సోషల్ మీడియాపై ప్రముఖ పాత్రికేయుడు ఎన్.రామ్
చెన్నై : జర్నలిజం విలువలను నిలబెట్టడంలో, తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టడంలో శాస్త్రీయ, పరిశోధనాత్మక, డేటా ఆధారిత వైఖరి కీలకపాత్ర పోషిస్తుందని ప్రముఖ పాత్రికేయుడు, ‘ది హిందూ’ గ్రూప్ పబ్లిషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఎన్.రామ్ చెప్పారు. శనివారం చెన్నైలో జరిగిన ‘ది హిందూ లిట్ ఫర్ లైఫ్ 2026’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వాస్తవాలను పరిశీలించడానికి, విశ్లేషించడానికి, సహేతుకమైన నిర్ణయానికి రావడానికి శాస్త్రీయ పద్ధతిని అవలంబించాలని సూచించారు. వేర్వేరు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యాలు కలిగిన ప్రజలు ఈ సమాజంలో నివసిస్తున్నప్పటికీ సత్యానికి విలువ ఉంటుందన్నారు. వాస్తవాలను ధృవీకరించుకోవచ్చు… సవాలు చేయవచ్చు… పరిశోధించవచ్చు అని తెలిపారు. సోషల్ మీడియా నేడు అబద్ధాలను, ద్వేషాన్ని వ్యాపింపజేస్తూ సమాజాన్ని విషపూరితం చేస్తోందని రామ్ ఆవేదన వ్యక్తంచేశారు.
కేవలం సామాజిక మాధ్యమాలే కాకుండా ప్రధాన స్రవంతి మీడియా కూడా ఇదే ధోరణితో ఉన్నదని చెప్పారు. పక్షపాత ధోరణులపై పోరాడే విషయాన్ని ప్రస్తావిస్తూ దేశంలో మీడియా యాజమాన్యంలో ఇప్పటికీ వైవిధ్యం కన్పిస్తోందని, పక్షపాతాన్ని సవాలు చేయడానికి డిజిటల్ వేదికలు అవకాశాన్ని కల్పిస్తున్నాయని తెలిపారు. రిపో ర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ ప్రచురించిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ నివేదికలో మన దేశం పేలవమైన ర్యాంకులో ఉండడాన్ని ఆయన ప్రస్తావించారు. ‘మోడీ ప్రభుత్వం పూర్తి అసహనంతో ఉంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ అలాగే ఉన్నాయి. అయినా ప్రతిఘటన ఉంది. మొత్తంగా చూస్తే దక్షిణాదిన పరిస్థితి మెరుగ్గా ఉంది. అక్కడ విమర్శలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గొంతెత్తే గళాలను అణచివేసే ప్రయత్నాలు తక్కువగానే జరుగుతున్నాయి’ అని రామ్ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని చాటిచెప్పడంలోనూ, మానవ హక్కులు, ప్రాథమిక హక్కులను పరి రక్షించడంలోనూ జర్నలిజం తన పాత్రను సమర్ధవంతంగా పోషించాలని రామ్ ఉద్బోధించారు.



