Sunday, January 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకారు బోల్తా..ఇద్దరు టీచర్లు మృతి

కారు బోల్తా..ఇద్దరు టీచర్లు మృతి

- Advertisement -

మరో ఇద్దరు హెడ్మాస్టర్లకు గాయాలు
టీచర్ల మృతి పట్ల మంత్రి వెంకట్‌రెడ్డి సంతాపం

నవతెలంగాణ-నల్లగొండ టౌన్‌,అర్వపల్లి
సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత ప్రారంభమైన పాఠశాలలకు కారులో బయలుదేరిన ఉపాధ్యాయులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కారు అదుపు తప్పి బోల్తాపడింది. దాంతో ఓ ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఉపాధ్యాయురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలో శనివారం జరిగింది. నల్లగొండ టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంక్రాంతి సెలవుల అనంతరం శనివారం పాఠశాలలు పునర్‌ప్రారంభం కావడంతో నల్లగొండ నుంచి నలుగురు ఉపాధ్యాయులు కారులో తుంగతుర్తికి బయల్దేరారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉండగా, ఒక పురుష ఉపాధ్యాయుడితోపాటు కారు డ్రైవర్‌ ఉన్నారు. కారు అర్వపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో కస్తుర్బాగాంధీ పాఠశాలలో ఏఎస్‌ఓగా పనిచేస్తున్న కల్పన(42) అక్కడికక్కడే మృతిచెందారు. రావులపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల హెడ్మాస్టర్‌ పోరెడ్డి గీతారెడ్డి(48), తుంగతుర్తి జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల హెడ్మాస్టర్‌ అల్వాల ప్రవీణ్‌, అన్నారం జెడ్పీహెచ్‌ఎస్‌ హెడ్మాస్టర్‌ అల్వాల సునీత తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గీతారెడ్డి మృతిచెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఉపాధ్యాయ సంఘాల నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయా పాఠశాలల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై నల్లగొండ టూ టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మంత్రి కోమటిరెడ్డి విచారం..
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం సమీపంలో కారు బోల్తా పడి కస్తూర్బాగాంధీ పాఠశాల ఏఎస్‌ఓ కల్పన, రావులపల్లి జీహెచ్‌ఎం గీత మృతిచెందడం బాధాకరమని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే మంత్రి వైద్య అధికారులు, పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -