
– పేద ప్రజల తరఫున పోరాడే వారికి ఓటు వేయండి
– బోడేపుడి వారసుడు భూక్యా వీరభద్రంను గెలిపించండి
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-వైరాటౌన్: నాటి నుంచి నేటి వరకు పోడు సాగుదారులు, రైతులకు అండగా ఎర్రజెండా ఉన్నదని, అవకాశవాద రాజకీయాలు చేస్తూ పార్టీలు మారే అభ్యర్థులను ఓడించి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల పక్షాన పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థి భూక్యా వీరభద్రంను గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కోరారు. బుధవారం మండల పరిధిలోని జింకలగూడెం, రెబ్బవరం, ఖానాపురం, గొల్లపూడి, పాలడుగు, వల్లాపురం, అష్టగుర్తి, గొల్లెనపాడు గ్రామాల్లో వైరా అసెంబ్లీ సీపీఐ(ఎం) అభ్యర్థి భూక్యా వీరభద్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉంటే పేద ప్రజలు, రైతులు, బుడుగు బలహీన వర్గాల పక్షాన మాట్లాడతారని, ప్రభుత్వం చేసే అవినీతి, అక్రమాలను బయటపెట్టి ప్రశ్నిస్తారని భయపడి కమ్యూనిస్టులను గెలవకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలప్పుడు డబ్బు సంచులతో వచ్చి ఓట్లు అడిగే వారి గురించి విజ్ఞతతో ఆలోచించాలని, ఎవరికి ఓటు వేస్తే భద్రంగా ఉంటుందో, ఓటు విలువ, గౌరవం పెరుగుతుందో వారికి ఓటు వేయాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని, అవినీతి, దోపిడీ చేసి సంపాదించిన డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కొని, ఎమ్మెల్యే పదవిని అమ్ముకునే వారికి ఓట్లు వేయొద్దని, బోడేపుడి వారసుడు భూక్యా వీరభద్రంను ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడుతూ గతంలో వైరాలో గెలిచిన ఎమ్మెల్యేలు ఏ పార్టీ తరఫున గెలిచారో, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఆలోచించి ఓట్లు వేయాలని, ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా గెలిపించిన ప్రజలను మోసం చేసి కారు ఎక్కి ప్రగతి భవనం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వైరా మండలంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఒక్క కొత్త రేషన్ కార్డు, ఒక్క ఆసరా పించన్లు ఇవ్వలేదని విమర్శించారు. నాటి నుంచి నేటి వరకు పోడు సాగుదారులు, రైతులకు అండగా ఎర్రజెండా ఉన్నదని, భూక్యా వీరభద్రానికి పోరాట చరిత్ర ఉన్నదని, పోడు రైతుల హక్కుల కోసం చర్లపల్లి జైలులో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాడని తెలిపారు. కమ్యూనిస్టు, అభిమానులు, లౌకిక, ప్రజాస్వామ్య వాదులు ప్రజలు ఆలోచించాలి స్థిరమైన అభివృద్ధి సాధించడానికి, నీతివంతమైన పరిపాలన అందించటానికి, పాలకవర్గం చేసే తప్పులను ప్రశ్నించడానికి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. అభ్యర్ధి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్న తనను గెలిపిస్తే ప్రజల సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో ప్రజా గొంతుక అవుతానని, ప్రజా సంక్షేమం కోసం సామాజిక న్యాయం కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ, పారుపల్లి ఝాన్సీ, మండల నాయకులు బాజోజు రమణ, తూము సుధాకర్, కిలారు శ్రీనివాసరావు, బాణాల శ్రీనివాసరావు, గుడిమెట్ల మోహనరావు, వనమా చిన్న సత్యనారాయణ, జెర్రిపోతుల పుష్పరాజ్యం, షేక్ షైనాబి, తాళ్లూరు నాగేశ్వరరావు, సామినేని బాబు, తూము సుధాకర్, పరుచూరి గోపి, దొంతెబోయిన గంటమ్మ, షేక్ బిలాల్, షేక్ మజీద్, మజీద్ బి, ఫాతిమా, రెహనా తదితరులు పాల్గొన్నారు.