నవతెలంగాణ – ఉప్పునుంతల
మొక్కజొన్న కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని దేవదారికుంట తండా వద్ద అచ్చంపేట వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద రైతులు సంచులతో గురువారం రాస్తారోకో నిర్వహించారు. తుకాలు వేయడం లేదని, వేసిన ధాన్యాన్ని లోడింగ్ చేయడం లేదని రైతులు మండిపడ్డారు.
20 రోజులుగా కొనుగోలు కేంద్రం వద్దే పడిగాపులు కాస్తున్నామని, అధికారులు తమ బాధలను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పునుంతల మండలంలో ప్రత్యేక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో పాటు ఏర్పాటు చేసిన కేంద్రంలో కూడా సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ప్రతిరోజూ వర్షం భయంతో గుండెల్లో గుబులు గుబులు మంటూ రోజులు గడుపుతున్నామని రైతులు వాపోయారు.
హమాలీలు అందుబాటులో లేక రైతులే ఇతర గ్రామాల నుంచి కూలీలను తీసుకొచ్చి స్వంత డబ్బులతో తుకాలు వేయిస్తున్నామని తెలిపారు. తుకాలు వేసినా లోడింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆరోపించారు. కొందరు డబ్బులు ఇస్తేనే పనులు జరుగుతున్నాయని కూడా రైతులు ఆరోపించారు. ఈ సందర్భంగా దేవదారికుంట తండాకు చెందిన రైతు మోహన్‌లాల్ మాట్లాడుతూ, “పోయిన నెల 20వ తేదీన మొక్కజొన్న తీసుకొచ్చాను. 10 రోజుల తర్వాత తుకాలు వేశారు. ఇప్పటివరకు లోడింగ్ చేయలేదు. 20 రోజులుగా ఇక్కడే ఉంటున్నాం. లోడింగ్ అయ్యేవరకు ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియడం లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉప్పునుంతల గ్రామానికి చెందిన రైతు మాన్య ఆంజనేయులు మాట్లాడుతూ, “రైతులు పడుతున్న ఇబ్బందులను అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించి వెంటనే ధాన్యాన్ని తరలించే చర్యలు చేపట్టాలి. వర్షానికి ధాన్యం తడిసి రైతుకు నష్టం కలగకుండా చూడాలి. నిర్లక్ష్యంతో రైతు ఉసురు పోసుకోవద్దు” అని కోరారు.

మొక్కజొన్న రైతుల సమస్యలు పరిష్కరించాలి : చింతల నాగరాజు
ఉప్పునుంతల మండలంలోని మొక్కజొన్న రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చింతల నాగరాజు అన్నారు. రైతులతో కలిసి డిప్యూటీ తాహసిల్దార్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. తుకాలు, లోడింగ్‌లో తీవ్ర జాప్యం కారణంగా రైతులు రోజుల తరబడి కేంద్రాల వద్దే నిరీక్షిస్తున్నారని తెలిపారు. వర్షాల వల్ల ధాన్యం తడిసి రైతులకు నష్టం కలిగే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అదనపు లారీలు, హమాలీలను ఏర్పాటు చేసి కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.



