ ధరలు తగ్గించి ఎక్కువ మందిని థియేటర్లకు రప్పించే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? ఈ సమస్య పరిష్కారం లేనిది కాదు. కానీ, దీనికి పరిశ్రమ మొత్తం మనస్ఫూర్తిగా సహకరించాలి. ముఖ్యంగా నిర్మాణ వ్యయ నియంత్రణలో పారదర్శకత ఉండాలి; ప్రస్తుతం బడ్జెట్‌లో దాదాపు అరవై నుంచి డెబ్బయి శాతం కేవలం హీరోలు, దర్శకుల పారితోషికాలకే వెచ్చిస్తుండటం వల్ల ఆ భారం ప్రేక్షకులపై పడుతోంది.
దీనికి బదులుగా అగ్ర నటీనటులు ‘లాభాల్లో వాటా’ పద్ధతికి రావాలి. దీనివల్ల ప్రాథమిక నిర్మాణ వ్యయం తగ్గి, టికెట్ ధరలను పెంచాల్సిన అవసరం ఉండదు. తక్కువ మంది ప్రేక్షకుల నుండి ఎక్కువ వసూలు చేయడం కంటే, తక్కువ ధరతో ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్లకు చేరవేయడమే వ్యాపారపరంగా లాభదాయకం. అలాగే, ప్రతి థియేటర్‌లో కనీసం ముఫ్తై శాతం సీట్లు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలి. వాటి టిక్కెట్లను అతి తక్కువ ధరకే విక్రయించాలనే నిబంధన తీసుకురావాలి. పరిశ్రమ పెద్దలు తమ విలాసవంతమైన ఖర్చులను తగ్గించుకుని ప్రేక్షకుల ఆర్థిక స్థితిగతులను గౌరవించినప్పుడే ఈ సంక్షోభం గట్టెక్కుతుంది.
జనక మోహన రావు దుంగ,
8247045230
సినిమా టికెట్ ధరల పెంపు: వినోదమా లేక దోపిడీనా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



