భక్తుల హృదయాల్లో కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ
రెండేండ్లకోసారి కోట్లాది మంది సందర్శకుల రాక
ఈ నెల 28 నుంచి 31వరకు మేడారం మహాజాతర
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా గుర్తింపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమ్మక్క. సారలమ్మలు వీరవనితలై ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవాలయ్యారు. భక్తుల హృదయాల్లో కొలువుదీరారు. రెండేండ్లకోసారి జరిగే మహాజాతరలో కోట్లాది మంది భక్తులకు పోరాట స్ఫూర్తిదాతలై నిలుస్తున్నారు. ములుగు జిల్లా మేడారంలో జరిగే ఈ ఆదివాసీల జాతర ( మేడారం సమ్మక్క సారలమ్మ జాతర) ఆసియాలోనే అతిపెద్దదిగా ప్రసిద్ధిపొందింది. ఈ సంవత్సరం జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరుగనున్నది. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కోటిన్నరకుపైగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటూ వస్తున్నారు.
చారిత్రక నేపథ్యం ఇలా…
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం..12వ శతాబ్దంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాతంలోని పొలవాసను పాలించే ఆదివాసీ దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజు కిచ్చి వివాహం చేశారు. ఈ దంపతులకు సారలమ్మ, జంపన్న ఇద్దరు సంతానం. కాకతీయులకు ప్రతీ సంవత్సరం చెల్లించే కప్పం కట్టలేదన్న కారణంతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పోయి అజ్ఞాత వాసం గడిపాడు. మేడారాన్ని పాలించే పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల కారణంగా కప్పం కట్టలేక పోయాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ ఆదివాసీల సార్వభౌమునికి వ్యతిరేకంగా తిరుగుబాటు భావాజాలాన్ని నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణాలతో పగిడిద్దరాజుపై ప్రతాపరుద్రుడు ఆగ్రహానికి గురయ్యాడు. పగిడిద్దరాజును అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై ప్రతాపరుద్రుడు దండెత్తాడు.
వీరోచిత పోరాటం చేసినా…
సాంప్రదాయ ఆయుధాలు ధరించి పోరాడిన పగిడిద్దరాజు, నమ్మక్క, సారక్క, జంపన్న, గోవిందరాజులు వీరోచితంగా పోరాటం చేసినప్పటికీ సుశిక్షుతులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేకపోయారు. పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణించారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది.
సమ్మక్క పోరాటానికి ఆశ్చర్యకితుడైన ప్రతాపరుద్రుడు..
ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్ప తిప్పలు పెట్టింది. ఆదివాసీ మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. చివరికి సమ్మక్కను కాకతీయుల సైన్యం వెనుక వైపు నుండి బరిసెతో పొడిచేశారు. శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుకల గుట్టవైపు వెళుతూ మార్గమధ్యంలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల కుంకుమ భరణ లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేండ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క – సారలమ్మ జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.
జాతర ఇలా…
ఈ ఏడాది జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర జరుగనున్నది. జాతర మొదటి రోజైన 28న కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దె మీదకు తీసుకొస్తారు. అదే రోజు కొండాయి నుంచి గోవిందరాజులును, పూనుగుండ్ల నుంచి పడిగిద్దరాజులను తీసుకొచ్చి మేడారంలోని గద్దెలపై ప్రతిష్టింపచేస్తారు. 29న సమ్మక్కను చిలుకల గుట్ట నుంచి పూజార్లు తీసుకోని వచ్చి గద్దెపై ప్రతిష్టిస్తారు. మూడో రోజున శుక్రవారం పూర్తి మొక్కుల చెల్లింపులు ఉంటాయి. నాలుగో రోజు సాయంత్రం దేవ దేవతలు తిరిగి వన ప్రవేశం చేస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న ఆదివాసులే పూజార్లు కావడం, ఈ జాతర పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం నిర్వహించడం ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చాలని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు.



