నవతెలంగాణ – ఆలేరు రూరల్
గుండ్లగూడెం రైల్వే గేటు నుంచి పెంబర్తి రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జ్ వరకు ఆర్‌అండ్‌బి బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గుండ్లగూడెం రైల్వే గేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసపురం గ్రామ సర్పంచ్ వడ్ల శోభన్ బాబు మాట్లాడుతూ.. గుండ్లగూడెం రైల్వే గేట్ నుంచి పెంబర్తి రైల్వే గేట్ వరకు ఉన్న రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిందని, వారం రోజులకోసారి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షాకాలంలో రోడ్డుపై ప్రయాణం అత్యంత దుర్భరంగా మారుతుందని,గుంతల్లో నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా బైపాస్ రోడ్డు నిర్మాణం జరిగినప్పటి నుంచి ఈ రోడ్డు పాలకుల నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. ఈ రోడ్డు గుండ్లగూడెం, శివలాల్ తండా, పటేల్ గూడెం, శ్రీనివాసపురం గ్రామాలను అనుసంధానిస్తూ ఉండటంతో నాలుగు గ్రామాల ప్రజలు నిత్యం ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
దాదాపు 8,000 మంది ప్రజలు ఆలేరు, జనగామలకు హాస్పిటల్ అవసరాలు, నిత్యావసరాల కోసం ఈ రోడ్డు మీదే ప్రయాణించాల్సి వస్తోందని, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గుండ్లగూడెం రైల్వే గేటు పడితే మూడు రైళ్లు వెళ్లే వరకు సుమారు 20 నిమిషాల పాటు ఆగాల్సి వస్తోందని, దీంతో ఆలేరుకు చేరుకోవడం కష్టమవుతోందన్నారు.కావున రైల్వే గేటు స్థానంలో వెంటనే అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు.
బీటీ రోడ్డు పునర్నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతి గ్రామం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. రేపు నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని గుండ్లగూడెం, శివలాల్ తండా, పటేల్ గూడెం, శ్రీనివాసపురం గ్రామాల ప్రజలు పార్టీలకతీతంగా, అఖిలపక్ష నాయకులు, గ్రామ పెద్దలు, ప్రముఖులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గంగుల శ్రీనివాస్,లంబాడాకుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మూడవత్ అశోక్ నాయక్, మాజీ ఎంపీటీసీ పిక్క శ్రీనివాస్, సర్పంచ్ ఏసీ రెడ్డి మంజుల, మహేందర్ రెడ్డి,మాజీ ఉపసర్పంచ్లు రాజు నాయక్, రవి నాయక్, గిరిజన విద్యార్థి సంఘం మండల అధ్యక్షులు శ్రీరామ్ నాయక్‌తో పాటు బింగి నరేష్, మాడ్పు సంతోష్, లక్కాకుల పెంటయ్య, ఇసాక్, కిరణ్ నాయక్, రామ్జి నాయక్, రవిశంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.



