నవతెలంగాణ – ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి
సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం మేడారంలోని హరిత హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడారు. మేడారం సమ్మక్క సారలమ్మల గద్దెల ప్రాంగణ ప్రారంభంతో ఒక ఘట్టం ముగిసిందన్నారు. ఈ బుధవారం మండే మెలిగే పండుగ ఉంది. మండే మెలిగే పండుగ నుంచి నిండు పండగ వరకు ఇదే రకంగా విజయవంతం చేయాలన్నారు.
తల్లుల కీర్తిని ప్రపంచానికి చాటేలా కవరేజ్ చేసిన మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. మేడారంలో క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసిన అధికారులందరికీ అభినందనలు తెలిపారు. హైదరాబాదులో జరిగే క్యాబినెట్ సమావేశాన్ని అడవిలోకి తీసుకొచ్చి ఏర్పాట్లు చేశామని, క్యాబినెట్ సమావేశమే కాదు రాత్రి సీఎం కుటుంబం, మంత్రుల కుటుంబాలు ఇక్కడ బసచేశాయని వెల్లడించారు. రెండు రోజులపాటు ఇక్కడ యావత్ క్యాబినెట్ ఉండడం, క్యాబినెట్ సమావేశాన్ని ఇక్కడే ఏర్పాటు చేసి పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను ప్రకటించడం ములుగుకు గర్వకారణం అన్నారు.
క్యాబినెట్ సమావేశాన్ని సక్సెస్ చేసిన అధికార యంత్రంగా అందరికీ అభినందనలు తెలిపారు. అటెండర్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు, హోంగార్డుల నుండి డీజెపి వరకు.. కష్టపడి పనిచేసి క్యాబినెట్ సమావేశాన్ని, సీఎం పర్యటనను విజయవంతం చేసిన అందరికీ పేరుపేరునా మరో మారు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. నిన్న క్యాబినెట్ సమావేశం, నేడు గద్దెల ప్రాంగణ ప్రారంభోత్సవం, సీఎం మంత్రుల దర్శనాల సందర్భంగా ఎక్కడ ఎలాంటి చిన్న లోపల లేకుండా విజయవంతం చేసిన జిల్లా అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చి సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. సమ్మక్క సారలమ్మ కీర్తి స్ఫూర్తిని నింపుకొని మహిళలు ఎన్నో విజయాలు సాధించేందుకు.. సీఎంతో పాటుగా పెద్ద ఎత్తున మహిళలకు దర్శనాలు చేయించామని, సమిష్టిగా జాతర ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేద్దామని మరోసారి పిలుపునిచ్చారు.



