ప్రజలను ‘చట్టవిరుద్ధం’గా నిర్బంధించడానికి ‘అధికారాన్ని’ వినియోగిస్తున్నారు : గీతాంజలి ఆంగ్మో
న్యూఢిల్లీ : పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్ దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితిని ప్రతిబింబిస్తుందని ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో అన్నారు. ప్రజలను ‘చట్టవిరుద్ధం’గా నిర్బంధించడానికి ‘అధికారాన్ని’ వినియోగిస్తున్నారని తెలిపారు. ఆదివారం ఆమె జాతీయ మీడియాకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రభుత్వం కోర్టులో పదేపదే కొత్త తేదీలను కోరుతున్నందున ఈ కేసుకు ఎటువంటి అర్హతా లేదని అన్నారు. అధికారుల విధానపరమైన లోపాలను పరిగణనలోకి తీసుకుంటే, వాంగ్‌చుక్ ఇప్పటికే జైలు నుంచి బయటకు రావాలని, ఇది చాలా సులభంగా పరిష్కరించగల కేసు అని అన్నారు. వాంగ్‌చుక్ నిర్బంధంపై బలమైన ప్రతిఘటన రాకపోవడంతో తాను కొంచెం నిరాశ చెందానని ఆంగ్మో చెప్పారు. మేము మౌనంగా ఉండబోమనీ, ఆయన అరెస్టును సమిష్టిగా, గట్టిగా వ్యతిరేకిస్తామని ఆమె పిలుపునిచ్చారు.
ఇది కేవలం ఒక వ్యక్తిగా సోనమ్ వాంగ్‌చుక్ గురించి మాత్రమే కాదని, ఈ దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితి గురించి, ఈ దేశం కోసం పనిచేస్తున్న వ్యక్తులను అక్రమంగా నిర్బంధించడానికి అధికారాన్ని ఉపయోగించడం గురించి అని అన్నారు. సోనమ్‌ని అరెస్ట్ చేసినవారు, ఎవరినైనా ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చని ఆమె చెప్పారు.
లడఖ్‌కు రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్ హోదాను డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసనలపై పోలీసుల కాల్పుల్లో నలుగురు మరణించగా, 90మంది గాయపడ్డారు. పర్యావరణ కార్యకర్త వాంగ్‌చుక్‌ను సెప్టెంబర్ 26న జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) కింద అరెస్ట్ చేసి, రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.వాంగ్‌చుక్ నిర్బంధాన్ని సవాలు చేస్తూ, ఆయనను వెంటనే విడుదల చేయాలని కోరుతూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. నిర్బంధ ఉత్తర్వులు పొందడం, సోనమ్‌ను కలవడం చాలాకష్టమైందని అన్నారు. సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని, పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కూడా ఆయన చేతితో రాసిన నోట్‌ను పొందడం ఒక సవాలుగా మారిందని ఆమె చెప్పారు. ఎన్‌ఎస్‌ఎ ప్రకారం.. అధికారులు నిర్బంధానికి గల కారణాలను నిర్థారించే పత్రాలతో సహా అన్ని పత్రాలను నిర్బంధించిన వారికి ఐదు లేదా గరిష్టంగా 10 రోజుల్లో అందించాలని అన్నారు. కానీ నాలుగు వీడియోలను 28వ రోజు, అక్టోబర్ 23న ఆయనకు ఇచ్చారని, ఇది అతిపెద్ద విధానపరమైన లోపమని, దీని ఆధారంగా నిర్బంధ ఉత్తర్వును రద్దు చేయాలని చెప్పారు. సంబంధిత ఐదు ఎఫ్‌ఐఆర్‌లలో, మూడింటిలో ఆయన పేరును పేర్కొనలేదని ఆమె తెలిపారు. సోనమ్ పేరును పేర్కొన్న రెండింటిలో ఒకటి ఆగస్టు 2025 నాటిదనీ, దీనికి ఎటువంటి నోటీసు ఇవ్వలేదు, విచారణ చేయలేదు అని అన్నారు.
ప్రజాస్వామ్య స్థితిని ప్రతిబింబిస్తున్న వాంగ్‌చుక్ అరెస్ట్
- Advertisement -
- Advertisement -



