– టీఎస్ యూటీఎఫ్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణలో జిల్లా కార్యదర్శి టి. శివలింగం
నవతెలంగాణ – రాయపోల్
సీపీఎస్ విధానం రద్దు చేసి, పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని జీవో నెం.25 సవరణ చేయాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి టి. శివలింగం అన్నారు. సోమవారం రాయపోల్ మండల వనరుల కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా టీఎస్ యుటిఎఫ్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను కాలగర్భంలో కలిపే ప్రయత్నాలు చేయవద్దని, ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని, 50 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని టీఎస్ యూటీఎఫ్ రాయపోల్ మండల కమిటీ డిమాండ్ చేసింది.
ఇప్పుడున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల కేటాయింపు చేయడం అశాస్త్రీయమని, అసంబద్ధమైన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరింది. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం తగదన్నారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానం, జాతీయ విద్యా విధానం–2020ను రద్దు చేయాలనే డిమాండ్లతో ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలో ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాయపోల్ మండల టీఎస్ యూటీఎఫ్ నాయకులు శ్రీనివాస్, శ్రీధర్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీకాంత్, కరుణాకర్, రాజు, విల్సన్, అర్జున్, ఉపాధ్యాయులు హనుమంత రెడ్డి, నవీన్, పల్లవి, బాల్ లక్ష్మి, సీఆర్పీలు యాదగిరి, ఎల్లా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



