వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
నవతెలంగాణ-తాండూరు
ఇంటి స్థలం విషయంలో సొంత తమ్ముడినే అన్న హత్య చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరులోని మాణిక్‌నగర్‌లో ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్ మున్సిపల్ పరిధిలోని మాణిక్‌నగర్ ప్రాంతానికి చెందిన మోసిన్, రెహమాన్ ఇద్దరు అన్నదమ్ములు. తమ్ముడు రెహమాన్(24) ఉపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటూ పని చేసుకుంటున్నాడు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ఇంటి స్థలం విషయమై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆస్తి విషయం తేల్చుకుందామని నమ్మబలికిన అన్న మోసిన్, తమ్ముడు రెహమాన్‌ను హైదరాబాద్ నుంచి తాండూరుకు పిలిపించాడు.
ఆదివారం ఉదయం ఇద్దరి మధ్య స్థలం విషయంపై చర్చ జరుగుతుండగా మళ్ళీ ఘర్షణ మొదలైంది. వివాదం ముదరడంతో ఆగ్రహానికి లోనైన మోసిన్ తమ్ముడు రెహమాన్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో రెహమాన్ అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాండూరు డీఎస్పీ యాదయ్య, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని తాండూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



