మాజీ ఎమ్మెల్యే, ఏఐకేఎస్ జాతీయ నాయకులు జూలకంటి రంగారెడ్డి
జిల్లాల్లో కార్మిక కర్షక ప్రజాచైతన్య జీపుజాతాలు
నవతెలంగాణ- విలేకరులు
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలపై పోరాడాలని మాజీ ఎమ్మెల్యే, ఏఐకేఎస్ జాతీయ కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జీపు జాతాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా శనివారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలో జీపు జాతను జూలకంటి ప్రారంభించారు. ఈసంపల్లి బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి మోడీ ప్రభుత్వం పనిచేస్తున్నదని విమర్శించారు.
మరోవైపు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు, ప్రజాతంత్ర వాదులు ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్లు, వీబీ జీ రామ్ జీ చట్టం, జాతీయ విత్తన, విద్యుత్ సవరణ బిల్లుల రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన జీపుజాత సిద్దిపేట జిల్లాలోని తొగుట, దౌల్తాబాద్, దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లో కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షకులకు చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టెందుకు మహబూబ్నగర్ జిల్లాలో ప్రచార పోరు యాత్రను ప్రారంభించినట్టు రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఏ.రాములు తెలిపారు. సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో కార్మిక కర్షక పోరుయాత్ర జీపుజాతాను శనివారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జాతా భూత్పూర్, మూసాపేట, అడ్డాకుల మీదుగా సాగింది.
లేబర్ కోడ్స్, వీబీ జీ రామ్ జీ చట్టం, జాతీయ విత్తన చట్టం, విద్యుత్తు సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక, కర్షక పోరుయాత్ర యాదాద్రిభువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, ఆలేరు, బీబీనగర్, ఆత్మకూర్ఎం, మోటకొండూరు మండలాల్లో కొనసాగింది. నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో కార్మిక, కర్షక పోరుబాట జీపుజాతాను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య, రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం ప్రారంచారు. నల్లగొండ మున్సిపాలిటీ పరిదిలో ప్రకాశంóబజార్, ఎఫ్సీఐ గోదాంల దగ్గర కార్మిక, కర్షక ప్రచార యాత్ర సభను సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.సలీం ప్రారంభించారు. చిట్యాల, గట్టుప్పల్ మండల కేంద్రాల్లో జీపు జాతాలు ప్రారంభమయ్యాయి.



