మతతత్వ శక్తులపై పోరాటం కొనసాగుతుంది
వెనిజులా, పాలస్తీనా విషయంలో భారత వైఖరి ఆందోళనకరం : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ప్రకటన
సర్‌కు వ్యతిరేకంగా ప్రచారానికి పిలుపు
త్రివేండ్రం : బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కయ్యాయని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ఆరోపించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) అనేది బీజేపీ-ఆరెస్సెస్ ఆయుధమనీ, దానిని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ద్వారా తీసుకురావాలని చూస్తున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. సర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని వివరించింది. దేశంలోని హిందూత్వ మతతత్వ శక్తులను ఎదుర్కొంటామనీ, రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయేతర శక్తులను ఏకం చేసి బరిలో నిలుస్తామని కేంద్ర కమిటీ పేర్కొన్నది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదనీ, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రజా సమస్యలకు చర్చకు రాలేదని గుర్తు చేసింది.
లేబర్‌కోడ్‌లకు వ్యతిరేకంగా వచ్చేనెల 12న కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సాధారణ సమ్మెకు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పూర్తి మద్దతను ప్రకటించింది. ఇక వెనిజులా, పాలస్తీనా విషయంలో భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానం సిగ్గుచేటని విమర్శించింది. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశం ఈనెల 16 నుంచి 18 వరకు త్రివేండ్రంలోని ఈఎంఎస్ అకాడమీలో జరిగింది. ఈ సమావేశంలో దేశ రాజకీయ పరిణామాలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నది.
కేరళలో అతి పేదరిక నిర్మూలనపై అభినందనలు
కేరళలోని అతి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించినందుకు ఎల్‌డీఎఫ్ ప్రభుత్వాన్ని కేంద్ర కమిటీ అభినందించింది. ఇది ప్రగతిశీల రాజకీయాలు, వికేంద్రకృత పాలన, హక్కుల ఆధారిత విధానాలపై ఆధారపడిన కేరళ అభివృద్ధి నమూనా సమర్థతకు నిదర్శనం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు నిధులు నిరాకరిస్తూ చేస్తున్న నిరంతర ఆర్థిక యుద్ధం నడుమ కేరళ ఈ విజయం సాధించింది. పరిమితుల మధ్య కూడా ప్రజా సంక్షేమం లో మెరుగైన ఫలితాలు సాధించాలనే వామపక్ష ప్రభుత్వ రాజకీయ సంకల్పానికి ఇది నిదర్శనం.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాలు కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలపై పార్టీ సన్నాహాలను కేంద్ర కమిటీ సమీక్షించింది. కేరళలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లుతూ తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ పని చేస్తుంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేరళకు చెల్లించాల్సిన నిధులు ఇవ్వకుండా ఫెడరలిజంపై చేస్తున్న దాడిని ఇది బహిర్గతం చేస్తుంది. ఈ దాడిని సమర్థంగా ఎదుర్కోవడంలో భాగంగా పార్లమెంటులో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ వైఫల్యాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తుంది. ముఖ్యంగా కేరళలో ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీకి వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటంలోని కాంగ్రెస్ లోపాలను కూడా ప్రజల ముందు బహిర్గతం చేస్తుంది.
బెంగాల్‌లో సమాజాన్ని పోలరైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్న టీఎంసీ, బీజేపీ రెండింటినీ ఓడించేందుకు పార్టీ పని చేస్తుంది. వాటికి వ్యతిరేకంగా ఉన్న అన్ని శక్తులను ఏకం చేయడానికి మేము ప్రయత్నిస్తాం. తమిళనాడులో పార్టీ డీఎంకే, మిత్రపక్షాలతో కలిసి బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించేందుకు పోటీ చేస్తుంది. అసోంలో తీవ్ర మతతత్వ, విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు అన్ని బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు పార్టీ పని చేస్తుంది. పుదుచ్చేరిలోనూ బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఓడించేందుకు పార్టీ పని చేస్తుంది.
మైనారిటీలపై పెరుగుతున్న దాడులు
భారత్‌లో ముస్లింలు, క్రైస్తవులు అనే రెండు మైనారిటీ వర్గాల ప్రజలపై దాడులు పెరుగుతున్నాయి. హిందూత్వ సంస్థలే వీటికి కారణం. బీజేపీ ప్రభుత్వాల నిర్లక్ష్యం ఉద్దేశపూర్వకం. దాడులను పురిగొల్పేలా ఉన్నది. మహిళలు, దళితులు, ఆదివాసీలపై దాడులను కేంద్ర కమిటీ ఖండించింది. ఈ దాడులు ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇవన్నీ సెక్యులర్ దేశాన్ని నిర్మూలించి హిందూ దేశాన్ని స్థాపన లక్ష్యంగా ఆరెస్సెస్-బీజేపీ చేస్తున్న ప్రయత్నాలేనని పేర్కొన్నది.
