Monday, January 19, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్అలుపెరుగ‌ని పోరాట యోధురాలు

అలుపెరుగ‌ని పోరాట యోధురాలు

- Advertisement -

72 ఏండ్ల వయసులోనూ మహిళా సమస్యలపై అలుపెరుగక శ్రమించిన ధిశాలి. నిత్యం స్త్రీసమానత్వం కోసం తపించిన ఉద్యమకారిణి. మహిళలు అడుగు బయటపెట్టకూడదంటూ ఎన్నో ఆంక్షలున్న కాలంలోనే స్త్రీలను చైతన్యం చేసేందుకు అహర్నిశలూ కషిచేశారు. ఎన్ని అవమానాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నారు. తన తుదిశ్వాస వరకు సమసమాజం కోసమే తపించారు. ఉమ్మడి రాష్ట్రంలో మహిళా సంఘాన్ని నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆమే మానికొండ సూర్యవతి. జనవరి 25 నుండి 28 వరకు జరగబోతున్న ఐద్వా అఖిల భారత మహాసభలకు మన తెలుగుగడ్డ వేదిక కాబోతున్న సందర్భంగా యోధ పరిచయం నేటి మానవిలో….

సూర్యావతి గన్నవరం తాలూకా ఇందుపల్లిలో జన్మించారు. తల్లిదండ్రులు బ్రమరాంబ, పున్నయ్య. చదువుకున్నదీ పెరిగినది కాటూరులోని వారి పినతండ్రి, పినతల్లి కడియాల గోపాలరావు, రాజరత్నమ్మ ఇంటి వద్ద. వారు ఆమెను ఎంతో అపురూపంగా పెంచారు. రెండు కుటుంబాల మధ్య అతిగారాబంగా పెరిగారు.

మహిళా సమస్యలపై
1937లో చిన్న వయసులోనే నందమూరు గ్రామస్తులు మానికొండ బుల్లెమ్మ గారి కొడుకు సుబ్బారావు గారితో ఆమె వివాహం జరిగింది. సోషలిస్టు భావాలు కలిగిన కడియాల గోపాలరావు 1937లో యువజన సంఘాలు స్థాపించి, పుస్తకాలు చదివిస్తూ, యువతీ యువకులకు రాజకీయాలు బోధించేవారు. పెండ్లి తర్వాత సూర్యావతి కాటూరులో స్త్రీల మీటింగ్‌ ఏర్పాటు చేసి ఈడ్పుగంటి రత్నమాంబ గారిని తీసుకువచ్చి మహిళల సమస్యలపై మాట్లాడించారు. ఆ సమావేశాలకు హాజరైన ముఖ్యమైన కార్యకర్తలకు స్త్రీల సమస్యలపై పనిచేయాలని నిర్ణయించుకున్నారు. సోషలిస్టు, అభ్యుదయ భావాలకు ఆకర్షితులైన సుబ్బారావుగారు సూర్యావతికి మంచి ప్రోత్సాహాన్ని అందించేవారు.

గ్రామ గ్రామాన తిరిగి
1937, 38లో తూర్పు కృష్ణా జిల్లా మహిళా సంఘంను వల్లభనేని సీతామహాలక్ష్మమ్మ ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాపిత సంఘాన్ని ఏర్పాటు చేయాలని సూర్యావతి భావించి నాగెళ్ల రాజేశ్వరమ్మతో కలిసి విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టారు. గ్రామగ్రామాన తిరిగి మహిళలను పోగేసి సమావేశాలు ఏర్పాటు చేశారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, స్త్రీ విద్య ఆవశ్యకతను వివరిస్తూ స్వాతంత్య్రోదమంలో స్త్రీలు కూడా పాల్గొనాలని ప్రచారం చేసేవారు. అయితే ‘మీకు మొగుళ్ళున్నారా”, ”ఆడవాళ్ళు మీటింగులు పెట్టడం ఏమిటి” ”సంచులు పుచ్చుకుని తిరుగుళ్లేమిటి” అంటూ మహిళలే అనేక మాటలు అనేవారం. అలాంటి వారికి సూర్యవతి ఎంతో ఓపికతో సమాధానం చెప్పేవారు.

మూఢాచారాలకు వ్యతిరేకంగా
ఆనాడు మహిళలు ఇంటి నుండి బయటకు రాకూడదని ఘోషా పద్ధతి ఆచరించేవారు. బాల్య వివాహాలు సర్వసాధారణం. కన్యాశుల్కం ఆశతో పసిపిల్లలను ముసలి వారికి కట్టబెట్టేవారు. యుక్త వయసు రాకుండానే వితంతువులుగా మారిన బాలికలెందరో. స్త్రీ పునర్వివాహం చేసుకోవటం నేరమని, వంటింటికే పరిమితం కావాలని, ఆడవారు చదువుకోకూడదని మొదలగు మూఢాచారాలు, ఛాందసభావాలతో వుండేవారు. ఈ భౌతిక పరిస్థితులలో స్త్రీల అభివద్ధి కోసం కషి చేస్తున్న సందర్భంలో అనేక అవమానాలు ఎదురయ్యేవి. సుబ్బారావు గారిచ్చిన ధైర్యంతో అన్నింటినీ ఎదుర్కొన్నారు.

ఆస్తిహక్కుకై…
1942లో కృష్ణాజిల్లా మహిళా మహాసభ గరికపర్రులో జరిగింది. కామ్రేడ్‌ సూర్యావతి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అదే ఏడాది కమ్యూనిస్టు పార్టీలో సభ్యులుగా చేరారు. మనోవర్తి, ఆస్తి హక్కు, చట్టాలు, సాంఘిక పరిస్థితులు, ఛాందస భావాల గురించి, స్త్రీసమానత్వం గురించి గ్రామాలలో అవగాహనా కల్పించేవారు. స్త్రీలకు ఆస్తి హక్కు కావాలని, ఎక్కువ మంది మహిళలతో సంతకాలు సేకరించి ఆనాటి బి.ఎన్‌.రావు కమిటీకి సమర్పించారు. ఆ సమయంలో కొందరు ”మాకు ఆస్తులే లేవు, ఇక ఆస్తి హక్కు ఎందుకు” అని సంతకాలకు నిరాకరించారు. వారికి నచ్చచెప్పి సమాన పనికి సమాన వేతనం కోసం కూడా సమిష్ఠి పోరాటాలు నడపాలని సూర్యావతి వారికి అర్థం చేయించారు.

గ్రామాభివద్ధిలో…
పేద, మధ్య తరగతి రైతాంగ స్త్రీలు బయటకు వెళ్ళి వ్యవసాయ పనులు చేయటానికి వీలులేని భౌతిక పరిస్థితులు ఆనాడు వుండేవి. దానికి వ్యతిరేకంగా మహిళలలో ప్రచారం చేసి స్త్రీలు కూడా పని చేసుకొన వచ్చునని ఆచరణలో నిరూపించేందుకు స్వయంగా నాట్లు వేసి అనేక ఇబ్బందు ఎదుర్కొన్నారు. ఇలా ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించి ప్రజలతో విస్తృత సంబంధాలు ఏర్పరుచుకున్నారు. సూర్యవతి నిస్వార్థ సేవలను గుర్తించిన నందమూరి ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో మూడుసార్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్త్రీలు కూడా ప్రజా ప్రతినిధులుగా, ఆదర్శవంతంగా, సమర్ధవంతంగా నిర్వహించగలరని నిరూపించారు. సందమూరు సర్పంచ్‌ గా వున్న కాలంలో ఆమె పంచాయతీ ద్వారా ఎన్నో మంచి పనులు చేబట్టి గ్రామస్తుల అభిమానం పొందారు.

