Monday, January 19, 2026
E-PAPER
Homeఖమ్మంసోలార్ మోడల్ విలేజ్ దేశంలోనే విప్లవాత్మక కార్యక్రమం

సోలార్ మోడల్ విలేజ్ దేశంలోనే విప్లవాత్మక కార్యక్రమం

- Advertisement -

ప్రతి ఇల్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కావాలి
రాష్ట్రంలో 81 గ్రామాల్లో రూ.1,380 కోట్ల వ్యయంతో.. ప్రజలకు ఉచితంగా సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు
ప్రతి ఇంటికి సంవత్సరానికి రూ. 14వేలు ఆదాయం 
రావినూతల గ్రామంలో సోలార్ మోడల్ విలేజ్ ప్రారంభం 
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ – బోనకల్

ప్రతి ఇల్లు, వ్యవసాయ పంపు సెట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సోలార్ మోడల్ విలేజ్ కార్యక్రమం దేశంలోనే కాదు ప్రపంచంలో ఓ విప్లవాత్మక కార్యక్రమమని  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మండల పరిధిలోనే రావినూతల గ్రామంలో డిప్యూటీ సీఎం సోలార్ మోడల్ విలేజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్తును గృహ వినియోగదారులు, వ్యవసాయదారులు వాడుకున్నంత వాడుకొని మిగిలిన విద్యుత్తును రాష్ట్ర విద్యుత్ శాఖకు అమ్ముకునేలా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చులు భరిస్తూ ఏర్పాటుచేసిన సోలార్ మోడల్ విలేజ్ కార్యక్రమం ప్రత్యేకమైనది అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 81 గ్రామాల్లో ఈ పైలెట్ ప్రాజెక్టు చేపట్టామని కొడంగల్, బోనకల్ మండలాల్లో పూర్తిగా చేపట్టామని తెలిపారు.

రాష్ట్రంలో మిగిలిన కొన్ని గ్రామాల్లో ఈ పైలెట్ ప్రాజెక్టు చేపట్టినట్టు తెలిపారు. ఇళ్లపై కప్పుల పైన మాత్రమే కాకుండా వ్యవసాయ పంపుసెట్ల పైన సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 81 గ్రామాల్లో 1,380 కోట్లు సోలార్ విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తుందని తెలిపారు. బోనకల్లు మండలంలో 22 గ్రామాలకు గాను రూ. 306 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన రావినూతల గ్రామంలో రూ.24 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. సంవత్సరం మొత్తం మీద సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక కుటుంబ 14 వేల వరకు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.

ఉత్పత్తి అయిన సోలార్ విద్యుత్తును ఇంటి అవసరాల కోసం వాడుకునేది వాడుకోగా సంవత్సరం మొత్తంగా కనీసం గా 1086 సోలార్ విద్యుత్ యూనిట్ లను యూనిట్ కు 2.57 రూపాయల చొప్పున విద్యుత్ సంస్థలకు విక్రయిస్తే సంవత్సరంలో ఒక కుటుంబానికి కనీసంగా నాలుగు నుంచి ఐదు వేలు మిగులుతుందని వివరించారు. సీఎం అనుముల రేవంత్ రెడ్డి తో పాటు యావత్ క్యాబినెట్ ఆలోచించి అమలులోకి తెచ్చిన పథకం ఇది అని తెలిపారు. మహిళలు ఇళ్లల్లో ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్ ను పొదుపుగా వాడుకొని ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు విక్రయిస్తే పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది అన్నారు. కరెంటు బిల్లు కట్టాల్సిన పని ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో ద్వారా మిగిలే డబ్బును పిల్లల చదువులు, కుటుంబ వైద్య అవసరాల కోసం వినియోగించుకొని కుటుంబాలు ఆర్థికంగా బలపడేందుకు మహిళలు కృషి చేయాలని సూచించారు. ఇప్పటివరకు మనం విద్యుత్ సంస్థలకు డబ్బులు చెల్లించాం కానీ ఇకనుంచి విద్యుత్ సంస్థలే ప్రజలకు డబ్బులు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ ప్రణాళికలు రూపొందించిందని డిప్యూటీ సీఎం వివరించారు.

రైతులు వ్యవసాయ పంప్ సెట్ ల పైన సోలార్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చులతో ఈ సోలార్ విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేస్తుందని వివరించారు. సోలార్ విద్యుత్ సంవత్సరం మొత్తం ఉత్పత్తి అవుతుందన్నారు. వ్యవసాయ పనులు సంవత్సరంలో ఏడు నెలలు మాత్రమే ఉంటాయి, కాలువలు ద్వారా నీటి సౌకర్యం అందుతుంది అన్నారు. ఈ సమయాల్లో ఉత్పత్తి అయిన విద్యుత్ ను విద్యుత్ సంస్థలకు విక్రయించి రైతులు ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులు పంటల ఉత్పత్తి తో పాటు సోలార్ విద్యుత్తు ఉత్పత్తి ద్వారా డబ్బులు సంపాదించాలనేదే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలని డిప్యూటీ సీఎం తెలిపారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం రైతులు పొలంలో ఒక సోలార్ షెడ్డు వేసుకుంటే విద్యుత్ ఉత్పత్తి తో పాటు ఆ షెడ్డు లో విశ్రాంతి తీసుకోవచ్చు, గేదెలను కట్టేయవచ్చు, పనిముట్లు దాచుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాల పైన సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అన్నారు. వాతావరణం కలుషితం అయితే రకరకాల అనారోగ్యాలు ఏర్పడుతున్నాయన్నారు.

వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తిని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని తెలిపారు. రైతులు వరి పంట కోత అయ్యాక మిగిలిన వ్యర్ధాలకు నిప్పు పెడుతున్నారు. ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని, ఈ తరహా చర్యలు రైతులు చేపట్టవద్దని డిప్యూటీ సీఎం కోరారు. బహిరంగ సభకు ముందు రావినూతల గ్రామంలో ఓ ఇంట్లో ఏర్పాటుచేసిన సోలార్ విద్యుత్తు ప్లాంటు పనితీరును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, విద్యుత్ శాఖ, రెడ్కో అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్ పి డి సి ఎల్ సిఎండి వరుణ్ రెడ్డి, రెడ్కో ఎండి అనిల్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, తహసిల్దార్ మద్దెల రమాదేవి, ఎంపీడీవో రురావత్ రమాదేవి, మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య, మధిర విద్యుత్ బండి శ్రీనివాసరావు, బోనకల్ విద్యుత్ సబ్ డివిజన్ ఏడిఈ వైవి ఆనందరావు, ఏఈ తోకల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -