నవతెలంగాణ – హైదరాబాద్: గర్భంతో ఉన్నప్పుడు జ్వరం, నొప్పుల కోసం పారాసెటమాల్ వాడటంపై ఉన్న ఆందోళనలకు తెరపడింది. ఈ మందు వాడకం పూర్తిగా సురక్షితమేనని, దీనివల్ల పుట్టబోయే పిల్లలకు ఎలాంటి నాడీ సంబంధిత సమస్యలు రావని ప్రఖ్యాత వైద్య పత్రిక ‘ది లాన్సెట్’ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. గర్భిణులు పారాసెటమాల్ వాడటం వల్ల పిల్లల్లో ఆటిజం, అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) లేదా మేధోపరమైన వైకల్యం వచ్చే ప్రమాదం ఉందని గతంలో వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పింది.
లండన్‌లోని సిటీ సెయింట్ జార్జ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అంశంపై భారీస్థాయిలో అధ్యయనం చేశారు. మొత్తం 43 వేర్వేరు అధ్యయనాలను విశ్లేషించి (మెటా-అనాలిసిస్) ఈ నిర్ధారణకు వచ్చారు. లక్షలాది మంది చిన్నారుల డేటాను, ముఖ్యంగా ఒకే తల్లికి పుట్టిన తోబుట్టువులను పోల్చి చూసినప్పుడు కూడా పారాసెటమాల్ వాడకానికి, నాడీ సంబంధిత రుగ్మతలకు ఎటువంటి సంబంధం లేదని తేలింది. గతంలో వచ్చిన ఆరోపణలకు జన్యుపరమైన లేదా ఇతర అనారోగ్య కారణాలు ఉండవచ్చని, అంతేగానీ పారాసెటమాల్ మందు కారణం కాదని పరిశోధకులు వివరించారు. ఈ అధ్యయనం నేపథ్యంలో యూకేకు చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (MHRA) సైతం స్పందిస్తూ.. గర్భధారణ సమయంలో నొప్పి, జ్వరానికి పారాసెటమాల్ అత్యంత సురక్షితమైన ఎంపిక అని పునరుద్ఘాటించింది. అయితే, వైద్యుల సలహా మేరకు అవసరమైనంత తక్కువ మోతాదులో, తక్కువ కాలం పాటు వాడటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.



