90 శాతం పూర్తయిన వాటినీ నిర్లక్ష్యం చేశారు
ఇప్పుడూ వాటిని అడ్డుకొనేందుకు ఫాంహౌస్ శుక్రాచార్యుడు మారీచ, సుబాహుల్ని పంపుతున్నారు
శత్రువులు లేరు..రాజకీయ ప్రత్యర్థులే..
2023లోనే వాళ్లను బండకేసి కొట్టా
మహబూబ్‌నగర్ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి
రూ.1463.94 కోట్ల పనులకు శంకుస్థాపన
జడ్చర్లలో ఐఐఐటీ క్యాంపస్‌కు భూమి పూజ
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
రాష్ట్రంలో 90 శాతం పూర్తయిన ప్రాజెక్టుల్ని కూడా పూర్తిచేయకుండా వాటన్నింటినీ పడావు పెట్టిన ఘనత మాజీ సీఎం కే చంద్రశేఖరరావుదే అని సీఎం ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. ”రాష్ట్రాన్ని పదేండ్లపాటు పాలించి పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఏడారిగా మార్చారు. భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి కోయిల్‌సాగర్, పాలమూరు -రంగారెడ్డి వంటి ప్రాజెక్టుల పనులు 90 శాతం పూర్తయ్యాయి. వాటిని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారు. మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా గెలిచి, రాజకీయ భిక్ష పెట్టిన ఈ ప్రాంత ప్రజలను విస్మరించారనీ, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్క ప్రాజెక్టునైనా మంజూరు చేశారా?” అని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని జడ్చర్ల దగ్గర శనివారం ఐఐఐటి క్యాంపస్‌కు భూమి పూజ చేసిన అనంతరం మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ కళాశాల ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ఆనాటి కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ విఠల్‌రావు, అప్పటి మంత్రి డికె.అరుణ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో 2013లో మంజూరైందని గుర్తు చేశారు. రూ.25 వేల కోట్ల అంచనాలతో ప్రారంభం అయిన ప్రాజెక్టు పనులకు బీఆర్ఎస్ హయాంలో బిల్లులు ఎత్తారు తప్ప, రైతులకు భూసేకరణ పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మాణం పేరుతో కమీషన్లు తీసుకున్నారు.. కూల్చారు. సంగంబండకు కనీసం రూ.10 కోట్లు ఇచ్చి లక్ష ఎకరాలకు సాగునీరు అందించలేకపోయారని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లాలో చనాకా-కొరాటా పంప్‌హౌస్, సదర్మాట్ బ్యారేజీ ప్రారంభిస్తే, ప్రాజెక్టులు తాము నిర్మిస్తే, వాటిని రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తున్నాడని ఓ మారీచుడు విషం చిమ్ముతున్నాడంటూ ప్రతిపక్షంపై విమర్శనాస్త్రాలు సంధించారు.
మారీచ-సుబాహులు
పూర్వకాలంలో ఋషులు యజ్ఞాలు, యాగాలు చేస్తుంటే, రాక్షస గురువు శుక్రాచార్యుడు తన శిష్యులు మారీచుడు, సుభాహుడని పంపి, వాటికి అడ్డు తగిలేవారనీ, ఇప్పుడు ప్రతిపక్షనేత
శుక్రచార్యుడిగా ఫామ్‌హౌస్‌లో ఉంటూ.. బావబామ్మర్ది ముసుగులో మారీచ, సుభాహులను ప్రాజెక్టులను అడ్డుకోవాలని పంపుతున్నారని ఎద్దేవా చేశారు. మారీచుడు మాయలేడి రూపంలో వస్తే రాముడు బాణానికి బలైనట్టు.. అలాంటి రాక్షసులను కట్టిపడేసే శక్తి పాలమూరు ప్రజలకు, ఈ గడ్డ బిడ్డగా తనకు ఉందన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉంటాయని, ప్రత్యర్థులను ఓడించడానికి ఎంతవరకైనా వెళ్తామని అన్నారు. రాజకీయాల అనంతరం అభివృద్ధి గురించే ఆలోచిస్తామన్నారు. మహబూబ్‌నగర్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు డికె అరుణకు వ్యతిరేకంగా తామంతా ప్రచారం చేసినా, ఎన్నికల్లో ఆమెను ప్రజలు ఆదరించారని గుర్తుచేశారు. డికె అరుణ సహకారంతో ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధికి కావాల్సిన నిధులను, ప్రాజెక్టులను సాధిస్తామని తెలిపారు.