కర్తవ్యాన్ని మరువకుండా…
1947లో రాష్ట్ర మహిళా సంఘ కార్యదర్శిగా ఎన్నికై రాష్ట్రమంతటా అనేక జిల్లాలల్లో విస్తృతంగా పర్యటించి సంఘ స్థాపనకు, నిర్మాణానికి విశేషంగా కృషి చేశారు. 1942 నుండి 89 వరకు కృష్ణాజిల్లా కార్యదర్శిగా, 89 నుండి జిల్లా అధ్యక్షురాలిగా సుదీర్ఘ కాలం మహిళా సంఘానికి విశేష సేవలందించారు. సారా ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. 1975లో భర్త సుబ్బారావు మరణంతో కుంగిపోయినా తన కర్తవ్యాన్ని మరువకుండా ఉద్యమంలో తన వంతు పాత్ర నిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలిచారు.

న్యాయ సలహా కేంద్రంలో…
రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘ కమిటీ సభ్యురాలుగాను అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. 1993 మార్చిలో నిర్వహించిన రాష్ట్ర మహిళా సంఘ స్వర్ణోత్సవ మహాసభలకు ఆహ్వానసంఘ కార్యదర్శిగా ఉండి అనారోగ్యంతో బాధపడుతూ కూడా తన వంతు బాధ్యత నిర్వర్తించారు. స్త్రీల పై లైంగిక దాడులు, వరకట్న మరణాలు, వేధింపులు, భార్యా భర్తల తగాదాలు రోజురోజుకు ఎక్కువయ్యాయి. ఆయా సమస్యలపై బాధపడుతున్న మహిళలకు అండగా నిలబడుతూ వారి సమస్యలు పరిష్కరించేందుకు 1990 ఆగస్టు 18న రాష్ట్రంలో మొదటి సారి కష్ణాజిల్లాలో మహిళా న్యాయసలహా సంఘం స్థాపించారు. న్యాయసలహా సంఘం ఏర్పాటుకు సూర్యావతి కషి ఎనలేనిది. ఆమె న్యాయ సలహా సంఘానికి అధ్యక్షురాలుగా చనిపోయే వరకు కొనసాగారు. 71 ఏండ్ల వయస్సలోనూ మహిళలపై జరుగుతున్న నేరాలకు స్పందించి కార్యక్రమాలలో పాల్గొనేవారు. 1993 జూలై 4వ తేదీన హైదరాబాద్‌ లో జరిగిన ఓ సభలో పాల్గొని వచ్చిన కొన్ని గంటలలోనే సూర్యావతి తన తుదిశ్వాస విడిచారు. ఆమె కుమార్తెలైన వాణి, రమలు కూడా అభ్యుదయ భావాలతో పెరిగారు. వాణి ఆమె భర్త చంద్రశేఖర్‌ నేటికీ ప్రజా ఉద్యమాలతో మమేకమై ఉన్నారు.

నిర్బంధంలో…
1958లో ఎం.ఎల్‌.సి.గా ఆరేండ్ల పాటు శాసనమండలిలో ప్రజా సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారం కోసం కషి చేశారు. 1987లో ఉంగుటూరు మండల అధ్యక్షురాలిగా ఎన్నికై జాతీయ స్థాయిలో అగ్రగామి మండలంగా 1810 మరుగుదొడ్లు నిర్మించారు. ప్రజాప్రతినిధిగా పలు పదవులలో వున్నప్పటికీ ఆమె ఎంతో నిరాడంబరంగా, నిస్వార్ధంగా పనిచేశారు. 1964లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు చంటి పిల్లల తల్లిగా వున్న సూర్యావతిని పిల్లల నుండి విడదీసి భర్తతోపాటు జైలులో నిర్బంధించారు. 1948 ప్రాంతంలో పార్టీని, పార్టీ సాహిత్యాన్ని, ప్రజాశక్తి వార పత్రికను, ఆంధ్ర వనిత మాసపత్రికను నిషేధించిన సందర్భంలో ఆ నిషేధానికి వ్యతిరేకంగా మహిళలు ఆందోళనకు పూనుకున్నప్పుడు బాష్పవాయువు ప్రయోగించి, లాఠీఛార్జి చేసి, 70 మంది మహిళలను సూర్యావతితో పాటు నందిగామ జైలులో నిర్బంధించారు. ఈ నిర్బంధ కాండలో సైతం సూర్యావతి తాను నమ్మిన ఆశయం కోసం దృఢ దీక్షతో పనిచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -