Monday, January 19, 2026
E-PAPER
Homeజాతీయంప్రపంచ శాంతికి చిచ్చు పెట్టేందుకు అమెరికా యత్నాలు

ప్రపంచ శాంతికి చిచ్చు పెట్టేందుకు అమెరికా యత్నాలు

- Advertisement -

వరల్డ్‌ పీస్‌ కోసం భారత్‌ నిలబడాలి : ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి
కర్నూలు :
ప్రపంచ శాంతికి చిచ్చు పెట్టేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా సిపిఎం ఉద్యమ నిర్మాత టి.నరసింహయ్య ఏడో వర్థంతి సందర్భంగా ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కర్నూలులోని బిఎఎస్‌ కల్యాణ మంటపంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి.రాముడు అధ్యక్షతన వెనిజులా పరిణామాలపై ఆదివారం సదస్సు నిర్వహించారు. తెలకపల్లి రవి ముఖ్యవక్తగా హాజరై మాట్లాడారు. ట్రంప్‌ ప్రపంచ టెర్రరిస్ట్‌ అన్నారు. ట్రంప్‌ చర్యలన్నింటి వెనుక ఆర్థిక ప్రయోజనాలు, ఆధిపత్యమే దాగుందని విమర్శించారు. ప్రపంచ ఆధిపత్యం కోసమే వెనిజులా అధ్యక్షులు మధురోను, ఆయన భార్యను కిడ్నాప్‌ చేశారని, వెనిజులాను ఎదుర్కోగలిగే శక్తి అమెరికాకు లేదని, అందుకే దొంగచాటుగా మధురోను ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు. ప్రకృతి వనరులు, సంపద అపారంగా ఉన్న దేశాల నాయకులు అమెరికాకు తలవంచకపోతే ట్రంప్‌ ఇలాంటి చర్యలకు దిగుతున్నారని అన్నారు. గతంలో క్యూబా అధ్యక్షులు చావెజ్‌ను కూడా అరెస్టు చేశారని, ఇతర దేశాల అధ్యక్షులను ఎత్తుకొచ్చే ట్రంప్‌కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు, నైతికత ఉన్నాయా అని ప్రశ్నించారు. బ్రిక్స్‌ దేశాలు ట్రంప్‌కు లొంగేది లేదని చెబుతున్నాయని తెలిపారు. ట్రంప్‌ చెలరేగుతున్నా న్యూయార్క్‌లో వామపక్ష వ్యక్తి మేయర్‌ అయ్యాడన్నారు. ట్రంప్‌ను ఎదుర్కోడానికి భారత్‌ సిద్ధం కావడం లేదని పేర్కొన్నారు. ట్రంప్‌ చర్యల వల్ల భారత్‌ ప్రయోజనాలను కోల్పోతోందన్నారు. వెనిజులా పరిణామాలపై అందరూ మాట్లాడుతున్నా మోడీ మాత్రం మాట్లాడటం లేదని, ఆ విశ్వగురు ట్రంప్‌కు శిష్యుడేనని పేర్కొన్నారు. దేశాల స్వతంత్రత కోసం భారత్‌ నిలబడకపోవడం ప్రపంచ శాంతికి విఘాతమని విమర్శించారు. అమెరికా చర్యలు పెట్రోల్‌, ధరల మీద ప్రభావం చూపుతాయన్నారు. దేశంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి ప్రపంచ శాంతి కోసం భారత్‌ నిలబడుతుందని చాటి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎపిలో చంద్రబాబు, జగన్‌ నోట అమెరికా మాట రాదని, వారికి అంతర్జాతీయ విషయాలు అవసరం లేదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రకృతిని, హక్కులను కాపాడుకోవాలంటే అవగాహన పెంచుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని, చైతన్యంతో కదలాలని తెలిపారు. సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు మాట్లాడుతూ నరసింహయ్య మార్గంలో తాము నడవడం సంతోషకరమన్నారు. నరసింహయ్య అన్ని విషయాలనూ సునిశితంగా పరిశీలించే వారని, పార్టీనే వారి కుటుంబమని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.నిర్మల మాట్లాడుతూ జిల్లాలో పార్టీని నడిపించాలనే ఉన్నత లక్ష్యంతో నరసింహయ్య పని చేశారన్నారు. ఆయన త్యాగాన్ని మరువకూడదని, స్ఫూర్తిగా తీసుకుని వారి లక్ష్యాన్ని ముందుకు తీసుకు పోవాలన్నారు. తొలుత నరసింహయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -