Sunday, January 18, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమేడిపండు

మేడిపండు

- Advertisement -

‘మేడిపండు చూడ మేలిమైయుండు పొట్ట విప్పిచూడ పురుగులుండు’ అని వేమన కొన్ని శతాబ్దాల క్రితమే పోల్చి చెప్పాడు. ఇప్పుడు ప్రతి విషయానికీ, ప్రతి వ్యక్తికీ పోల్చదగినదిగానే ఉంటోంది. పొట్ట విప్పకుండానే భ్రష్టత్వమంతా బయటపడుతూనే ఉంది. ‘ఇంటిపేరు కస్తూరివారు, ఇంట్లో గబ్బిలాల మోత’ అని ఒక నాటకంలో పాత్రధారి అంతర్మధన సంభాషణ ఉంటుంది. అదే మాదిరి ఇప్పుడు ఎవరికి వాళ్లం సంభాషించుకోవాల్సిన సందర్భం ఎదురౌతున్నది. మన ప్రచారార్భాటాలకు కొదువలేదు. ప్రకటనలకు, ప్రగల్భాలకు అంతేలేదు. కానీ ఒక్కసారి బతుకులోకి, జరుగుతున్న కథలోకి తొంగిచూస్తే చాలా దయనీయ స్థితి దర్శనమిస్తోంది. ఒక భ్రమాత్మకమైకంలో మనమంతా ఊగుతున్నామా అనిపిస్తుంది. మనల్ని కమ్మేసిన పొరల్ని తొలగించి, పక్కనబెట్టి చిన్నగా చూసుకోవాలి. మనమెలా ఉన్నామో, ఎటు పయనిస్తున్నామో!

ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా గొప్పలు పోతున్నాం. జపాన్‌, బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థలనూ దాటేశాం. జీడీపీలో ఎంతో ముందున్నాం, అభివృద్ధిలో నూతన శకంలోకి పయనించామని చెప్పుకుని గర్వపడుతున్నాము. విశ్వగురు పీఠాలనూ ఆపాదించుకుంటున్నాం. కానీ, దేశంలోని సామాన్య ప్రజలకు కనీసం రెండు పూటలా తిండిపెట్టలేక పోతున్నామనే సంగతిని ఎవరైనా పట్టించుకున్నారా! అంతెందుకు, కనీసం తాగటానికి మంచినీళ్లు ఇవ్వగలుగుతున్నామా! మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మున్సిపాలిటీ సరఫరా చేసిన కలుషిత నీరు తాగి దాదాపు ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు. వందలమంది ఆస్పత్రి పాలు కావడం అనేది ఒక్క ఉదా హరణ మాత్రమే. దేశంలో మంచినీరు సరిగాలేకపోవటం వలననే అనేక వ్యాధులకు గురవుతున్నారని పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, మంచినీటి వ్యాపారం దినదినమూ పెరిగి వేలకోట్ల రూపాయలకు ఎగబాకుతున్నది. ఆర్థిక వ్యవస్థను లెక్కల్లో చూపెడతారు. తాగే నీళ్లను ఎవరు చూస్తారు. ఒక్క ఇండోర్‌లనే కాదు, గుజరాత్‌లోని గాంధీనగర్‌లోనూ కలుషిత నీటితోనే వందలాది మంది అనారోగ్యం పాలయ్యారు.

తాగే నీరు కలుషితము. నీల్చేగాలి కలుషితము. ఢిల్లీలో ప్రజలు మాస్క్‌లు ధరించకుండా తిరగలేని, బతకలేని పరిస్థితులు వచ్చేశాయి. అక్కడి పౌర సమాజం స్వతంత్రంగానే కాలుష్యాన్ని నివారించే చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారంటే ఎంత తీవ్రంగా ఉందో గమనించవచ్చు. ప్రపంచంలోని అత్యంత కలుషితమైన నగరాల్లో అరవై మూడు భారతదేశంలోనే ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. దేశంలో పెరుగుతున్న జల, వాయు కాలుష్యాలతో గుండె జబ్బులు, ఊపిరితిత్తులు, క్యాన్సర్‌లాంటి వ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఇది మన విశ్వగురు ఏలుబడిలో పెరుగుతున్నవి. ఇంకో నిజం ఏమంటే, ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రి బయట వందలాది మంది అనారోగ్య బాధితులు, వైద్యం పొందేందుకు పడిగాపులు పడుతున్నారు. చలిలో ఏ సౌకర్యాలూ లేక బాధలు పడుతున్నారు. చలికి వణుకుతూ ఫాల్తిన్‌ కవర్లు కప్పుకుని వైద్యం కోసం ఎదురుచూస్తున్నారు. ఇది విశ్వగురు నివాస నగరమే!

ఇక దేశంలో కార్పొరేట్‌ వ్యాపారులు తమ లాభాల కోసం సహజ సంపదలను దోచుకునేందుకు పర్యావరణాన్ని విధ్వంస మొనరించే పనులు చేస్తుంటే, ప్రభుత్వం వాళ్లకు వంతపాడుతున్నది. దాంతో ఆవరణమంతా కాలుష్యమయంగా మారుతున్నది. గుజరాత్‌, రాజస్థాన్‌, ఢిల్లీ మొదలైన ప్రాంతాలకు హానికలిగించే విధంగా ఆరావళి పర్వతాలనూ ధ్వంసం చేయాలని పూనుకున్నారు. సహజ సంపదల దోపిడీతోపాటు ఆవరణ విధ్వంసముతో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మేడిపండులా మెరిసిపోతున్నది. చిన్నపిల్లలు జ్వరాలు, దగ్గులతో బాధపడుతూ రోగాల భవిత కళ్లెదుట దర్శనమిస్తున్నా కాలుష్యాలనెలా అరికట్టాలన్న ధ్యాసే మన నాయకులకు లేదు. సరియైన దగ్గుమందును కూడా అందించలేక ప్రాణాలనూ తీస్తున్నాము.

మందుల్లో కల్తీలు, తిండిలో కల్తీలు, నీటిలో కల్తీలు, గాలిలో కల్తీ, నిండా నిండిపోయిన కల్తీలొకవైపు, ఉపాధిలేమి, నివాస లేమి, భరోసాయే లేని జనం మరోవైపు. అంతేకాదు, అభద్ర జీవన దేశాలలో మన దేశమూ ఉంది. ప్రజాస్వామిక మనుగడ ప్రశ్నార్థకమవుతున్నది.ఇన్నిరకాల బాధలతో, వేదనలతో సతమతమవుతున్న దేశంగా కొనసాగుతున్నదని అనేక నివేదికలు తెలుపుతుండగా, వెలుగుతున్న, దూసుకుపోతున్న అభివృద్ధి వ్యవస్థగా పేర్కొనడం హిపోక్రసీకాక మరేమిటి! కొంతమంది ఆదాయాల లెక్కలుచూసి అదే వెలుగని, మెరుపని తెలిపితే ఏం లాభం! భవిష్యత్‌ తరాలకు ఎలాంటి సమాజాన్ని అందిస్తున్నామో తెలుసుకుని మసలు కోవడం నేటి అవసరం. మేడిపండు పొట్టనూ విప్పి చూడాలి!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -