– అర్ధాంతరంగా మరణించిన కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలి : టీఎస్ యూటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రెండు దశాబ్దాలుగా నామమాత్రపు వేతనాలతో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలనీ, అర్థాంతరంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి వద్ద జరిగిన కారు ప్రమాదంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు గీతారెడ్డి తోపాటు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కల్పన మరణం పట్ల వారు తీవ్ర సంతాపం ప్రకటించారు. ”ఇరువురు ఒకే రకమైన విధులు నిర్వహిస్తున్నారు. మరణం ఒకటే అయినా కుటుంబాలకు అందే మరణానంతర ప్రయోజనాల్లో మాత్రం తీవ్రమైన వ్యత్యాసం ఉంది. కేజీబీవీల్లో పని చేసే ఉద్యోగులు ఎంత కాలం పని చేసినా వారికి నెలవారీ ఇచ్చే వేతనం మినహా ఏ రకమైన ప్రయోజనాలు లేవు. ఆ వేతనం కూడా పనికి సమానమైన వేతనం కాదు. అనారోగ్యానికి గురైనా, అర్థాంతరంగా మరణించినా ఎటువంటి పరిహారం చెల్లించడం లేదు. కనీసం మట్టి ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. శనివారం రోడ్డు ప్రమాదంలో మరణించిన కల్పన కుటుంబం కడు పేదరికంలో ఉన్నది. పిల్లలు చదువుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనీ, పిల్లల చదువులకు ఆటంకం లేకుండా చూడాలి….” అని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి సర్వీసులో ఉండగా మరణించిన కేజీబీవీ ఉద్యోగి కుటుంబానికి కనీసం రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలనీ, కుటుంబంలో అర్హులైన ఒకరికి కారుణ్య నియామకం కల్పించాలనీ, ఉద్యోగానికి భద్రత కల్పించాలనీ, సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని చావ రవి, ఎ.వెంకట్ డిమాండ్ చేశారు.
కేజీబీవీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



