Sunday, January 18, 2026
E-PAPER
Homeజాతీయంకేరళ ఎంఎస్‌ఎంఈ మోడల్‌ భేష్‌

కేరళ ఎంఎస్‌ఎంఈ మోడల్‌ భేష్‌

- Advertisement -

నాలుగేండ్లలో ఏడాదికి సగటున లక్ష కంపెనీలు ఏర్పాటు
రోజుకు 400 కొత్త చిన్న పరిశ్రమలు
గంటకు 14 కొత్త సంస్థలకు అనుమతులు
7.5 లక్షల ఉద్యోగాల కల్పన

తిరువనంతపురం : కేరళ రాష్ట్రం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ)కు ప్రధాన కేంద్రంగా మారింది. ఆ రాష్ట్రంలో రోజుకు 400కు పైగా కొత్త ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటవుతున్నాయి. అక్కడి వామపక్ష ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ అనుకూల విధానం భళా అనిపిస్తోంది. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తల్లో అక్కడి పినరయి విజయన్‌ ప్రభుత్వం బలమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. దీంతో లక్షలాది ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి. గడిచిన నాలుగేండ్లలో ఏడాదికి సగటున లక్ష ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు కావడం విశేషం. రాష్ట్రంలో రోజుకు సగటున 400 కంటే ఎక్కువ ఎంఎస్‌ఎంఈలు ప్రారంభమవుతున్నాయి. అంటే ప్రతి గంటకు సుమారు 14 కొత్త సంస్థలు అనుమతులు పొందుతున్నాయి. ఇటీవల కేరళ రాష్ట్రం పారిశ్రామిక వృద్ధిలో ఒక మైలురాయిగా నిలిచిన ‘ఎంటర్‌ప్రిన్యూరల్‌ హియర్‌ ఇన్షియేటివ్‌’ కార్యక్రమానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

గతంలో ఏటా పదివేల ఎంఎస్‌ఎంఈలే..
గతంలో కేరళలో ఏటా కేవలం 10,000 ఎంఎస్‌ఎంఈలు ప్రారంభమయ్యేవని ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి పి రాజీవ్‌ ఇటీవల వెల్లడించారు. కానీ ప్రస్తుతం రాష్ట్రం ఏటా సగటున లక్షకు పైగా కొత్త పరిశ్రమలను నమోదు చేస్తోందన్నారు. 2022 నుండి 2025 మధ్య కాలంలో రాష్ట్రంలో మూడున్నర లక్షలకుపైగా పరిశ్రమలు స్థాపించబడ్డాయని చెప్పారు. ”ఈ గణాంకాలు క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలను అందిస్తున్నాయి. ఈ చొరవ వల్ల భారతదేశంలోనే కేరళకు ఎంఎస్‌ఎంఈ విభాగంలో ఉత్తమ విధానాల ప్రశంసలు, గుర్తింపు లభించింది. అదే విధంగా అమెరికన్‌ సొసైటీ ఫర్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి ‘నోవెల్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌’ అవార్డు సైతం లభించింది.” అని మంత్రి రాజీవ్‌ తెలిపారు.

7.5 లక్షల ఉద్యోగాలు
ఎంఎస్‌ఎంఈల్లో రూ.22,688 కోట్ల పెట్టుబడుల వల్ల రాష్ట్రంలో కొత్తగా 7.5 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయని మంత్రి తెలిపారు. కొత్తగా లక్ష మంది మహిళా ఔత్సాహికవేత్తలు భాగస్వామ్యమయ్యారన్నారు. ఎంఎస్‌ఎంఈ లకు వేగంగా అనుమతులను మంజూరు చేస్తోన్నామన్నారు. ఈ మార్పునే నిజమైన ‘కేరళ స్టోరీ’గా ఆయన అభివర్ణించారు. ఇదే కేరళ మోడల్‌కు నిదర్శనమని పేర్కొన్నారు. అందరినీ కలుపుకుని పోయే ఈ వినూత్న విధానం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోందని రాజీవ్‌ తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -