Sunday, January 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయం8 యూరప్ దేశాలపై 10 శాతం సుంకాలు

8 యూరప్ దేశాలపై 10 శాతం సుంకాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికాకు అమ్మే విషయంలో డెన్మార్క్ చర్చలకు నిరాకరిస్తుండటంతో ఎనిమిది యూరోపియన్ దేశాలపై భారీ సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించారు. డెన్మార్క్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, ఫిన్‌లాండ్‌ల నుంచి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై ఫిబ్రవరి 1, 2026 నుంచి 10 శాతం టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రీన్‌లాండ్‌ను పూర్తిగా కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదరకపోతే, జూన్ 1 నుంచి ఈ సుంకాలను 25 శాతానికి పెంచుతామని హెచ్చరించారు.

“గ్రీన్‌లాండ్‌ను పూర్తిగా కొనుగోలు చేసే ఒప్పందం కుదిరే వరకు ఈ సుంకాలు అమల్లో ఉంటాయి” అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. గ్రీన్‌లాండ్‌లో యూరప్ దేశాలు సైనిక విన్యాసాలు నిర్వహించడం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ట్రంప్ ఏకపక్ష నిర్ణయంపై యూరప్ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మిత్రదేశాలపై సుంకాలు విధించడం పూర్తిగా తప్పు అని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ విమర్శించారు. ఈ బెదిరింపులు ఆమోదయోగ్యం కావని, ఐరోపా దేశాలన్నీ ఐక్యంగా దీనికి స్పందిస్తాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హెచ్చరించారు. ట్రంప్ ప్రకటన ఆశ్చర్యానికి గురి చేసిందని డెన్మార్క్ విదేశాంగ మంత్రి అన్నారు. ఈ పరిణామాలతో అమెరికా, యూరప్ మధ్య సంబంధాలు దెబ్బతింటాయని యూరోపియన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా నిర్ణయానికి వ్యతిరేకంగా డెన్మార్క్‌, గ్రీన్‌లాండ్‌లలో నిరసన ప్రదర్శనలు జరిగాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -