Sunday, January 18, 2026
E-PAPER
Homeజాతీయంవలస కార్మికుడి హత్యపై ఆగ్రహజ్వాలలు

వలస కార్మికుడి హత్యపై ఆగ్రహజ్వాలలు

- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో ఆందోళనలు
రోడ్ల మీదకు వచ్చిన వందలాది మంది ప్రజలు
నిరసనకారులపై పోలీసుల లాఠీఛార్జి
బంగ్లాదేశీ అంటూ హత్య చేశారు : కుటుంబ సభ్యులు

ముర్షీదాబాద్‌ : జార్ఖండ్‌లో ముస్లిం వలస కార్మికుడి అనుమానాస్పద మతిపై పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. బంగ్లాదేశీ అని అనుమానించి హత్య చేశారంటూ స్థానికులు ఆందోళన చేయడంతో బస్సు, రైల్వే సర్వీసులకు శుక్ర, శనివారాల్లో అంతరాయం కలిగింది. బెల్దంగాలోని బరువా మోర్‌ వద్ద వందలాదిమంది రోడ్లపై ఆందోళనలు చేయడంతో ఎన్‌హెచ్‌ 12పై ట్రాఫిక్‌ స్తంభించింది. నిరసనకారులపై పోలీసులు శనివారం లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. ఆందోళనకారులు రైల్వే గేటును ధ్వంసం చేసి, తూర్పు రైల్వేలోని సీల్దా-లాల్‌గోలా రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారని ముర్షీదాబాద్‌ ఎస్‌పీ కుమార్‌ సన్నీరాజ్‌ తెలిపారు. లాఠీఛార్జి చేసి, రోడ్లపై అడ్డంగా ఉంచిన వాటిని తొలగించామనీ, సాధారణ పరిస్థితి నెలకొందని చెప్పారు. రెండు రోజుల్లో 20 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. నిందితులను అరెస్టు చేస్తామని నిరసనకారులకు హామీ ఇచ్చారు.

వలస కార్మికుడి అనుమానాస్పద మృతి
ముర్షీదాబాద్‌లోని సుజాపూర్‌కు చెందిన అలావుద్దీన్‌ షేక్‌ (36) ఐదేండ్ల క్రితం ఉపాధి కోసం జార్ఖండ్‌లోని విశ్రామ్‌ పూర్‌ వెళ్లి, అక్కడ హాకర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన మృతదేహం గురువారం ఉరివేసుకున్న స్థితిలో ఉండగా, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తొలుత ప్రకటించారు. సుజాపూర్‌కు చెందిన కొంతమంది జార్ఖండ్‌లోని విశ్రామ్‌పూర్‌ వెళ్లి, ఆయన మతదేహాన్ని తీసుకొచ్చారు.

బంగ్లాదేశీ అంటూ హత్య : కుటుంబ సభ్యులు
బెంగాలీలో మాట్లాడుతుండటంతో బంగ్లాదేశీ అని అంటూ, ఆయనపై దాడి చేసి చంపేశారని, ఆ తరువాత ఆత్మహత్యగా భావించేలా ఉరి తీశారని మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. తనను చంపేస్తున్నారని చెప్పాడని అన్నారు. అలావుద్దీన్‌ షేక్‌ తల్లి సోనా బీబీ మీడియాతో మాట్లాడుతూ బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన కొడుకుతో చివరిసారిగా ఫోన్‌లో మాట్లాడానని చెప్పారు. ”అవకాశం దొరికిన వెంటనే ఇంటికి తిరిగి వస్తానని చెప్పాడు. అప్పుడు చాలా భయపడుతున్నాడు. ఆ తరువాత చాలాసార్లు ఫోన్‌ చేశాను. తను ఫోన్‌ ఎత్తి మాట్లాడలేదు” అని కన్నీరు మున్నీరయ్యారు. ముస్లిములను బంగ్లాదేశీయులంటూ ముద్ర వేస్తున్నారని, ‘జై శ్రీరామ్‌’ అని నినాదాలు చేయాలని బలవంతం చేసి, దారుణంగా దాడిచేసి చంపే స్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ”మేము కూడా ఈ దేశ పౌరులమే. ఇతర రాష్ట్రాల్లో ఇక్కడి ప్రజలు హత్యకు గురికారని హామీ ఇవ్వండి” అని నిరసనకారులు డిమాండ్‌ చేశారు.

మైనారిటీల హత్య వెనుక కేంద్ర ఏజెన్సీలు : మమతా బెనర్జీ
డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలున్న రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాల్లో బెంగాల్‌ నుంచి వలస వెళ్లిన కార్మికులు, మైనారిటీలు హత్యకు గురవుతున్నారని, ఈ సంఘటనల వెనుక కొన్ని కేంద్ర ఏజెన్సీలు ఉన్నాయని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వలస కార్మికులు, మైనారిటీల ఆగ్రహం సరైందేనని, వారికి అండగా ఉంటానని అన్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలి : సీపీఐ(ఎం)
ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన బెంగాల్‌ కార్మికులను, ముస్లిములను బంగ్లాదేశీయులుగా చెబుతూ దాడి చేసి, చంపేయడాన్ని సీపీఐ(ఎం) పశ్చిమ బెంగాల్‌ కమిటీ తీవ్రంగా ఖండించింది. దీని వెనుక ఉన్న వారిని, నిందితులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది. బాధిత కుటుంబాలని ఆదుకోవాలని కోరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -