నాటికి నేటికీ తెలుగు వాడికీ, వేడికీ వడికీ వరవడి వేమనే. ఆనాటికి బహుశా ఈ నాటికి కూడా తనతో పోల్చదగిన మరో ప్రజాకవి మనకు కనిపించరు. తమ తమ కోణాల్లో, బాణీల్లో మహోన్నత శిఖరాలధిరోహించిన మహాకవులు కూడా ఆయన పదును ముందు, పలుకుల ములుకుల ముందు నిలవడం కష్టం. అందులోనూ అన్ని రంగాలనూ సృశించినవారు అనుక్షణం గుర్తుకు వచ్చే శాశ్వతవాక్యాలు సృష్టించిన వారు మరిలేరు. తెలుగుభాషలో వేమన పద్యచరణాలు సామెతలుగా మారిపోయాయి. నానుడులుగా స్థిరపడిపోయాయి. ఎందుకంటే అవి జీవితంలోంచి వచ్చాయి. జీవితంలో నిలిచిపోయాయి. జీవితసత్యాలై పోయాయి. ఇన్నితరాల పాటు తెలుగుజాతికి ఉత్తేజకారకంగా నిలిచిన వేమన పద్యాలు పాడేసుకుంటున్నాం.. వాడేసుకుంటున్నాం. కాని వాటి కర్త వేమన గురించి మనకు తెలిసిందెంత? తెలుసుకున్నదెంత? తెలుసుకోవాలనే ప్రయత్నమెంత? తెలిసినదాన్ని తెలివిడితో ఉపయోగించినదెంత? అదైనా ఎంతకాలం తర్వాత?
ఎంత కొద్ది మంది పరిశోధకులు, ఎంత పరిమితంగా ఆయనపై దృష్టిపెట్టారు? మరి మన నరాల్లో, స్వరాల్లో భాగమైపోయిన ప్రజాకవి జీవితం పట్ల ఇంత అలసత్వం, ఆలస్యం ఎందుకు ప్రదర్శితమైంది? ఈ ప్రశ్నలలోనే వేమన ఔన్నత్యం మనకు చాలావరకూ తెలిసిపోతుంది. సనాతన మహామహో పాధ్యాయులు అనేకమందికి ఆయన పద్యాలు మరఫిరంగుల్లా తోచాయి. వాటిని చూడటానికే వెరచి సమాధి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నం చేసి విఫలమైనారు. జాతిని జాగృతం చేసే జయపతాకల్లా ఆయన పద్యాలు దాచిపెట్టిన కొద్ది ధగధగలాడాయి. ఆయన జీవితం గురించి అవాస్తవాలు చెప్పిన కొద్ది అసలు విషయాలపై ఆసక్తి ప్రబలింది. సిపిబ్రౌన్‌తో సహా పాశ్చాత్య పరిశోధకులు, కట్టమంచి రామలింగారెడ్డి, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, నార్ల వెంకటేశ్వరరావు, ఆరుద్ర, బంగోరె వంటి వాళ్లు అందరి కృషికి క్రోడీకరణగానే గాక అపురూప విషయ సేకరణకు కూడా ప్రతిరూపంగా ఎన్.గోపి వేమన సమగ్ర సందర్శనం చేయించారు. ఉన్న పరిమిత ఆధారాల ప్రాతిపదికన అధ్యయనాలు చేసి హేతుబద్దమైన అవగాహన ఇవ్వగలి గారు. వారు చేసిన కృషికి ధన్యవాదాలు చెబుతూ. వేమన ప్రభావంతో పోలిస్తే దొరికింది చెప్పుకుంటున్నది తక్కువేనని గుర్తిస్తూ పరిశోధనలు కొనసాగించాల్సిందే.
వేమన పద్యాల ప్రభావం
వేమన అంటే వేమన పద్యాలే. ఎవరు వేమన, ఏవి వేమన పద్యాలు తేల్చడానికి చాలా కాలంపట్టింది. ఇంత విస్తారంగా, అనుకరణ పద్యాలు కూడా తనవే అనిపించేంత శక్తివం తంగా వచ్చాయంటే వేమన ప్రభావం ఎంత గొప్పదో తెలుస్తుంది. వేమన పద్యాలను ఇంత కాలం చీకట్లో అట్టిపెట్టిన వారు ఎన్ని అకృత్యాలకు పాల్పడి వుంటారో ఊహించడం కష్టం కాదు. ఊహించడం అవసరం కూడా. చార్వాకులు, లోకాయతుల రచనలను వారి విమర్శకుల నుంచి తెలుసుకున్నట్టే వేమన ప్రతులను కూడా వ్యతిరేకుల గుప్పిటినుంచి విడిపించాల్సి వచ్చింది. పరస్పర విరుద్ధంగా ఇలా వేమన చెప్పి ఉంటాడా? అనే సందేహం కలిగిన చోట్ల ఈ అంశం కూడా గమనంలో ఉంచుకోవడం అవసరం. ఆ భావాలను సహించలేని వారు భాష్యాలు మార్చడానికి ప్రయత్నించి ఉంటారనడంలో ఆశ్చర్య మేమీ లేదు. పండితులూ, పరిశోధకులందరూ ఇంచుమించుగా వేమన 1650 ప్రాంతాలలో వాడని తేల్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 19ని వేమన జయంతిగా నిర్వహించాలని నిర్ణయించింది. రకరకాల వేమన అభిమానులు ఆ తేదీని చాలా కాలంగా పాటిస్తూ వస్తున్నారు.
16వ శతాబ్దం తెలుగువారి చరిత్రలో అంతకు ముందెన్నడూ ఎరుగని సంక్షోభాలను చూసింది. అదే కల్లోలం అనేక రూపాలలో మరో మూడు వందల ఏళ్లు కొనసాగింది. ఒక వెలుగు వెలిగిన విజయనగర సామ్రాజ్యం బలహీనపడిపోతున్న దశ అది. దారి పతనంతో దక్షిణ భారత చరిత్రలో కొత్త మార్పులు వచ్చాయి. అయినా 500 ఏళ్ల తర్వాత కూడా విజయనగర కాలం ప్రజల మనసుల్లో పచ్చగా ఉండిపోయిందంటే ఆ రాజుల రాజనీతి నైపుణ్యం, తమ పాలనా ప్రాంతంలో సానుకూల ఆర్థిక సామాజిక సాంస్కృతిక అభివృద్ధి కోసం వారు అనుసరించిన విధానాలే కారణం. ఒక దశలో మొత్తం దక్షిణ భారతదేశం స్థానిక తేడాలు భాషా సాంస్కృతిక నైతిక విలువల వ్యత్యాసాలతో ఈ ప్రభావాన్ని చూసింది. విజయనగర రాజులు స్థానికంగానూ, అంతర్జాతీయంగానూ కూడా వర్తక వాణిజ్యాలను ప్రోత్సహించారు.
రేవు పట్టణాలలో విదేశీయులకు ద్వారాలు తెరిచి వ్యాపార సంబంధాలు పెంచుకున్నారు.వేమన కవిత్వంలోని సంక్లిష్టతను, సంఘర్షణను సమగ్రంగా అర్థం చేసుకోవాలి. అందుకు విజయనగర సామ్రాజ్య పతనం ప్రభావాన్నే గాక ఆ రాజ్య విధానాల వల్ల ఏర్పడిన వాతావరణ ప్రభావాన్ని కూడా గమనంలో ఉంచుకోవాలి. ఎందుకంటే కల్లోల కాలమెప్పుడూ కవిత్వానికి కవివాక్కుకూ పదును పెడుతుంది.సంక్షోభంలో వంవేదనలు సాంద్రమవుతాయి. సంక్లిష్టతలు సాహిత్యసృజనగా మారతాయి. వేమన కవిత్వంలో మనం స్థిర సమాజాన్నే గాక మారుతున్న విలువలను కొత్తపాతల ఘర్షణను కూడా చూస్తాం. గురజాడ చెప్పిన కొత్త పాతల మేలుకలయిక అన్న అర్థంలో కాదు, పుడమితల్లికి పురిటినొప్పులు కొత్త సృష్టిని స్పురింప చేస్తున్న దశ. అదే వేమన పద్యాలకు అంతటి వైవిధ్యాన్ని నైశిత్యాన్ని ఆవేదనాగ్రహాలను తెచ్చిపెట్టింది.
కల్లోలంలో కాంతిధార
17వ శతాబ్దమంతా యుద్ధాల మయమే. కేంద్రంలో రాజులు ఎవరనే దానితో నిమిత్తం లేకుండా స్థానిక ప్రభువులు పాలెగాళ్లుగా పేరొందిన పాళియగార్లు దిగువన పెత్తనం చేస్తూ ప్రజలను పీడిస్తూ వచ్చారు. నిజానికి ఈ పాలియగార్లు చిల్లర రాజులు పొరుగు ఊళ్లను దోచుకున్న ఉదంతాలు కూడా కోకోల్లలు. విజయనగర రాజులు విపరీతమైన వికేంద్రీకరణ విధానాన్ని అనుసరించారు. మండలాధి పతులు పూర్తి అధికారం చెలాయించడమే గాక స్వంత నాణేలు కూడా ముద్రించుకునేవారు. సైనిక బలం ఎక్కువగా ఉన్నవారి పెత్తనమే జరిగేది. వారు వసూలు చేసినదానిలో సగం పైకి పంపించేవారు.రైతులు పన్నులు కడుతుంటే పై వర్గాల వారు విలాస జీవితం గడిపేవారు. కంసాలి చేనేత వంటి వృత్తుల వారు కొంత నిలదొక్కుకుంటున్నా గ్రామీణ వృత్తులు మాత్రం చితికిపోతున్నాయి. ఇవన్నీ వేమన పద్యాలలో ప్రతిబింబించాయి.
సామాజికంగా ఈ కల్లోలిత పరిస్థితులు ప్రజలలో అభద్రతను పెంచి మూఢనమ్మకాలకు పాలుపోశాయి. వర్ణవ్యవస్థ వికృతరూపం దాల్చింది. క్రీ.శ. 1600లో ఈస్ట్ ఇండియా వర్తక సంఘం ఏర్పడగా 1611లో నిజాం పట్నం, మచిలీపట్నంలతో వ్యాపార సంబంధాలు పెరిగాయి.పైన చెప్పుకున్న వృత్తికారుల జీవితాలను కంపెనీ ప్రభావితం చేయడం పెరిగింది. ప్రభుత్వం ఒకవైపు, కులీన పాలకవర్గాలు మరోవైపు, కొత్తగా పెంపొందుతున్న వాణిజ్యవర్గం ఇంకోవైపు వృత్తి దారులతో చెలగాటమాడాయి. సమాజంలో ఉత్పత్తి వ్యవస్థలూ ఆర్థిక సాంస్కృతిక జీవనం ఊహాతీతమైన మార్పులకు గురైంది. కుల,మత భేదాలను కూడా వారు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం మొదలు పెట్టారు. బ్రిటిష్ వారు ప్రత్యేకించి మన బంగారు నిల్వలపైన, నూలు బట్టలపైన కన్నేయడంతో పైకి వస్తున్న ఆ వర్గాలే ఎక్కువగా చితికిపోయాయి.
ఈ పరిస్థితులన్నిటిలో ప్రజలకు ఎంతో కొంత ఊరట కలిగించ వలసిన మతం ఆధ్మాత్మికత కూడా అంత:కలహాల్లోనూ పరస్పర విద్వేషాల్లోనూ కూరుకుపోయాయి. ఇవన్నీ వింటుంటే మనకు ఇప్పటి పరిస్థితులు గుర్తుకు వస్తే ఆశ్చర్యం లేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో పల్లె కన్నీరుపెడుతుందో గోరటి వెంకన్న పాట గుర్తుకు వస్తే వింత అంతకన్నా ఉండదు. వీటి నేపథ్యంలో పుట్టిన క్రాంతదర్శి వేమన.
