– తర్జన భర్జన పడుతున్న నాయకులు
– ఊపందుకున్న కుల,మత,బంధుత్వ సమీకరణలు
– కీలకంగా మారనున్న సీపీఐ(ఎం)
– వేడెక్కిన మున్సిపల్ రాజకీయం
నవతెలంగాణ – అశ్వారావుపేట
తొలిసారి ఎన్నికలు జరగనున్న అశ్వారావుపేట మున్సిపాల్టీ లో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. ఇంత చలి లోనూ రాజకీయం వేడెక్కి ఏ నలుగురు కలిసినా వార్డులు, రిజర్వేషన్ లు సామాజిక సమీకరణలే చర్చిస్తున్నారు. రిజర్వేషన్ పరంగా 22 వార్డుల్లో 11 వార్డులకు మహిళలకే అవకాశం దక్కడం,చైర్మన్ గిరీ జనరల్ మహిళలకే అవకాశం రావడంతో సతులు ను గెలిపించుకునే పనిలో పతులు వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ(ఎం), టీడీపీ, జనసేన లు పోటీ కి సిద్దం అవడంతో మండల స్థాయి నాయకులు సైతం ఎవరితో పొత్తు ఎవరికి లాభం, ఏ ఏ సమీకరణలతో పొత్తు లాభదాయకం, పొత్తు ఉంటే ఏ ఏ వార్డు ఎవరికి కేటాయించాలి అనే అంశంలో తర్జన భర్జనలు పడుతున్నారు. ఇదిలా ఉండగా పంచాయితి ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ(ఎం) లకు వచ్చిన సీట్లు, ఓట్లు ఆ ఎన్నికల్లో అనుభవాలను నాయకులు మరో సారి బేరీజు వేసుకుంటున్నారు.
మేజర్ పంచాయితి గా ఉన్న అశ్వారావుపేట లో సర్పంచ్ గా రెండు దఫాలు సీపీఐ(ఎం) జిల్లా స్థాయి నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య నెగ్గిన చరిత్ర ఉండటంతో సీపీఐ(ఎం) సైతం మున్సిపాల్టీ ఎన్నికల్లో తన సత్తా చాటడానికి సమాయత్తం అవుతుంది.దీనికి సంబంధించిన ఎత్తుగడలు నాయకులు అవలంబిస్తున్నారు.
కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లోనూ పాత – కొత్త వర్గాల పోరు తప్పేట్టు లేని పరిస్థితులే కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ లోనూ కమ్మ – వెలమ – కాపు సామాజిక వర్గాల పోరు అధిష్టానానికి తలనొప్పిగా మారిందనే చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉండటం,బీఆర్ఎస్ పంచాయితి ఎన్నికల్లో పుంజుకోవడంతో ఈ ఇరు పార్టీలు చర్చిస్తున్నారు. టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, జనసేన లు కూటమిగా ఏర్పడటానికి ఆయా పార్టీలు సన్నాహాలు చేస్తున్నారు.
సామాజిక వర్గాల వారీగా వైశ్యులు,కమ్మ,వెలమ,కాపు కులాలు నుండి వారి ప్రాతినిధ్యం నిలుపుకోవాలని సమీకరణలు బేరీజు వేసుకుంటున్నారు. చూడాలి మరి ఏ పార్టీ ఏ కులానికి ప్రాధాన్యత ఇస్తుందో, ఓటర్లు ఏ పార్టీ కి, ఏ కులానికి అవకాశం ఇస్తారో…



