కార్పొరేటర్ అయిన నిందితుడు
ముంబయి : పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య జరిగి సుమారు దశాబ్దం గడిచింది. ఈ కేసులో విచారణ ఇంకా ‘సాగుతూనే’ ఉంది. నిందితుల్లో ఒక రైన శ్రీకాంత్ పంగార్కర్ రాజకీయాల్లో ప్రవేశించి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో జల్నా 13వ వార్డు నుంచి స్వతంత్ర అభ్య ర్థిగా పోటీచేసిన పంగార్కర్ తన సమీప బీజేపీ ప్రత్యర్థి పై 144 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పంగార్కర్ గతంలో శివసేన సభ్యుడిగా ఉన్నారు. ఈ నేపథ్యం లోనే పార్టీ అభ్యర్థిని పోటీ పెట్టకుండా శివసేన ఆయనకు మద్దతు ఇచ్చింది. అయితే శివసేన తనకు మద్దతు ఇవ్వలేదని పంగార్కర్ అనేక ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఆయన రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో తిరిగి చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి.
పంగార్కర్ 2001-2006 మధ్య శివసేన కార్పొరేటర్‌గా పనిచేశారు. 2024లో షిండే నేతృత్వం లోని శివసేనలో చేరేందుకు ప్రయత్నించారు కానీ ఆయనపై ఉన్న తీవ్రమైన అభియోగాల కారణంగా అది జరగలేదు. కాగా గౌరీ లంకేష్ హత్య జరిగి దాదాపు పదేండ్లు గడుస్తున్నా పంగార్కర్, ఇతర నిందితులపై విచారణ నత్తనడక నడుస్తోంది. గౌరీ లంకేష్ హత్యపై కర్నాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. విచారణ ముగించిన సిట్ 2018 లో 650పేజీల ఛార్జిషీటును దాఖలు చేసింది. లంకేష్ హత్య జరిగిన నాలుగేండ్లకు.. అంటే 2021నవంబరు లో నిందితులపై అభియోగాలు మోపారు. కేసు విచారణ నిమిత్తం బెంగళూరులో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసినప్పటికీ విచారణ ఇంకా ఓ కొలిక్కి రాలేదు.
ఈ కేసులో అనుబంధ ఛార్జిషీట్లు కూడా దాఖలయ్యాయి. తొమ్మిది వేల పేజీల ఛార్జిషీటులో ప్రాసిక్యూషన్ అనేక సంస్థలను చేర్చింది. ఆరేండ్ల పాటు జైలులో ఉన్నారన్న కారణంతో కర్నాటక హైకోర్టు 2024 సెప్టెంబరులో పంగార్కర్‌ను బెయిల్‌పై విడుదల చేసింది. కేసులోని పలువురు నిందితులకు కూడా ఆ తర్వాత బెయిల్ లభించింది. ఈ కేసులో నెలకు రెండు మూడు విచారణలు మాత్రమే జరుగుతున్నాయని, దీన్ని బట్టి చూస్తే విచారణ ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.బాలన్ తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం పంగార్కర్ విలేకరులతో మాట్లాడుతూ ‘ప్రజాకోర్టులో నాకు న్యాయం జరిగింది. గౌరీ లంకేష్ హత్య కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది. నేను అమాయకుడిని. నాపై మోపిన ఆరోపణలను ఇప్పటివరకూ నిరూపించలేకపోయారు’ అని చెప్పారు.
‘సాగుతున్న’ గౌరీ లంకేష్ హత్య కేసు విచారణ
- Advertisement -
- Advertisement -