”శతక కవుల్లో శీర్షికలా నిలిచిన వేమ- ఏకపక్ష నీతికి వ్యతిరేకంగా నిలిచిన శేషప్రశ్న.- సోకాల్డు భారతీయ సంస్కృతి కుళ్లును బయటపెట్టిన ధిక్కారం వేమన- అదృష్టవంతులనబడే స్వార్థపర కూటమి చేతుల్లో పడిన ఫ్యూడల్ సమాజ అశాంతి వేమన- కాలజ్ఞాన చైతన్యం వేమన- యుగ అరాచకంలో మొలుచుకువచ్చిన తత్కాల సంస్కారం వేమన- ఫ్యూడల్ యుగ స్వభావాన్ని నిలదీసిన ఆందోళన- అసాధ్య భావజాలం-అపార భాషా నుడికారం-యుగస్వభావ సాక్షాత్కారం- అలజడిని అక్షరీకరించిన ఆక్రోశం- ఆక్రోశాన్ని నుడికారం చేసిన సామెత- అభివ్యక్తి నభూతో నభవిష్యతి.”(జ్వాలాముఖి)
నేటికీ వెలుగుజాడ
హేతుశీలత, మానవీయత, సామాజిక న్యాయం, ధిక్కారతత్వం, శ్రమగౌరవం, ప్రతిఘటనల ప్రతిబింబమైన వేమన ఈనాటి అవసరాలకూ ఆలంబమే. అంతెందుకు? వేమన పద్యాలలో ఉన్నన్ని ప్రశ్నలు మరే కవిలోనూ మనకు కనిపించవు. భక్తితెచ్చిన బాధలో కనిపించని దేవుడిని ప్రశ్నించిన వారున్నారు గాని, కనిపించే సమాజ దుర్లక్షణాలపై కత్తిదూసిన వారు, రాజులనూ యాజులనూ బూజులనూ ప్రశ్నించిన వారు వేమనలా ఎందరో లేరు. అందుకే ఆయన వారసత్వం అమూల్యం. అసమానం. వేమన తన కాలం కన్నా చాలా చాలా ముందుకు నడిచాడు.కుండ కుంభమయ్యె కొండ పర్వతమయ్యె అంటూ సంస్కృతీకరణను కూడా ఎత్తి చూపాడు. మాలల గురించి మరో మూడు వందలేళ్ల తర్వాత గురజాడ చెప్పింది అప్పుడే చెప్పేశాడు.
మాలవాని నంట మరి నీళ్లమునిగేరు అనీ , మాలవానినేల మహిలోన నిందింప అనీ చాలా చోట్ల ఆ ప్రస్తావనలు చేశారు. పైగా పండితులమని విర్రవీగేవారిని ఉద్దేశించి వాస్తవికతతో సంబంధం లేని చిలకపలుక వంటిదేేనని గురజాడ చెప్పింది కూడా వేమన కూడా రాసిందే. శ్రమములోన పుట్టి సర్వంబు తానౌను అన్నప్పుడు శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదన్న శ్రీశ్రీ గుర్తుకు రాకుండా ఉండడు. అల్పబుద్ధివానికధికారం ఇవ్వడం, గణకులొప్పుకున్న గవ్వలు చెల్లడం, రాతిబొమ్మలకు రంగైన వలువలేలని ఆక్షేపించడం, శకునాలను ముహూర్తాలను తోసిపుచ్చడం ఇవన్నీ ఈనాటికి కూడా పూర్తిగా వర్తించేవే. ప్రవచన కారులు, వందల శ్లోకాలు వల్లెవేసే వారు జనం నోట నానే వేమన పద్యాలను ఎందుకు తల్చుకోరంటే అదే కారణం మరి, అందుకే ప్రజా కళాకారులు ఉద్యమకారులు వేమనను మరింతగా తలుచుకోవాలి. ఆ పదును పెంచుకోవాలి.
తెలకపల్లి రవి



