ఆలయాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాం
నేడు సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం ప్రారంభించి భక్తులకు అంకితం చేస్తాం
వీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సత్యం మేడారం
జంపన్నవాగులో శాశ్వత నీటి పరిష్కారానికి రామప్ప చెరువు నుంచి లక్నవరం చెరువు గుండా నీళ్లందిస్తాం : మేడారం సభలో సీఎం రేవంత్ రెడ్డి
అంతకుముందు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు
పలు అభివృద్ధి పనులు పరిశీలన
రాత్రి అక్కడే బస.. మరుసటి రోజు ప్రత్యేక పూజలు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మేడారం అభివృద్ధి దైవాపేక్ష అని, మంత్రులు, ఆడబిడ్డలు సీతక్క, కొండా సురేఖ.. మేడారంలో అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాటి ప్రజాకంఠక పాలనను గద్దె దించాలని 2023 ఫిబ్రవరి 6న మేడారం నుంచి ‘హాత్ సే హాత్’ భారత్ జోడో యాత్ర చేపట్టామని గుర్తుచేశారు. ఆ సందర్భంగా తాను ఇచ్చిన మాట ప్రకారం మేడారంలో సమ్మక్క సారలమ్మల ఆలయాన్ని మూడేండ్లలో నిర్మించామని చెప్పారు. చరిత్రలో హైదరాబాద్ బయట మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్న దాఖలాలు లేవన్నారు. ఆదివారం ములుగు జిల్లా మేడారంలోని హరిత హౌటల్‌లో నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో సీఎం, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
అనంతరం మేడారం గద్దెల సమీపంలో నూతనంగా నిర్మించిన క్యూలైన్ షెడ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. వీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సత్యం మేడారం అని, ఉత్తరాదిలో కుంభమేళా ఉంటే, దక్షిణాదిలో సమ్మక్క కుంభమేళా ఉందని తెలిపారు. గుడి లేని తల్లులను గుండె నిండా కొలుచుకునే తెలంగాణ అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరని అన్నారు. ఈ తల్లుల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. మేడారంలోని జంపన్న వాగులో శాశ్వతంగా నీళ్లుండేలా రామప్ప చెరువు నుంచి లక్నవరం చెరువు గుండా నీళ్లందిస్తామని తెలిపారు. నేడు గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభించి భక్తులకు అంకితమిస్తామని తెలిపారు.
మేడారాన్ని అభివృద్ధి చేయడం నా అదృష్టం
మేడారాన్ని అభివృద్ధి చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తిరుపతి, కుంభమేళా తరహాలో మేడారానికి భక్తులు వస్తూనే ఉంటారని, ఆ దిశగా వారికి అన్ని వసతులు కల్పిస్తామని, అభివృద్ధి చేస్తామని తెలిపారు. మేడారం అభివృద్ధికి తమ మంత్రివర్గం అంతా సహకరించిందన్నారు. వంద రోజుల్లో రాతి కట్టడాలతో తల్లుల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి పొంగులేటిని ఆదేశించగా ఆయన శక్తి వంచనలేకుండా పనులను పూర్తి చేశారని చెప్పారు. జాతర నాటికి మేడారం అభివృద్ధి పనులు పూర్తి చేశామని స్పష్టం చేశారు.
సీఎంకు ఘనస్వాగతం పలికిన :మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా యంత్రాంగం
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన ‘మేడారం సమ్మక్క-సారలమ్మ’ జాతర జనవరి 28 నుంచి 31 వరకు కొనసాగనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం సాయంత్రం 6.20 గంటలకు హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకున్నారు. సమ్మక్క-సారలమ్మ ఆలయ పునరుద్ధరణ (ప్రారంభోత్సవం) సందర్భంగా మేడారం చేరుకున్న సీఎం, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, తదితరులకు మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దనసరి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, దొంతి మాధవ రెడ్డి, డాక్టర్ మురళి నాయక్, యశస్విని రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, స్టేట్ ఫైనాన్స్, ఆయిల్ ఫెడ్ కమిషన్ చైర్మెన్ సిరిసిల్ల రాజయ్య, జంగా రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా, తదితరులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం జాతర కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.300 కోట్ల నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను సీఎం పరిశీలించారు. ముఖ్యంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తున్న రోడ్లు, తాగునీటి సౌకర్యాలపై ఆరా తీశారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే జంపన్న వాగు వద్ద భద్రత, పారిశుధ్య ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం జాతరలో నిఘా కోసం ఏర్పాటు చేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. భద్రతా పరమైన అంశాలపై పోలీసులకు దిశానిర్దేశం చేశారు.
రాత్రి బస.. మరుసటి రోజు ప్రత్యేక పూజలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం రాత్రి మేడారంలోని హరిత హౌటల్‌లోనే బస చేస్తారు. స్థానిక గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించనున్నారు. నేడు(సోమవారం) తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవార్ల ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన గద్దెలను సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. దర్శనం అనంతరం నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి స్విట్జర్లాండ్ (దావోస్) పర్యటనకు బయలుదేరుతారని సమాచారం.



