బీజేపీతో రాజ్యాంగానికి ప్రమాదం
చరిత్ర పునరావృతం.. 2034 వరకూ ఇందిరమ్మ రాజ్యం
భవిష్యత్ కార్యాచరణతో ప్రణాళికాబద్ధంగా ముందుకు
మీడియా పంచాయితీలోకి ప్రభుత్వాన్ని లాగొద్దు
మంత్రులపై అభియోగాలొస్తే నన్ను వివరణ అడగండి
సింగరేణి కోల్‌మైన్ టెండర్లలో అణాపైసా అవినీతి లేదు
ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు
మున్సిపల్ ఎన్నికల్లో 70శాతంపైగా సీట్లివ్వండి
ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు
పాలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఎన్టీఆర్-వైఎస్సార్ స్ఫూర్తితో తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ రూ.2 కిలో బియ్యానికి కొనసాగింపుగా.. సన్నబియ్యాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చిన వైఎస్సార్ స్ఫూర్తితో పేదలకు 200 యూనిట్లలోపు ఉచిత కరెంట్, నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఈసారి పట్టణ పేదలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. చరిత్ర పునరావృతం అవుతుందని, 2034 వరకూ ఇందిరమ్మ రాజ్యమే ఉంటుందని అన్నారు.
మీడియా గొడవల్లోకి ప్రభుత్వాన్ని లాగొద్దన్నారు. మంత్రులపై అభియోగాలొస్తే తనను వివరణ అడగాలని విజ్ఞప్తి చేశారు. గత ముఖ్యమంత్రిలా ఏకపాత్రాభినయం ఉండదని, మంత్రుల సమన్వయంతో తమ ప్రభుత్వం ఉమ్మడిగా ముందుకు సాగుతోందని అన్నారు. పాలేరు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు ఆదివారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఏదులాపురం మున్సిపాల్టీ పరిధిలోని మద్దులపల్లి మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
బీఆర్‌ఎస్ దిమ్మెలు కూల్చినప్పుడే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి
తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు నందమూరి తారకరామారావు అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. గత ప్రభుత్వంలో రేషన్‌కార్డు రావాలంటే ఉన్న వాళ్లలో ఎవరైనా చనిపోవాల్సి ఉండేదని, కానీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లక్షలాది రేషన్‌కార్డులు జారీ చేశామని తెలిపారు. ప్రతి పేదవానికీ రేషన్‌కార్డు ఇస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ దిమ్మెలు కూల్చినప్పుడే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అని తెలిపారు. వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఫైల్‌పై మొదటి సంతకం చేసిన మహనీయుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని, రూ.1300 కోట్ల రుణమాఫీ, రైతులపై కేసులను ఎత్తివేశారని తెలిపారు.
వారి స్ఫూర్తితో రాష్ట్రంలోని 52 లక్షల మంది పేదల ఇండ్లకు 200 యూనిట్లలోపు ఉచిత కరెంట్ అందిస్తున్నామని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించామన్నారు. గత ప్రభుత్వ పదేండ్లకాలంలో డబుల్‌బెడ్‌రూమ్ ఇల్లు ఒక్కరికైనా వచ్చిందా అని ప్రశ్నించారు. గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇండ్లను మంజూరు చేశామని తెలిపారు. ఎన్టీఆర్-వైఎస్‌ఆర్‌ను ఆదర్శరంగా తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.
రెండేండ్లుగా అవినీతి లేని పాలన
రెండేండ్లుగా అవినీతి లేని పాలన సాగిస్తున్నామని సీఎం చెప్పారు. భూకబ్జాకోరులు, తెలంగాణను దోచుకునేటోళ్లకు రాక్షస కులగురువు శుక్రాచార్యులుగా కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి పన్నాగాలు పన్నుతున్నారని తెలిపారు. మారీచుడు-సుభాహుడిలా ఆనాడు మాయలేడి తరహాలో నేడు సోషల్‌మీడియా రూపంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి బొగ్గు కుంభకోణంపై కొన్ని పత్రికలు వార్తలు రాస్తున్నాయని, ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావే లేదని అన్నారు. అనవసరమైన ప్రచారాన్ని కల్పించి రాక్షసులు బలపడటానికి ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో.. సహకరిస్తున్నారని మీడియాను ఉద్దేశించి అన్నారు.
‘మీడియా యజమానులు కొట్లాడుకుంటే కొట్లాడుకోండి కానీ మంత్రులను బదనాం చేసే’ కార్యక్రమాన్ని తీసుకోవద్దని చెప్పారు. మంత్రులపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా రాసేముందు తన వివరణ అడగాల్సిందిగా కోరారు. మంత్రివర్గంపై, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఏ వార్త వచ్చినా అది తన గౌరవానికి, నాయకత్వ పటిమకు భంగం కలిగిస్తుందన్నారు. మంత్రులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నానని చెప్పారు. రెండేండ్లలో ఏ అవినీతికి అవకాశం ఇవ్వలేదన్నారు. సింగరేణి కోల్‌మైన్ టెండర్లలో అణాపైసా అవినీతికి ఆస్కారం లేదని స్పష్టం చేశారు.
బీజేపీ ప్రమాదాన్ని గుర్తించిన జిల్లా ఖమ్మం
భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలుగా మారొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. కష్టాన్ని నమ్ముకొని, క్రమశిక్షణతో పనిచేసే వారిని పార్టీ గుర్తిస్తుందన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు తెలివైనవారు కాబట్టే బీజేపీకి ఏ ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదని తెలిపారు. అలాగే బీఆర్‌ఎస్‌నూ బొందపెట్టాలని కోరారు. బీజేపీతో రాజ్యాంగానికే ప్రమాదం పొంచి ఉందని అన్నారు. భద్రాచలం దేవాలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తానన్న ఆనాటి ముఖ్యమంత్రి ఒక్కపైసా కూడా ఇవ్వలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూసేకరణ చేపట్టిందన్నారు. త్వరలోనే అయోధ్యలా భద్రాచలాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య విజ్ఞప్తి మేరకు మున్నేరు వాగు నుంచి లిఫ్ట్ పెట్టి నీరిచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు.
నాడు వరి వేస్తే ఉరి.. నేడు సన్నవడ్లకు బోనస్
ఆనాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం వరి వేస్తే ఉరే అంటే.. తాము అధికారంలోకి రాగానే సన్నవడ్లు పండిస్తే రూ.500 బోనస్ ఇస్తున్నామని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఎస్సీ వర్గీకరణ సమస్యను దేశంలోనే పరిష్కరించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. జనగణనలో కులగణన చేయాల్సిన ఆవశ్యకతను మోడీకి అనివార్యం చేసిన ప్రభుత్వం తెలంగాణని తెలిపారు. బీసీ కులగణన చేసి ఆ ప్రకారమే రాజకీయ అవకాశాలు, నిధుల కేటాయింపు చేస్తున్నామన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో 66శాతం సీట్లు ఇచ్చారని, మున్సిపల్ ఎన్నికల్లో 70శాతానికి పైగా సీట్లు ఇవ్వాలని కోరారు.
