ఐద్వా జాతీయ మహాసభలకు తరలిరావాలి : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపు
నవతెలంగాణ-నల్లగొండటౌన్
ఐద్వా జాతీయ మహాసభకు ఊరుకో బండి, ఇంటికో మహిళ తరలి రావాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ పిలుపునిచ్చారు. ఈనెల 25 నుంచి 28 వరకు హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్న ఐద్వా 14వ జాతీయ మహాసభల మొదటి రోజు నిర్వహించనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవనంలో శనివారం విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత యువతీయు వకులపై ఉన్నదని, వారికి సరైన మార్గదర్శనం కోసం మహిళా సంఘం వివిధ ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తున్నదని చెప్పారు. విద్యపై దృష్టి పెట్టాలని, మత్తు పదార్థాలు-మద్యపానం వంటి చెడు అలవాట్లను వీడాలని యువతకు సూచించారు.
మహిళలపై జరుగుతున్న దాడులకు మద్యం, అశ్లీలత వంటి సామాజిక వ్యాధులే కారణమని, ప్రభుత్వాలు వీటి నిరోధానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐద్వా పోరాటాల ఫలితంగా మహిళలకు అనేక చట్టాలు, రక్షణలు లభించాయని, అయినప్పటికీ నేరాలు తగ్గకపోవడం తీవ్ర ఆందోళనకర విషయమని అన్నారు. బిల్కీస్బానో కేసు ఉదాహరణగా తీసుకుంటూ, నిందితులు యథేచ్ఛగా తిరుగుతున్నారని, బాధితులు శిక్షలు అనుభవిస్తున్నారని.. ఇది ప్రభుత్వాల వైఫల్యాన్ని చూపుతోందని విమర్శించారు. బిల్కీస్బానో కుటుంబానికి అండగా నిలిచి పోరాడి నిందితులను తిరిగి జైలుకు పంపించడంలో మహిళా సంఘం పాత్ర చారిత్రకమని తెలిపారు. గృహ హింస చట్టం, ఆస్తి హక్కు చట్టం, మహిళలకు రిజర్వేషన్లు వంటివన్నీ ఐద్వా ఉద్యమాల ఫలితమేనని గుర్తుచేశారు.
కేంద్ర ప్రభుత్వం 33శాతం మహిళా రిజర్వేషన్ చట్టం అమలులో విఫలమైందన్నారు. వెంటనే చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళల అభ్యున్నతికి భవిష్యత్ ఉద్యమాలకు సంబంధించిన తీర్మానాలు జాతీయ మహాసభలో ఆమోదిస్తామని, దేశవ్యాప్తంగా 1000 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా యువత కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈనెల 25న జరగనున్న బహిరంగ సభకు జాతీయ నాయకులు హాజరవుతారని, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, అధ్యక్షులు పోలిపోయిన వరలక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండ అనురాధ, జిల్లా ఉపాధ్యక్షురాలు జిట్టా సరోజ, తుమ్మల పద్మ తదితరులు పాల్గొన్నారు.



