ఎన్‌ఈపీతో ఉన్నత విద్యారంగం కలుషితం : ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ సదస్సులో వక్తలు
వికసిత భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లును ఉపసంహరించుకోవాలి
స్కూల్ బచావో ఉద్యమాన్ని బలోపేతం చేయాలి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
చరిత్ర వక్రీకరణకు మోడీ సర్కార్ బీజం వేసిందని, ఫలితంగా చరిత్ర పుటలను చెరిపేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విద్యావేత్తలు విమర్శించారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)తో ఉన్నత విద్యారంగాన్ని కలుషితం చేస్తున్నారని దుయ్యబట్టారు. శనివారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సుర్జిత్ భవన్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ‘కారణ విధ్వంసం-చరిత్ర, విజ్ఞాన శాస్త్ర వక్రీకరణ’ అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సు వికసిత భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లును ఉపసంహరించుకోవాలని, స్కూల్ బచావో ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపు నిస్తూ రెండు తీర్మానాలను ఆమోదించింది. దేశవాప్తంగా దాదాపు 700మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఐఐటీ ముంబయి మాజీ ప్రొఫెసర్ రామ్ పునియాని మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం చరిత్ర, విజ్ఞాన శాస్త్రాలను వక్రీకరించి, తప్పుడు వాదనలను ముందుకు తీసుకువస్తున్నదని విమర్శించారు.
ఎన్‌ఈపీతో ఉన్నత విద్యలోని శాస్త్రీయ ఆలోచనలపై దాడి జరుగుతుందని అన్నారు. ప్రపంచంలో ఒకపక్క విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి జరుగుతుంటే, దేశంలో మాత్రం దానికి విరుద్ధంగా పాలకులు విధానాలు రూపకల్పన చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటివరకు ప్రధాని మోడీ, బీజేపీ రామమందిరం అంశాన్ని వాడుకున్నారని, ఇప్పుడు సోమనాథ్ ఆలయం పేరుతో సరికొత్త వివాదానికి తెర లేపారని అన్నారు. రామమందిర ఉద్యమం బాబ్రీ మసీదు దారుణ విధ్వంసానికి దారితీసిందని, ఇది బీజేపీకి, దాని మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)కు గణనీయమైన ఎన్నికల లాభాలను చేకూర్చిందని విమర్శించారు. ఇప్పుడు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ (సోమనాథ్ ఆత్మగౌరవ ఉత్సవం)తో ఒక కొత్త వివాదం తెరపైకి వచ్చిందన్నారు. ఆ తరువాత కాశీ, మధుర వంటి వాటిపై కూడా ఈ ప్రభావం పడవచ్చని అన్నారు.
కన్నూర్ విశ్వవిద్యాలయ మాజీ వైస్ చాన్సలర్, ఐసీహెచ్‌ఆర్ మాజీ మెంబర్ సెక్రెటరీ డాక్టర్ ఆర్ గోపీనాథ్ మాట్లాడుతూ సంఘ్ పరివార్ చరిత్రను పూర్తిగా తిరిగి రాయలేకపోయినప్పటికీ, వారు అలా చేయడానికి తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారని అన్నారు. పుస్తకాలను తిరిగి రాయడంతో, జాతీయ విద్యా విధానంతో ఈ ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వికసిత భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లును కూడా అదే లక్ష్యంతో పెట్టుకుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తిగా నియంత్రించుకుంటోందని, క్యాంపస్‌లలో జరుగుతున్న బీజేపీ దాడి చర్యలను ఎదుర్కోవడానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని ఆయన అన్నారు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) మాజీ శాస్త్రవేత్త గౌహర్ రజా, చరిత్రకారిణి రుచికా శర్మ మాట్లాడుతూ చరిత్రపై దాడి చేయడంతో ఆర్‌ఎస్‌ఎస్ మత ఉన్మాదానికి తెరలేపుతుందని, అందుకు మోడీ సర్కార్ అండగా ఉందని విమర్శించారు. విద్యార్థుల మెదళ్లలో శాస్త్రీయ దృక్పథం, ఆలోచనలు ఎక్కకుండా ఆదిలోనే తుంచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. అందుకు ఎన్‌ఈపీ అనే ఆయుధాన్ని విద్యావ్యవస్థపై వదిలారని విమర్శించారు. మోడీ సర్కార్ చర్యలను తిప్పికొట్టేందుకు విద్యార్థులు, మేధావులు, చరిత్రకారులు, విద్యావేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆదర్శ్ ఎం. సాజి, శ్రీజన్ భట్టాచార్య, జెఎన్‌యూఎస్‌యూ మాజీ అధ్యక్షురాలు ఐషీ ఘోష్, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.



