అనుమతిలేదంటూ ఎక్కడికక్కడ నేతల అరెస్టు, గృహ నిర్బంధం
సికింద్రాబాద్ ప్రాంతంలో భారీగా పోలీసుల మోహరింపు
నవతెలంగాణ-బేగంపేట
సికింద్రాబాద్‌ను ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం బీఆర్‌ఎస్ పిలుపునిచ్చిన శాంతియుత ర్యాలీ కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఉదయం నుంచే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాలు, ఎంజీ రోడ్, మోండా మార్కెట్, జనరల్ బజార్ ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఉదయం నుంచే వివిధ డివిజన్‌ల నుంచి బీఆర్‌ఎస్ కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకులు రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుండగా పోలీసులు వారిని మధ్యలోనే అడ్డగించి అరెస్టు చేశారు. ఎంజీ రోడ్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నల్ల జెండాలు, నల్ల కండువాలతో ‘సికింద్రాబాద్ బచావో’ నినాదాలు చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కార్పొరేటర్ సామల హేమతోపాటు లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు పవన్ కుమార్ గౌడ్, పలువురు నేతలు అరెస్టయ్యారు. తలసాని సాయికిరణ్ యాదవ్‌ను గోషామహల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా తలసాని సాయికిరణ్ మాట్లాడుతూ.. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామన్నా అక్రమంగా అరెస్టులు చేయడమేంటని, పోలీసులు ర్యాలీని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. సికింద్రాబాద్ చరిత్ర, అస్తిత్వం లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈనెల 5న ర్యాలీకి అనుమతి కోరితే ఉద్దేశపూర్వకంగా శుక్రవారం రాత్రి తిరస్కరించారని చెప్పారు. ర్యాలీకి అనుమతి లేకుంటే తాము చేస్తున్న ఏర్పాట్లను ముందురోజు పోలీసు అధికారులు పరిశీలించారు కదా అని ప్రశ్నించారు. ప్రజలు పెద్దఎత్తున మద్దతు తెలుపుతున్నారని, రెట్టింపు ఉత్సాహంతో ఫిబ్రవరి మొదటి వారంలో మళ్లీ పెద్ద ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. నిరసనల నేపథ్యంలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
నిర్బంధాలతో ప్రజల ఆకాంక్షలను అడ్డుకోలేరు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
సికింద్రాబాద్‌ను ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన శాంతి ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంపై సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్బంధాలతో ప్రజల ఆకాంక్షలను అడ్డుకోలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మోండా మార్కెట్‌లోని పద్మారావుగౌడ్ నివాసం వద్ద పోలీసులు ఆయనను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సికింద్రాబాద్ ప్రాముఖ్యతను కనుమరుగు చేసేలా ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదన్నారు. తెలంగాణ భవన్ నుంచి అందిన సమాచారం మేరకు ర్యాలీని రద్దు చేసుకున్నామని తెలిపారు. పోలీసులు అరెస్టు చేసిన తమ పార్టీ నేతలు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.



