కార్మిక, కర్షక ఫలాలు ఎర్రజెండా పోరాట ఫలితమే
ప్రజల్లో చైతన్యం కోసం కమ్యూనిస్టులుగా కృషి
సీఎం దృష్టికి జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్య
నేటి నుంచి సీపీఐ శతాబ్ది ఉత్సవాలు- ఖమ్మంలో చరిత్రాత్మక ఘట్టం
టీడబ్ల్యూజేఎఫ్ ‘మీట్ ద ప్రెస్’లో కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కమ్యూనిస్టుల ఐక్యత అవశ్యమని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిజం అజరామరమని చెప్పారు. ప్రజల్లో మరింత చైతన్యం కోసం కమ్యూనిస్టులుగా కృషి చేస్తున్నట్టు చెప్పారు. నేటి నుంచి సీపీఐ శతాబ్ది ఉత్సవాలు ఖమ్మం వేదికగా జరగబోతు న్నాయని, ఇదొక చారిత్రక ఘట్టమని చెప్పారు. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న కార్మిక, కర్షక ఫలాలు ఎర్రజెండా పోరాట ఫలితమేనన్నారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, శాసనసభలోనూ ఈ అంశంపై పోరాడుతానని కూనం నేని హామీ ఇచ్చారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సాంబశివరావు సమాధానమిచ్చారు.
సంపదను దోచుకునేవారు దేశభక్తులా?
అటవీ సంపదను, ప్రజల శ్రమను దోచుకునేవారు దేశభక్తులుగా చెలామణి అవుతున్నారని, హక్కుల కోసం పోరాటాలు చేసేవారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటాలు చేసేవారిని అణచివేసేవారు చట్టసభల్లో ఉన్నారని, అంతిమంగా నేర ప్రవృత్తి కలిగినవారు, దోపిడీలు చేసేవారు దేశభక్తులుగా సమాజంలో స్థానం సంపాదించుకుంటున్నారని అన్నారు. కాళోజీ చెప్పినట్టు ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక లాగా.. ఒక్క కమ్యూనిస్టు లక్షల కోట్ల మెదళ్లకు మేథ అన్నారు. కమ్యూనిస్టుల విధానాలు, సిద్ధాంతాలు, త్యాగాలు ఇంకా ప్రజల్లోకి వెళ్లాలన్నారు.
కమ్యూనిస్టుల ఐక్యతే అభిమతం
ఎన్నికల్లో పొత్తులు, ఎత్తులు ఎలా ఉన్నా.. బూర్జువా పార్టీలతో స్నేహం చేయాల్సి వచ్చినా అవి ఎలక్షన్ల వరకు మాత్రమేనని, కమ్యూనిస్టుల ఐక్యతే తమ అభిమతమని కూనంనేని అన్నారు. అనేక దేశాల్లో ఎర్రజెండాలు ఏకమై రాజ్యాధికారాన్ని సొంతం చేసుకున్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. కమ్యూనిస్టుల ఐక్యత ప్రజల కోరిక అన్నారు. అది దేశానికి, సమాజానికి అవసరమని అభిప్రాయప డ్డారు. ప్రస్తుతం మహాత్మాగాంధీ ఎన్నికల్లో పోటీ చేసినా నెగ్గుకు రాలేని స్థితి ఉందన్నారు. ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్నా అప్ర జాస్వామిక పోకడలను ఎప్పటికప్పుడూ ఎత్తిచూపుతూనే ఉన్నామన్నారు. తెలంగాణ వచ్చాక కనీసం నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా పోయిందన్నారు.
జర్నలిస్టులు పంజరంలో చిలుకలు
జర్నలిస్టులు పంజరంలో చిలకలలాంటి వారని కూనంనేని అభివర్ణించారు. వార్తలు రాసే విషయంలో జర్నలిస్టులు అనేక ఒత్తిడులకు లోబడి పనిచేయాల్సి వస్తోందన్నారు. జర్నలిస్టుల్లో అనేక మంది దుర్భర జీవితాలు అనుభవిస్తున్న దృష్డ్యా వారిని ఆదుకోవాల్సిన అవసరం పాలకులపై ఉందన్నారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు హాజరవుతున్న ముఖ్యమంత్రి దృష్టికి ఖమ్మం జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను తీసుకెళ్తానని, శాసనసభలోనూ ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని తెలిపారు. జర్నలిస్డుల అక్రిడిటేషన్లకు సంబంధించిన జీవో నెంబర్ 252 సవరింపు అంశాన్ని ప్రెస్ అకాడమీ చైర్మెన్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు:బాగం హేమంతరావు
సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో భారీ ఏర్పాట్లు చేశామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. బహిరంగ సభతో పాటు ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. సభకు రెండు రాష్ట్రాల కామ్రేడ్స్‌తోపాటు ఇతర దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా హాజరవుతున్నారని చెప్పారు. ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి సౌహార్థ సందేశం ఇస్తారని వెల్లడించారు.
వేడుకల్లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉంది:దండి సురేశ్
శతాబ్ది ఉత్సవాల్లో ఖమ్మం జిల్లా కార్యదర్శిగా తాను పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికబద్దంగా ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతామని సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడబ్య్లూజేఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, సహాయ కార్యదర్శి కూరాకుల గోపీ, టీబీజేఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, మానుకొండ రవికిరణ్, ఖమ్మం నియోజకవర్గం అధ్యక్ష, కార్యదర్శులు తురగ రాజేంద్రమూర్తి, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మాధవ్, నూకల రామచంద్రమూర్తి, స్టేట్, జిల్లా కమిటీ, నియోజకవర్గ కమిటీ నాయకులు నాగేందర్ రెడ్డి, మధుశ్రీ, జానీపాష, భారతి, ఫయాజ్, భూక్యా గణేశ్, అర్షద్, యూసుఫ్, జాకీర్, వడ్డె గణేశ్, వడ్డే పథ్వి, కొత్త యాకేశ్, మహేశ్, సతీష్, రమేశ్, పత్తి శ్రీను, వినయ్, ధనాల రవి, హరీష్, సీవీఆర్ రవి, గోపి, బ్రహ్మం, షకీల్, మురళీరెడ్డి, శివారెడ్డి పాల్గొన్నారు.



