ట్రంప్ బెదిరింపులపై ఈయూ దేశాల మండిపాటు
సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరిక
గ్రీన్‌లాండ్‌తో ముడిపడిన సుంకాల విషయంలో అమెరికా, దాని యూరోపియన్ భాగస్వాముల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో పశ్చిమ దేశాల మధ్య ఐక్యత విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ వివాదం చైనా, రష్యా దేశాలకు ఉపకరించవచ్చునని యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధానాల అధిపతి కాజా కల్లాస్ హెచ్చరించారు. గ్రీన్‌లాండ్‌తో ముడిపడి ఉన్న పలు యూరోపియన్ దేశాలపై సుంకాలు విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అగ్రరాజ్యం మిత్రదేశాల మధ్య విభేదాలకు కారణమైంది.
వాషింగ్టన్ : గ్రీన్లాండ్ భద్రత నిజంగా ప్రమాదంలో ఉంటే సమస్యను వాణిజ్య చర్చల ద్వారా కాకుండా నాటోలోనే పరిష్కరించుకోవాలని కల్లాస్ సూచించారు. ట్రంప్ విధించే సుంకాలు అట్లాంటిక్ రెండు వైపులా ప్రభావం చూపుతాయని చెప్పారు. అవి యూరప్, అమెరికా…రెండింటినీ పేదలుగా మారుస్తాయని, ఉమ్మడి శ్రేయస్సును దెబ్బతీస్తాయని తెలిపారు. అంతేకాక ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధానికి ముగింపు పలకాలన్న లక్ష్యం నుంచి దూరమవుతామని అన్నారు. కాగా గ్రీన్‌లాండ్‌పై సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలు ఆమోదయోగ్యం కావని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ అభిప్రాయ పడ్డారు. ‘భయపెట్టడం, బెదిరించడం వంటి చర్యలు మమ్మల్ని ప్రభావితం చేయలేవు. అది ఉక్రెయిన్‌లో కానీ…గ్రీన్లాండ్లో కానీ…ప్రపంచంలో ఎక్కడైనా కానీ మేము అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాం.
సుంకాల బెదిరింపులు ఎంతమాత్రం ఆమోద యోగ్యం కావు. ఈ విషయంలో యూరోపియన్లు ఐక్యంగా, సమన్వయంతో స్పందిస్తారు’ అని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఎనిమిది యూరోపియన్ దేశాలకు చెందిన వస్తువులపై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్తగా సుంకాలు విధిస్తానంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై ఈయూ దేశాలు మండిపడుతున్నాయి. ట్రంప్ ప్రకటన ప్రకారం బ్రిటన్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, నార్వే దేశాలు సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సుంకాలు అట్లాంటిక్ సముద్ర ప్రాంతాల సంబంధాలను దెబ్బతీస్తాయని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లెయాన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి వ్యతిరేకంగా ఐక్యంగా వ్యవహరించాల్సిన సమయంలో ఇలాంటి వాణిజ్య ప్రతీకార చర్యలకు పాల్పడడం సంబంధాలకు మరింత విఘాతం కలిగిస్తుందని యూరోపియన్ అధికారులు తెలిపారు.