సామాజిక సమస్యలను పరిష్కరించామని, సంక్షేమ పథకాలను అమలు చేశామని, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించేందుకు ఫ్యూచర్ ఇండియా సిటీని నిర్మించుకుంటున్నామని తెలిపారు. మెట్రోరైల్ విస్తరణ, మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్‌రోడ్, రేడియల్ రోడ్, మచిలీపట్నం పోర్టుకు రోడ్డు, బెంగళూరుకు గ్రీన్‌ఫీల్డ్ హైవే, అమరావతికి రోడ్లు వేసుకుంటున్నామని చెప్పారు. భవిష్యత్ కార్యాచరణతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. 2034కు వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ, 2047కు త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని దేశంలో సగం ఆర్థిక వ్యవస్థను సృష్టించడానికి మంత్రివర్గం ప్రయత్నం చేస్తుందన్నారు. 2023 నుంచి 2034 వరకు పేదల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని, చరిత్ర పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్ ప్రబుద్ధులకు ఒళ్లంతా విషం : మంత్రి పొంగులేటి
బీఆర్‌ఎస్ ప్రబుద్ధులు ఒళ్లంతా విషం పెట్టుకొని ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలుస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రెఫరెండం అన్న అన్ని ఎన్నికల్లోనూ ట్విట్టర్ టిల్లుకు గుణపాఠం చెప్పారన్నారు. సెమీఫైనల్ అని చెప్పుకునే మున్సిపల్ ఎన్నికల్లోనూ చెంపచెల్లుమనిపించేలా తీర్పు ఇవ్వాలని కోరారు. ఈ సభలో ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, నాగర్‌కర్నూల్, ఖమ్మం ఎంపీలు మల్లు రవి, రామసహాయం రఘురాంరెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాందాస్‌నాయక్, జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వరరావు, తెల్లం వెంకట్రావు, మట్టా రాగమయి, కోరం కనకయ్య, ఖమ్మం, కొత్తగూడెం డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ, ఏవీ ప్రసన్నలక్ష్మి, కార్పొరేషన్ల చైర్మెన్లు రాయల వెంకటేశ్వర్లు, మువ్వా విజయ్ బాబు, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు తుంబూరు దయాకర్‌రెడ్డి, రాంరెడ్డి కృష్ణారెడ్డి, చరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీతారామకు 67 టీఎంసీల నీరు కేటాయింపు : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 67 టీఎంసీల నీటిని సీతారామ ప్రాజెక్టుకు కేటాయించినట్టు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ టర్మ్‌లో ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్‌లో భాగంగా నిర్మించే మున్నేరు-పాలేరు గ్రావిటీ కెనాల్ విద్యుత్ వ్యయాన్ని ఏడాదికి రూ.150 కోట్లు తగ్గిస్తుందన్నారు. ఎన్నెస్పీ పరిధి ఖమ్మం జిల్లాలో 1.30 లక్షల ఆయకట్టు స్థిరీకరణ, సూర్యాపేట జిల్లాలో పాలేరు రిజర్వాయర్ పై భాగంలోని 40వేల ఎకరాలు, భక్తరామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, ఎస్సారెస్పీ పరిధిలోని 70వేల ఎకరాలకు అదనపు నీటి సరఫరా లభిస్తుందన్నారు. 4.7 టీఎంసీల మిషన్ భగీరథ పథకం తాగునీటి అవసరాలనూ తీర్చుతుందన్నారు. మున్నేరు-పాలేరు గ్రావిటీ కెనాల్‌ను ఏడాదిలోపు పూర్తి చేస్తామన్నారు. వచ్చే జనవరిలో దీన్ని సీఎం ద్వారా ప్రారంభించుకుంటామని తెలిపారు.
సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ చానల్స్‌కు గత ప్రభుత్వం ఒక్క ఎకరం భూసేకరణ చేయలేదని, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని అన్నారు. సీతారామ ప్రాజెక్టుకు రివైజ్డ్ ఎస్టీమేషన్ కింద రూ.13వేల కోట్ల నుంచి రూ.19వేల కోట్లు ఖర్చు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. గోదావరి నదీ జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆరు లక్షల ఎకరాలకు అందించేందుకు అన్ని విధాలా ముందుకు వెళ్తున్నామన్నారు. గత సంవత్సరం మూడు పంపుహౌస్‌లు ప్రారంభించామని, ఈ ఏడాది నాల్గో పంప్‌హౌస్ పనులు వేగవంతం చేసేందుకు పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఇరిగేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ కోసం తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి…జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.