అప్పుడు చెల్లింది…ఇప్పుడు చెల్లదు
‘మాకు వ్యూహాలు, ఎత్తుగడలు తెలుసు. జైపాల్‌రెడ్డి, జానారెడ్డి కాలంలో చెల్లినట్టు ఇప్పుడు చెల్లదు. నాకు వ్యక్తిగతంగా శత్రువులు ఎవరూ లేరు. రాజకీయ ప్రత్యర్థులు ఉంటే వారిని ఎన్నికల్లో ఓడించాం. నాకు శత్రువు అనుకున్న వారిని 2023లోనే బండకేసి కొట్టాను. 2024 పార్లమెంటు ఎన్నికల్లో గుండుసున్నా ఇప్పించా. అన్ని ఎన్నికల్లో గెలిచాం. ఆయన నడుము విరిగి ఫామ్‌హౌస్‌లో పడుకుంటే, నాకు శత్రువు ఎలా అవుతాడు’ అని చెప్పుకొచ్చారు. శాసనసభలో ప్రజాసమస్యలపై చర్చలకు రాని నాయకులు ప్రజలకు అవసరమా అని ప్రశ్నించారు. ఎప్పటిలాగే మున్సిపాల్టీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మంచోళ్లను, మనోళ్లనే గెలిపించాలని, మంత్రులను కలిసి పని చేసేవారిని గెలిపించుకోవాలని కోరారు.
విద్య, వైద్యం లేకే వెనుకబాటు
విద్య, వైద్యం అందించపోవడం వల్లే మహబూబ్‌నగర్ ప్రాంత ప్రజలు వెనుకబాటుకు గురయ్యారని సీఎం అన్నారు. దేశ విదేశాల్లో భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేయడంలో పాలమూరు లేబర్ కీలకంగా పనిచేశారని గుర్తుచేశారు. ఉద్దండాపూర్, అదిలాబాద్ రైతులకు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత భూసేకరణ పరిహారం ఇచ్చామని గుర్తు చేశారు. కేఎల్ఐ చివరి ఆయకట్టుకు నీరందించేందుకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి విజ్ఞప్తి మేరకు నిధులు ఇచ్చి కాల్వలు పూర్తి చేయడానికి సహకరించామన్నారు. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతలకు 7.50 టీఎంసీల సామర్థ్యంతో రూ.1500 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టును నిర్మిస్తామని తెలిపారు. జూరాల డ్యాంకు సమాంతరంగా మరో డ్యాం నిర్మాణం కోసం రూ.123 కోట్లతో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేస్తామన్నారు.
కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిట శ్రీహరి, అజహరుద్దీన్, ఎంపీలు డీకే అరుణ, మల్లురవి, ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, మేఘారెడ్డి, రాంమ్మోహన్‌రెడ్డి, ఈర్లపల్లి శంకర్ ఎపి.జితేందర్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాద్యక్షులు చిన్నారెడ్డి, నాయకులు సంపత్‌కుమార్, వనపర్తి జిల్లా అధ్యక్షులు శివసేనారెడ్డి, గద్వాల మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత, ఓబేదుల్లా కోత్వాల్, డీసీసీ అద్యక్షులు సంజీవ్ ముధిరాజ్, శివకుమార్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాంకృష్ణారావు, జిల్లా కలెక్టర్ విజయేందర్బోయి పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు.



