Monday, January 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఖమేనీ పాలనకు చరమగీతం పాడాలి

ఖమేనీ పాలనకు చరమగీతం పాడాలి

- Advertisement -

ట్రంప్‌ పిలుపు
నాయకుడంటే తనలా ఉండాలని సుద్దులు
హింసను రెచ్చగొట్టావు : ఇరాన్‌ సుప్రీం నేత

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, ఇరాన్‌ సుప్రీం నేత అయ తొల్లా అలీ ఖమేనీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్‌లో దశాబ్దాల తరబడి కొనసాగుతున్న ఖమేనీ పాలనకు చరమగీతం పాడాలని ట్రంప్‌ పిలుపునిచ్చారు. మరోవైపు తమ దేశంలో హింసను రెచ్చగొట్టి వందలాది మంది మరణానికి ట్రంప్‌ కారకుడయ్యాడని ఖమేనీ ఆరోపించారు. ‘ఇరాన్‌లో నూతన నాయకత్వం కోసం అన్వేషించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఇటీవల ఇరాన్‌లో జరి గిన నిరసనలు హింసాత్మకంగా మారడానికి ట్రంప్‌ కారకుడంటూ ఖమేనీ ఎక్స్‌ ఖాతా నుంచి వరుసగా వస్తున్న పోస్టులపై ఆయన స్పందించారు.

భయాన్ని రేకెత్తించి హింసకు తెగబడ్డారు : ట్రంప్‌
ఖమేనీ పోస్టులపై ట్రంప్‌ స్పందిస్తూ ఇరాన్‌ నాయకత్వం భయాన్ని రేకెత్తించి, పెద్ద ఎత్తున హింసకు తెగబడి దేశాన్ని పాలిస్తోందని ఆరోపించారు. ‘ఆయన చేసిన నేరమేమిటంటే దేశానికి నేతగా ఉంటూ విధ్వంసానికి పాల్పడ్డారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా హింసకు తెగబడ్డారు. నేను అమెరికాలో చేస్తున్న విధంగా దేశాన్ని సక్రమంగా నడపాలి. అంతేకానీ అధికారంలో కొనసాగేందుకు వేలాది మంది ప్రాణాలు తీయకూడదు’ అని అన్నారు. నాయకత్వమంటే గౌరవంగా ఉండాలే తప్ప భయపెట్టో, ప్రజల ప్రాణాలు తీసో పాలన సాగించకూడదని హితవు పలికారు. పేలవమైన ఖమేనీ నాయకత్వం కారణంగా ప్రపంచంలో నివసించడానికి వీలులేని అత్యంత దారుణమైన దేశంగా ఇరాన్‌ మారిపోయిందని ట్రంప్‌ అన్నారు.

ఆ రెండు దేశాలే కారణం : ఖమేనీ
తమ దేశంలో రక్తపాతానికి, అస్థిరతకు ట్రంప్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఖమేనీ ఆ పోస్టులలో తెలిపారు. ఇరాన్‌లో సంభవించిన మరణాలకు, నష్టాలకు, దేశం మీద మోపిన అపవాదులకు కారకుడు ట్రంపేనని చెప్పారు. హింసకు పాల్పడిన ముఠాలను ఇరాన్‌ ప్రజల ప్రతినిధులుగా చిత్రీకరించారని మండిపడ్డారు. ఇంతకంటే అపవాదు మరోటి ఉండదని అన్నారు. ఇరాన్‌లో నెలకొన్న గందరగోళానికి అమెరికా, ఇజ్రాయిల్‌ వ్యూహరచన చేశాయని ఖమేనీ ఆరోపించారు. ఈ రెండు దేశాలకూ చెందిన ముఠాలు పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడ్డాయని, ప్రాణనష్టానికి కారణమయ్యాయని విమర్శించారు. ‘వారు ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టారు. ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టించారు. అవి నేరపూరిత చర్యలే’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -