క్యూ3లో లాభాల్లో 4 శాతం పతనం
ముంబయి : ప్రముఖ ప్రయివేటు రంగ విత్త సంస్థ ఐసీఐసీిఐ బ్యాంక్ నికర లాభాల్లో తగ్గుదల చోటుచేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 4.02శాతం తగ్గుదలతో రూ.11,317.9 కోట్ల లాభాలతో సరిపెట్టుకుంది. మొండి బాకీలకు కేటాయింపులు పెరగడంతో లాభాలు తగ్గాయి. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.11,792 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇదే సమయంలో కంపెనీ నికర వడ్డీ ఆదాయం రూ.20,371 కోట్లుగా ఉండగా.. గడిచిన క్యూ3లో 7.7 శాతం తగ్గి రూ.21,932.2 కోట్లుగా చోటు చేసుకుంది.
బ్యాంక్ నికర నిరర్థక ఆస్తులు 0.39 శాతం నుంచి 0.37 శాతానికి తగ్గాయి. స్థూల ఎన్‌పీఏలు 1.58 శాతం నుంచి రూ.1.53 శాతానికి పరిమిత మయ్యాయి. కాగా.. డిసెంబర్ త్రైమాసికంలో రూ.5,356 కోట్ల స్థూల నిరర్థక ఆస్తులకు కేటాయింపులు చేసింది.. ఇంతక్రితం ఏడాది ఈ కేటాయింపులు రూ.5,304 కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్ మొత్తం ఆదాయం 2 శాతం పెరిగి రూ.49,334 కోట్లుగా నమోదయ్యింది.



