Sunday, January 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగ్రామంలో బెల్టు షాపులను నిషేధిస్తూ తీర్మానం

గ్రామంలో బెల్టు షాపులను నిషేధిస్తూ తీర్మానం

- Advertisement -

వికారాబాద్‌ జిల్లా మదన్‌పల్లి గ్రామస్తుల నిర్ణయం
మద్యం విక్రయిస్తే 25 చెప్పు దెబ్బలు.. రూ.5లక్షల జరిమానా

నవతెలంగాణ-వికారాబాద్‌ రూరల్‌
గ్రామీణ సమాజాన్ని మద్యం మత్తు నుంచి విముక్తం చేయాలనే లక్ష్యంతో వికారాబాద్‌ జిల్లా వికారాబాద్‌ మండలం మదనపల్లి గ్రామస్తులు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో కొనసాగుతున్న బెల్టు షాపులను పూర్తిగా బంద్‌ చేయాలని గ్రామస్తులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. శనివారం గ్రామసభ నిర్వహించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మహిళలు ప్రత్యేకంగా ముందుకు వచ్చి మద్యం నిర్మూలనకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. మద్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని, యువత తప్పుదారి పడుతోందని తెలిపారు.

మద్యం కారణంగా ఆర్థికంగా, మానసికంగా నష్టపోతున్న కుటుంబాల సంఖ్య పెరుగుతుండటంతో ఇకపై గ్రామంలో మద్యం విక్రయాలకు పూర్తిగా చెక్‌ పెట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. గ్రామస్తులంతా ఏకమై.. గ్రామంలో మద్యపానాన్ని నిషేధిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. గ్రామ పరిధిలో ఎవరైనా మద్యం విక్రయాలు చేస్తే వారికి 25 చెప్పు దెబ్బలతోపాటు రూ.5 లక్షల జరిమానా విధించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ తీర్మానాన్ని కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ తీర్మానాన్ని గ్రామంలోని బెల్టు షాపుల నిర్వాహకులకు రాతపూర్వకంగా అందజేసినట్టు చెప్పారు. మదనపల్లి గ్రామస్తుల నిర్ణయం చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -