నవతెలంగాణ-తుంగతుర్తి
ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతును రాజును చేయాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజా ప్రభుత్వ నడుస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలు- మార్కెటింగ్ శాఖ ప్రగతి నివేదిక కార్యక్రమం బుధవారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు మందుల సామెల్ తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత జాతీయ గీతం ఆలపించిన అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన కల్పించడంతోపాటు వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు. అదేవిధంగా రైతులకు గోధుమ వరి మరియు ఇతర పంటల సాగు పద్ధతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పాటించాల్సిన వ్యవసాయ విధానాలపై వివరాలు తెలియజేశారు. అందుబాటులో ఉన్న సబ్సిడీ పథకాలు, రైతు బీమా, పంట రుణాలపై పూర్తి సమాచారాన్ని రైతులకు అందించారు. అనంతరం ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల పక్షపాత ప్రభుత్వ నడుస్తుందని అన్నారు. రూ. లక్ష రుణమాఫీ చేసేందుకు గత ప్రభుత్వానికి పదేళ్లు పట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరి వేసిన రైతులకు మద్దతు ధర కల్పిస్తూ.. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు.
అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి, మద్దిరాల,నూతనకల్, తహసిల్దార్ లు దయానందం, సబిత, నూతనకల్ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ ఏడిఏ రమేష్ బాబు, మార్కెట్ కమిటీ కార్యదర్శి సురేష్ కుమార్,ఏఈఓ లు, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, తుంగతుర్తి గ్రామ సర్పంచ్ మల్లెపాక సాయిబాబా,తుంగతుర్తి మద్దిరాల నూతనకల్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రేగటి రవి, పచ్చిపాల వెంకన్న, నల్లు రామచంద్రారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు, యువజన సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



