డాక్టర్ నుంచి సీఎంఓ దాకా ఎదిగిన వ్యక్తి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు సంతాపం
నవతెలంగాణ- పటాన్ చెరు
బీహెచ్‌ఇఎల్‌కు చెందిన రిటైర్డ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) డాక్టర్ కొమ్మినేని లక్ష్మయ్య నాయుడు క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ.. హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో మరణించారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా కేంద్రం సమీపంలోని కంకటపాలెం గ్రామం. ఆయన తండ్రి కొమ్మినేని వెంకటేశ్వరరావు సీపీఐ(ఎం) మద్దతుతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా, కొమ్మినేని లక్ష్మయ్య నాయుడు మృతిపట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కా రాములు సంతాపం తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ కెఎల్ నాయుడు బీహెచ్‌ఇఎల్‌లో డాక్టర్ వృత్తి ప్రారంభించి సీఎంఓ దాకా ఎదిగారని చెప్పారు. నాయుడు ఎంతో పట్టుదలతో ఉద్యోగులకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేసిన వ్యక్తి అని కొనియాడారు. డాక్టర్ వృత్తిని వ్యాపారంగా కాకుండా సేవా దృక్పథంతో చూసిన వ్యక్తి అని చెప్పారు. అంతేకాకుండా విద్యార్థి దశలో డా.కెఎల్ నాయుడు అనేక ఉద్యమాలు చేశారని తెలిపారు. ఆయన మృతి సీపీఐ(ఎం)కు తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.



