33 ఏండ్ల నుంచి ఆమోదానికి నోచుకోని ‘ఆ బిల్లు’
న్యూఢిల్లీ : పెద్దల సభ అయిన రాజ్యసభలో ప్రస్తుతం 19 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఓ బిల్లు దాదాపు 33 ఏండ్లుగా పెండింగ్‌లో ఉంది. 1992 నుంచి ఇది ముందుకు కదలకపోవడం గమనార్హం. తాజా నివేదిక ఒకటి ఈ విషయాన్ని వెల్లడించింది. ఎగువసభ బులెటిన్ ప్రకారం.. మూడు దశాబ్దాలకు పైగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లు జనాభా నియంత్రణ, చిన్న కుటుంబాలను ప్రోత్సహించేందుకు సంబంధించినది. ఎన్నికల్లో పోటీచేసే వారికి ఇద్దరు పిల్లల నిబంధనను పొందుపరిచారు. ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలు ఉంటే ఎంపీని లేదా ఎమ్మెల్యేని అనర్హులుగా ప్రకటించాలని ఆ బిల్లులో ప్రతిపాదించారు. అయితే ఈ బిల్లు ఆమోదానికి నోచుకోకపోవడం గమనార్హం.
ఇక 1997 నాటి ఢిల్లీ అద్దెల (సవరణ) బిల్లు కూడా సుదీర్ఘకాలంగా పెండింగులోనే ఉంది. ఈ బిల్లుపై పలు భాగస్వామ్య పక్షాల నుంచి వ్యతిరేకత రావడంతో అప్పటి నుంచీ ముందుకు కదల్లేదు. నాణ్యమైన విత్తనాల అమ్మకం, వీటి ఎగుమతి, దిగుమతులకు సంబంధిన సీడ్స్ బిల్లు 2004 నుంచి పెండింగులోనే ఉంది. అంతర్రాష్ట్ర వలస కార్మికులకు సంబంధించిన ఓ బిల్లు 2011 నుంచి ఆమోదానికి నోచుకోలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు దీనిని ప్రవేశపెట్టారు. వీటితోపాటు భవన నిర్మాణ కార్మికుల బిల్లు, ఉపాధి కల్పన కార్యాలయాల బిల్లు సహా పలు బిల్లులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. లోక్‌సభ రద్దయినప్పుడు పెండింగ్ బిల్లుల గడువు తీరిపోతుంది. వాటిని మళ్లీ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కానీ రాజ్యసభ శాశ్వత సభ కాబట్టి ఎప్పటికీ రద్దు కాదు. బిల్లులు సజీవంగా ఉంటాయి.
రాజ్యసభలో 19 బిల్లులు పెండింగ్
- Advertisement -
- Advertisement -