జమ్మూకాశ్మీర్‌పై తీర్మానం
జమ్మూకాశ్మీర్‌కు తక్షణమే రాష్ట్ర హౌదా పునరుద్ధరించాలనీ, ప్రజాస్వామ్య హక్కులు తిరిగి ఇవ్వాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ వివరించింది. ఈ మేరకు ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఫిబ్రవరి 12న సాధారణ సమ్మెకు పూర్తి మద్దతు
నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు ఇచ్చిన ఫిబ్రవరి 12 సాధారణ సమ్మె పిలుపునకు పార్టీ కేంద్ర కమిటీ పూర్తి మద్దతు ప్రకటించింది. కార్మిక సంఘాలకు మద్దతుగా సమ్మె రోజున పార్టీ కార్యకర్తలను పెద్ద ఎత్తున సమీకరిస్తుందని వివరించింది.
‘ఉపాధి హామీ’ రద్దుకు వ్యతిరేకంగా ప్రచారం
కేంద్రం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏను నిర్మూలించి, దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడాన్ని పార్టీ కేంద్ర కమిటీ తప్పుబట్టింది. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా పార్టీ ప్రచారాన్ని తీవ్రతరం చేయనున్నది. ఈ మేరకు ఈనెల 30న మహాత్మా గాంధీ వర్థంతి రోజు నుంచి ఫిబ్రవరి 5 వరకు క్యాంపెయిన్‌ను నిర్వహించనున్నది. వారం పాటు ఇది జరగనున్నది.
వెనిజులాపై అమెరికా దాడికి ఖండన
వెనిజులాపై అమెరికా చేసిన దాడిని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ఖండించింది. వెనిజులాపై యూఎస్ దురాక్రమణకు వ్యతిరేకంగా పార్టీ తీవ్రంగా ప్రచారం నిర్వహించనున్నది. అన్ని బీజేపీయేతర పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలను నిర్వహించనున్నది.
పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులకు ఖండన
పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులను కేంద్ర కమిటీ ఖండించింది. బోర్డ్ ఆఫ్ పీస్ ఫర్ గాజా ఏర్పాటును యూఎస్ ప్రకటించింది. అయితే ఈ ప్రతిపాదిత బోర్డు గాజా పునర్నిర్మాణం కోసం కాదనీ, లాభాలను ఆర్జించడం కోసమని కేంద్ర కమిటీ వివరించింది. ముఖ్యంగా, పాలస్తీనా భూభాగాల ఆక్రమణను అంతం చేయడంలో ఈ శాంతి ప్రణాళి అస్పష్టంగా ఉన్నదని పేర్కొన్నది. వెనిజులా, పాలస్తీనా విషయంలో భారత ప్రభుత్వ వైఖరి దేశ గౌరవాన్ని తగ్గించేదిగా ఉన్నదని కేంద్ర కమిటీ పేర్కొన్నది.
కార్మిక చట్టాలపై ఎల్‌డీఎఫ్‌కు ప్రశంస
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను కేరళలో అమలు చేయబోమని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం ప్రకటించడాన్ని కేంద్ర కమిటీ ప్రశంసించింది. ఇది మరోసారి ఎల్‌డీఎఫ్ ప్రభుత్వ కార్మిక అనుకూల వైఖరిని స్పష్టంగా చూపిస్తున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ ప్రజలు చారిత్రక మూడో వరుస విజయాన్ని ఎల్‌డీఎఫ్‌కు అందిస్తారని కేంద్ర కమిటీ విశ్వాసం వ్యక్తం చేసింది.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు
శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా ప్రయోజనాలకు హానికరమైన అనేక బిల్లులను తగిన చర్చ లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. నాలుగు లేబర్ కోడ్‌లను నోటిఫై చేశారు, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ స్థానంలో వీబీ-జీ రాం జీని తీసుకొచ్చారు, విత్తనాల బిల్లు, విద్యుత్ సవరణ బిల్లులు తీసుకురానున్నారు. బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐల)కు, అణు విద్యుత్ రంగంలోకి ప్రయివేటు, విదేశీ సంస్థలకు కేంద్ర క్యాబినెట్ అనుమతి ఇవ్వడం ఘోర పరిణామాలకు దారి తీస్తుంది. పార్లమెంటు పని తీరును బలహీనపరుస్తూ, కార్యనిర్వాహక వ్యవస్థను శాసనసభ పర్యవేక్షణ నుంచి తప్పించడమే బీజేపీ లక్ష్యమని కేంద్ర కమిటీ పేర్కొన్నది. ఇది దేశ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది. నిరంకుశ స్వభావాన్ని బలోపేతం చేస్తుంది.
మతతత్వశక్తులపై పోరాటం
అమెరికా, యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య ఒప్పందాల కోసం భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. బీజేపీ, హిందూత్వ మతతత్వ శక్తులపై పోరాటాన్ని కొనసాగిస్తూనే, పార్టీ స్వంత బలాన్ని పెంపొందించుకునేందు కట్టుబడి ఉన్నట్టు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ స్పష్టం చేసింది.
సర్‌కు వ్యతిరేకంగా ప్రచారం
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) అనేది బీజేపీ-ఆరెస్సెస్ రాజకీయ ప్రాజెక్టు. భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ద్వారా దీనిని అమలు చేస్తోంది. ఓటరు జాబితాలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా, అలాగే నకిలీ ఓటర్లు చేరకుండా పార్టీ అప్రమత్తంగా ఉంటుంది. ఈసీఐ ప్రయత్నానికి వ్యతిరేకంగా తీవ్రంగా ప్రచారం చేస్తుంది.



