– అశ్వారావుపేట అభివృద్ధికి భాగస్వాములం అవుదాం
– ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు కమిషనర్ దిలీప్ రెడ్డి పిలుపు
నవతెలంగాణ – అశ్వరావుపే
అశ్వారావుపేట పట్టణాన్ని పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దుకుంటూ అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములం అవుదాం అనిమున్సిపల్ కమిషనర్ టి.దిలీప్ రెడ్డి సూచించారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అశ్వారావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబుతో కలిసి కమిషనర్ మాట్లాడుతూ, ప్రధాన రహదారుల వెంట ఉన్న దుకాణాల ఎదుట చెత్తను పడవేయడం వల్ల పట్టణంలో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.వ్యాపారులు తమ దుకాణాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు.
“మన ఊరు మన సొంత ఇల్లు లాంటిదే. ఇల్లు ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో, పట్టణాన్నీ అలానే కాపాడుకోవాలి. ఊరు పరిశుభ్రంగా ఉంటే ప్రజల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది” అని కమిషనర్ పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రత, సౌందర్యవృద్ధి, ఆరోగ్యకర వాతావరణం కోసం వ్యాపార వర్గాలు మున్సిపాలిటీకి పూర్తి సహకారం అందించాలని కోరారు. పట్టణ అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపారులు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కంచర్ల భాస్కరరావుతో పాటు వివిధ వ్యాపార సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు పాల్గొన్నారు.



